కాంగ్రెస్ ఇప్పటికే చేతులెత్తేసింది
అభివృద్ధి సంక్షేమమే టిఆర్ఎస్ లక్ష్యం
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
సర్జికల్ స్ట్రైక్స్ అభివృద్ధి, నిరుద్యోగం, పేదరికం మీద చేయండని అన్నారు. బాంబులు వేసే వాళ్ళు, కులకొట్టే వాళ్ళు కావాలా, అభివృద్ధి, నిర్మాణం చేసే వాళ్ళు కావాలా ఆలోచించండి అని మంత్రి హరీష్ రావు అన్నారు. పటాన్ చెరు పట్టణ మున్నూరు కాపు సంఘం ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హాజరై మాట్లాడుతూ..ప్రజలు ప్రశాంత వాతావరణం కోరుకుంటున్నారని తెలిపారు. ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడే పెట్టుబడులు పుష్కలంగా వొస్తాయని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ చరిత్ర ప్రజలందరికీ తెలుసని, మతం పేరుతో ప్రజల మధ్య విభజన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చేతులెత్తేసిందని, అంతర్గతంగా బిజెపి అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తుందన్నారు. కెసిఆర్ నాయకత్వం బలపడాలంటే జీహెచ్ఎంసీ ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్జికల్ స్ట్రైక్‌కి సంబంధం ఉందా అని ప్రశ్నించారు. ఒక పక్క ముఖ్యమంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తుంటే మరోపక్క బిజెపి నాయకులు బాంబులు వేస్తాం, సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటూ విషం చిమ్ముతున్నారన్నారు.