Take a fresh look at your lifestyle.

సిఎం కేసీఆర్‌ ‌కారణజన్ముడు…

  • కేసీఆర్‌ ‌లేకుంటే తెలంగాణ రాష్ట్రం, కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌లేదు
  • మూడున్నర ఏండ్లలో ప్రపంచంలోనే ఎత్తైన ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌నిర్మాణం
  • కేంద్రం సహకరించకున్నా ఆగని అభివృద్ధి
  • సిఎం కేసీఆర్‌ ‌బర్త్‌డే వేడుకల్లో రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు

సిద్ధిపేట ప్రజాతంత్ర బ్యూరో, చిన్నకోడూర్‌, ‌ఫిబ్రవరి 17 : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు లేకుంటే తెలంగాణ రాష్ట్రం, కాళేశ్వరం ప్రాజెక్టు లేవనీ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిఎం కేసీఆర్‌ ‌బర్త్ ‌డే సందర్భంగా గురువారం సిద్ధిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో గల రంగనాయకసాగర్‌ ‌రిజర్వాయర్‌ ఎడమ కాలువ ద్వారా రైతులకు మంత్రి హరీష్‌రావు నీళ్లను విడుదల చేశారు. అక్కడే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ను కట్‌ ‌చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..కేసీఆర్‌ ‌లేకపోతే స్వరాష్ట్రం తెలంగాణ లేదు..తెలంగాణ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌లేదు… రంగనాయకసాగర్‌ ‌జలాశయం ఉండేది కాదు. సిద్దిపేట ప్రాంతానికి సాగు జలాలు వొచ్చేవి కావన్నారు. కేసిఆర్‌ ‌కారణ జన్ముడు. గొప్ప కార్యం కోసం పుట్టిన మహాత్ముడు అని కొనియాడారు. స్వరాష్ట్రం తెలంగాణను స్వప్నించిండు, సాకారం చేసిండు, సిఎంగా ప్రజల ఆకాంక్షలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారన్నారు. గుక్కెడు నీళ్ల కోసం తపించిన తెలంగాణను సమృద్ధిగా సాగు జలాలతో ఆకుపచ్చ తెలంగాణ, సస్య శ్యామల తెలంగాణ అయ్యేలా చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.

అన్ని వర్గాలు, ప్రాంతాల అభివృద్ధి కోసం సిఎం కృషి చేస్తున్నారనీ అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన సహకారం రాకున్నా అత్యుత్తమ ఆర్థిక విధానాలతో తెలంగాణ అన్ని రంగాలలో ముందంజలో నిలుస్తుందన్నారు. 7 సంవత్సరాలలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా, దిక్సూచిగా నిలిపారన్నారు. అత్యుత్తమ ఆర్థిక విధానాలతో ఏడేండ్లలో తెలంగాణ జిఎస్‌డిపిని రెట్టింపు చేశారన్నారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణను నెంబర్‌ 1‌గా నిలిపారన్నారు. కేంద్రం అనేక షరతులు, నిబంధనలు పెడుతూ.. ప్రాజెక్ట్‌లకు నిధులు రాకుండా అడ్డుపడుతుందన్నారు. పవర్‌ ‌ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌, ఆర్‌ఈసి నుంచి అప్పుగా నిధులు రాకుండా అడ్డుపడుతుందన్నారు. అనేక అడ్డంకులు కేంద్రం సృష్టిస్తున్న … తెలంగాణ అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగుతుందన్నారు. రైతుల ఆకాంక్షల మేరకు ఎడమ కాలువ ద్వారా సాగు జలాల విడుదల చేశామన్నారు. సిద్ధిపేట జిల్లాతో పాటు సిరిసిల్ల, మానకొండూరు, హుస్నాబాద్‌ ‌నియోజవర్గంకు ఎడమ కాలువ ద్వారా సాగునీరు అందనుందన్నారు.

యాసంగిలో బంగారు పంటలు పండుతున్నాయన్నారు. పాత రోజుల్లో యాసంగి పంట అనగానే కాలిపోయే మోటర్లు, పేలిపోయిన ట్రాన్స్ ‌ఫార్మర్లు గుర్తుకు వొచ్చేవన్నారు. లెక్కకు మించి బోర్లను తవ్వే పరిస్థితి ఉండేదన్నారు. కలలో ఊహించని విధంగా మూడున్నర ఏండ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించుకున్నామన్నారు. 24 గంటల నాణ్యమైన కరెంట్‌, ‌సకాలంలో ఎరువులు, విత్తనాలతో సమకూర్చుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజారాధాకృష్ణశర్మ, ఎంపిపి కూర మాణిక్యరెడ్డి, సర్పంచి సూరగోని చంద్రకళరవిగౌడ్‌, ‌టిఆర్‌ఎస్‌ ‌నేతలు, ప్రజాప్రతినిధులు వేలేటి రాధాకృష్ణశర్మ, మారెడ్డి రవీందర్‌రెడ్డి,  కాముని శ్రీనివాస్‌, ‌సూరగోని రవిగౌడ్‌, ‌కిష్టారెడ్డి, బాల్‌రెడ్డి, రాజశ్రీ, భూంరెడ్డి, బొడిగె సదానందంగౌడ్‌, ‌మేడికాయల వెంకటేశంతో పాటు టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలోనూ మునిసిపల్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.

Leave a Reply