Take a fresh look at your lifestyle.

కొరోనా విజృంభిస్తుంటే… మంత్రి ఈటల ఎన్నికల ప్రచారమా ?

రాజకీయ పార్టీల విమర్శలు
వైద్య సంఘాల ఆసంతృప్తి
వారం క్రితమే ఎంజిఎంలో ఆరుగురి మృతి
‌తెలంగాణలో కొరోనా విజృంభిస్తున్న వేళ….స్వయంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఓవైపు ర్యాలీలు, బహిరంగ సమావేశాలతో కొరోనా శరవేగంగా విస్తరిస్తున్న సమయంలో ఎన్నికల ప్రచారానికి టీఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావాలని కోరడం ఎంత వరకు సమంజసమనని ప్రశ్నిస్తున్నాయి. వరంగల్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పక్షాన మంత్రి ఈటల రాజేందర్‌ ‌నగరంలో ప్రచారం నిర్వహించడంపై రాజకీయ పార్టీలతో పాటు వైద్య సంఘాలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితం వరంగల్‌ ఎం‌జిఎం హాస్పిటల్‌లో ఒకే రోజు 6 మంది కోరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. అదే రోజు ఆ హాస్పిటల్‌లో వైద్య సదుపాయాలు సరిగా లేవని మరో రోగి చికిత్స మధ్యలోనే హాస్పిటల్‌ ‌నుంచి వెళ్లిపోయాడు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో స్వయంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హోదాలో ఈటల వరంగల్‌ ఎం‌జిఎం హాస్పిటల్‌ను సందర్శించారు. ఎంజిఎం హాస్పిటల్‌ ‌వైద్యులతో సమావేశమై కొరోనా పరిస్థితిని సమీక్షించి బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ఘటన జరిగిన వారం రోజులకే అదే మంత్రి టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థుల పక్షాన ప్రచారానికి రావడంపై రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి.

ఈటలకు ప్రజల ప్రాణాల కంటే తమ పార్టీ అభ్యర్థుల గెలుపే ప్రధానమా అంటూ మండిపడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ప్రజలు ఒకే చోట గుమికూడ వద్దనీ, దీంతోనే కొరోనా మరింతగా విజృంభించే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్‌ ‌సైతం ఆంక్షలు విధించింది. దీనిని కూడా మంత్రి ఈటల ఉల్లంఘించారనీ, ప్రజలు కొరోనా నిబంధనలు పాటించకుంటే వారించాల్సిన మంత్రే ఆంక్షలు ఉల్లంఘిస్తే ఇక ప్రజలకు ఏమని చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, మంత్రి ఈటల వరంగల్‌ ‌నగరంలో ప్రచారంపై వైద్య సంఘాలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. స్వయంగా వైద్య శాఖ మంత్రే ప్రజలను పోగు చేస్తే ఇక ప్రజలను కాపాడేది ఎవరని ప్రశ్నిస్తున్నారు. మంత్రి బహిరంగ సభకు 1000 మంది వస్తారని అనుకుంటే వారిలో కనీసం ఇద్దరికి కొరోనా వచ్చినా వారి నుంచి మరో 10 మందికి వ్యాపించే ప్రమాదం ఉందనీ, ఈ పరిస్తితుల్లో ఓ వైపు కొరోనా కట్టడి అని చెబుతూనే మరోవైపు, దానిని వ్యాప్తింపచేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply