Take a fresh look at your lifestyle.

కేంద్రం గుప్పిట్లో అధికారాలు..రాష్ట్రాలకేమో అవస్థలు

  • ఆక్సిన్‌, ‌వ్యాక్సిన్‌ ‌సరఫరాలో కేంద్రం విఫలం
  • పైగా రాష్ట్రాలపై విమర్శలు చేయడమా..సిగ్గుసిగ్గు
  • దేశం సాయం చేసే స్థాయి నుంచి..అడుక్కునే స్థాయికి చేరింది
  • బిజెపి నేతల తీరుపై మండిపడ్డ మంత్రి ఈటెల రాజేందర్‌

‌కొరోనా రోగులు సరిపడా ఆక్సిజన్‌ ‌లేక చనిపోవడం దేశానికి అవమానకరం అని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే వ్యవహరిస్తే ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంటుందన్నారు. అవసరమైన ఆక్సిజన్‌ను కేంద్రం యుద్ధ ప్రతిపాదికన సరఫరా చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులపై మంత్రి ఈటల రాజేందర్‌ ‌నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారు. అన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకుని రాష్ట్రాలపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించి మాట్లాడితే బాగుంటుం దన్నారు. తెలంగాణలో 4 రాష్ట్రాలకు చెందిన రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మేం కేంద్రాన్ని విమర్శించట్లేదు.. వారే విమర్శిస్తున్నారు. కొరోనా కట్టడిలో దేశంలోనే సమర్థంగా వ్యవహరిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు.

సాయం చేసే స్థితి నుంచి చిన్న దేశాల సాయం పొందే పరిస్థితి భారత్‌కు వచ్చిందని ఈటల రాజేందర్‌ అన్నారు. తెలంగాణకు 600 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌ ‌కావాలని కోరాం. కానీ రాష్ట్రానికి 306 మెట్రిక్‌ ‌టన్నుల ఆక్సిజన్‌ను మాత్రమే కేటాయించింది. రాష్ట్రానికి దగ్గర ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ ఇవ్వాలని కోరినప్పటికీ వేల కిలోమిటర్ల దూరంలో ఉన్న రాష్ట్రాల నుంచి ఆక్సిజన్‌ ‌ను కేటాయించారు. ఇది ఎంతవరకు సమంజసమో కనీసం రాష్ట్ర నేతలయినా ఆలోచించారా అన్నారు. ఆక్సిజన్‌, ‌వ్యాక్సిన్‌ ‌కొరతలను తీర్చకుండా తెలంగాణపై విమర్శలు చేయడం బిజెపి నేతలకు సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని మంత్రి ఈటల డిమాండ్‌ ‌చేశారు. వ్యాక్సిన్‌ ‌డోసుల ఉత్పత్తి యుద్ధ ప్రతిపాదికన పెరగాలి. వ్యాక్సిన్‌ ‌లేకపోతే గందరగోళమవుతుందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో 18-44 ఏండ్ల మధ్య వారికి 3.5 కోట్ల టీకాలు కావాలి. రెండు కంపెనీల ఉత్పత్తి 6 కోట్లే అంటున్నారు. వ్యాక్సిన్‌ ‌విషయంలో కేంద్రం స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాలి అని ఈటల డిమాండ్‌ ‌చేశారు. రెమ్‌డెసివివర్‌ ‌తక్కువకు తయారు చేసి ఎక్కువకు అమ్ముతున్నారు. దీనిపై కేంద్రం దృష్టి సారించి రెమ్‌డెసివిర్‌ ‌లాంటి ఔషధాల ఉత్పత్తి పెంచాలి. ఔషధాలపై కేంద్రం నియంత్రణ చేయడం కాదు.. సరిపడా డోసులు పంపాలన్నారు.

ఔషధాలు బ్లాక్‌ ‌మార్కెట్‌కు పోకుండా చూడాలన్నారు. కొరోనా టెస్టింగ్‌ ‌కిట్ల ధరలు కూడా పెంచారు. కేంద్రానికి అన్నింటిపైనా నియంత్రణ ఉండాలి. కొరోనా కట్టడిలో రాష్ట్రాలను తప్పుబడుతున్న కేంద్రం ఏం చేసింది? అని ప్రశ్నించారు. 3.5 కోట్ల టీకాలు 3 నెలల్లో ఇవ్వాలని అనుకుంటున్నాం. దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇస్తుందా? అని అడిగారు. జాతీయ విపత్తు సమయంలో కేంద్రం అన్నింటినీ నియంత్రణ చేయలేదా? అని మంత్రి ఈటల రాజేందర్‌ ‌ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదిలావుంటే తెలంగాణలో లాక్‌డౌన్‌ ‌పెట్టే ఆలోచన లేదని మంత్రి ఈటల రాజేందర్‌ ‌స్పష్టం చేశారు. నేటినుంచి 19 జిల్లా డయాగ్నొస్టిక్‌ ‌హబ్‌లు ప్రారంభిస్తామన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి జిల్లా డయాగ్నొస్టిక్‌ ‌కేంద్రాల్లో రక్త పరీక్షలు నిర్వహిస్తామన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు 3, 4 రోజులకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఔషధాలు, ఆక్సిజన్‌ ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటల హెచ్చరించారు.

తెలంగాణలో ఆంధప్రదేశ్‌, ‌కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రాలకు చెందిన రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కేంద్రం కేటాయించే వ్యాక్సిన్లను బట్టి రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ‌పక్రియ కొనసాగుతుందన్నారు. టీకాలు వచ్చే పరిస్థితిని బట్టి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. 3.5 కోట్ల టీకాలు 3 నెలల్లో ఇవ్వాలని అనుకుంటున్నాం. దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇస్తుందా? అని ప్రశ్నించారు. ఏఎన్‌ఎం‌లు ఇంటింటికీ వెళ్లి టీకా వేసే అవకాశం ఉంది. టీకా, కొవిడ్‌ ‌పరీక్షలు వేర్వేరు కేంద్రాల్లో ఉండాలన్న వాదన కూడా ఉందన్నారు. దీనిపై ఆలోచిస్తామన్నారు. వ్యాక్సిన్ల కోసం పకడ్బందీగా కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి ఈటల రాజేందర్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply