Take a fresh look at your lifestyle.

వరంగల్‌, ‌ఖమ్మం కార్పొరేషన్లలలో కనీస అవసరాలపై దృష్టి : సమీక్ష సమావేశంలో మంత్రి కెటిఆర్‌

కార్పొరేషన్లలో పౌరుల కనీస అవసరాలను తీర్చేందుకు ప్రధానంగా దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్‌ ‌దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌ ఏసీ గార్డ్‌న్‌లోని పురపాలక శాఖ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు, హౌసింగ్‌ ‌పైన ప్రధాన దృష్టి సాధించి ఎప్పటికప్పుడు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం, పట్టణంలోని ఇతర మౌలిక వసతుల కార్యక్రమాల పురోగతిని సమీక్షించాలని జిల్లా మంత్రులకు కేటీఆర్‌ ‌సూచించారు. పనుల్లో ప్రాధాన్యత క్రమంలో ముఖ్యమైన కార్యక్రమాలను వెంటనే పూర్తయ్యేలా కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్‌, ‌కార్పొరేషన్ల కమిషనర్లను ఆదేశించారు. ఇందుకోసం పురపాలక శాఖ తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్ల కమిషనర్లకు ఒకరోజు శిక్షణ సమావేశాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. పట్టణాలను ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు ప్రాధాన్యతల గుర్తింపు పైన ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. వరంగల్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలోని నియోజకవర్గాల వారీగా చేపట్టిన వివిధ కార్యక్రమాలను సమీక్షించిన మంత్రులు మౌళిక వసతుల నిర్మాణ కార్యక్రమాల్లో కాంట్రాక్టర్ల అలసత్వం ఉంటే వాటిని ఇతర కాంట్రాక్టర్లకు అప్పజెప్పాలని ఆదేశించారు. డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి నిధుల కొరత లేకున్నా ఆలసత్వం జరిగిందన్నారు. వర్కింగ్‌ ఏజెన్సీల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

వరంగల్‌, ‌ఖమ్మం పట్టణాల్లో రోడ్ల నిర్వహణ తో పాటు, ఫుట్‌ ‌పాత్‌ల నిర్మాణం, గ్రీనరీ ఏర్పాటు, జంక్షన్ల అభివృద్ధి, టాయిలెట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న తాగునీటి సౌకర్యం, ప్రస్తుతం చేపడుతున్న తాగునీటి సంబంధిత మౌలిక వసతుల కార్యక్రమాలపై మంత్రి సమీక్షించారు. విలీన గ్రామాల్లో నూతన మున్సిపాలిటీ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేయాలన్నారు. ఈనెల మూడో వారంలో వరంగల్‌, ‌ఖమ్మం పట్టణాల్లో స్వయంగా పర్యటిస్తానని కెటిఆర్‌ ‌తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు, సత్యవతి రాథోడ్‌, ‌పువ్వాడ అజయ్‌, ‌చీఫ్‌ ‌విప్‌ ‌దాస్యం వినయ్‌ ‌భాస్కర్‌, ‌పరకాల ఎమ్మెల్యే ధర్మ రెడ్డి, కడియం శ్రీహరి, ఖమ్మం వరంగల్‌ ‌జిల్లాల కలెక్టర్లు, కార్పొరేషన్ల కమిషనర్లు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!