“2016లో జరిగిన ఐదు రాష్ట్రాల 824 అసెంబ్లీ సీట్లలో భాజపా 64 మాత్రమే గెలిచింది. అస్సామ్‌లో ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. నేడు అస్సామ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి భాజపా పావులు కదుపుతూ, ఇతర రాష్ట్రాలలో తన బలాన్ని పెంచుకోవడానికి ప్రణాళికలు అమలు పరుస్తున్నది. గత 14 మాసాలుగా ఢిల్లీలో జరుగుతున్న రైతుల పోరాటం కూడా అసెంబ్లీ ఎన్నికల మీద ప్రభావాన్ని చూపవచ్చు. కాంగ్రెస్ మరియు భాజపాలు జాతీయ పార్టీలైనప్పటికీ ప్రాంతీయ పార్టీలకు తోక పార్టీలుగా మారడం దేశవ్యాప్తంగా నేటి రాజకీయాలలో సాధారణమై పోయింది.”
27 మార్చి 2021న ప్రారంభం కానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పార్టీలు, నాయకులు చేయని ప్రయత్నాలు లేవు, పడని పాట్లు కనిపించవు. అస్సామ్ (126 సీట్లు), పశ్చిమ బెంగాల్ (294), తమిళనాడు (234), కేరళా (140) మరియు కేంద్రపాలిత ప్రాంతం పాండుచ్చేరీ(30)లలో ఎన్నికల ఫలితాలు 02 మే రోజున రానున్నాయి. ఐదేళ్ల క్రితంతో పోల్చితే నేటి ఎన్నికలలో చిత్ర విచిత్రాలు, ఫిరాయింపు, వాగ్దానాల సునామీలు, వోటర్లకు గాలాలు, పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడాలు లాంటి ఆటలు బయట పడుతున్నాయి. ఐదు రాష్ట్రాలలో భాజపా పాగా వేయడానికి, సీట్లను మరియు వోట్లను పెంచుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ, సాంప్రదాయ వోటర్లను ఆకట్టుకునే ప్రయాస పడుతున్నది. 2016లో జరిగిన ఐదు రాష్ట్రాల 824 అసెంబ్లీ సీట్లలో భాజపా 64 మాత్రమే గెలిచింది. అస్సామ్‌లో ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. నేడు అస్సామ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి భాజపా పావులు కదుపుతూ, ఇతర రాష్ట్రాలలో తన బలాన్ని పెంచుకోవడానికి ప్రణాళికలు అమలు పరుస్తున్నది. గత 14 మాసాలుగా ఢిల్లీలో జరుగుతున్న రైతుల పోరాటం కూడా అసెంబ్లీ ఎన్నికల మీద ప్రభావాన్ని చూపవచ్చు. కాంగ్రెస్ మరియు భాజపాలు జాతీయ పార్టీలైనప్పటికీ ప్రాంతీయ పార్టీలకు తోక పార్టీలుగా మారడం దేశవ్యాప్తంగా నేటి రాజకీయాలలో సాధారణమై పోయింది.
పశ్చిమ బెంగాల్లో 2016 ఎన్నికల్లో 3 సీట్లు మాత్రమే గెలిచిన భాజపా 2019 లోకసభ ఎన్నికల్లో 42 సీట్లకుగాను 18 యంపీ సీట్లు చేజిక్కించుకొని 40.64 శాతం వోట్లను పొంది అనూహ్య విజయాలను నమోదు చేసింది. నేడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల వైపు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మైనారిటీ జనాభా అధికంగా 28 -32 శాతం ఉన్న పశ్చిమ బెంగాల్లో తృణముల్ మరియు భాజపా అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. హిందూ వోటర్లందరినీ ఏకతాటిపైకి తేవడానికి మోదీ-షా ద్వయం ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలను 8 సెగ్మెంట్లుగా విభజించి నిర్వహించడాన్ని మమతా దీదీ వ్యతిరేకిస్తున్నది. అత్యంత దూకుడు స్వభావం కలిగిన మమతా బెనర్జీ నాయకత్వాన్ని చిన్న చూపు చూడడానికి ఆస్కారం లేదని భాజపా, కాంగ్రేస్ మరియు సిపియం పార్టీలకు తెలుసు. భాజపా పక్షాన కైలాస్ విజయవర్గీయ నేతృత్వంలో మమత సన్నిహితులైన తృణముల్ ప్రముఖ నాయకులను తన వైపుకు తిప్పు కోవడంలో కాషాయ పార్టీ సఫలీకృతం అవుతున్నది. మమత కోటలో ఆపరేషన్ ఆకర్ష్ అమలు పరుస్తూనే ‘భాజపాతోనే బంగారు బంగ్లా’ అనే నినాదంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్, సిపియంల చుట్టరికం ఏన్ని వోట్లను రాల్చుతుందో చూడాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని 23 జిల్లాల్లో 09 జిల్లాలు మాత్రమే 62 శాతం వోటర్లను కలిగి 185 అసెంబ్లీ సీట్లను (294 సీట్లలో) కలిగి ఫలితాలను తారుమారు చేయవచ్చు. బెంగాల్లో దాదాపు 30 శాతం ముస్లిమ్ వోటర్లు తృణముల్ వైపుననే ఉంటూ వస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీకి చెందిన యంఐయం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తే తృణముల్ వోట్లకు గండి పడడం ఖాయం అంటున్నారు.
అస్సామ్ మరియు కేరళలో కూడా మైనారిటీ వోటర్లు ఎక్కువగానే ఉన్నప్పటికీ భాజపా రాజకీయ చదరంగంతో సీట్లను, వోట్లను కొల్లగొట్టే ప్రయత్నాలు జరుతున్నాయి. అస్సామ్‌లో సిఏఏ (సిటిజెన్షిప్ అమెండ్మెంట్స్ ఆక్ట్) మరియు యన్ఆర్సి (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్)లు ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా నిలువనున్నాయి. అస్సామ్‌లో బంగ్లాదేశీయుల అక్రమ చొరబాట్లను కట్టడి చేసే చట్టాలు రావడం రాష్ట్రవాసులకు హితకరమైనప్పటికీ, ఈ చట్టాలతో అస్సామ్ వాసులకు కొన్ని అనుమానాలు కూడా ఉండవచ్చు. ఈ క్రమంలో జరిగిన షాహీన్ భాఘ్ అల్లర్లలలో 65 మందికి పైగా మరణాలు జరిగాయి. గతంలో జరిగిన పలు సున్నిత రాష్ట్ర అంశాలు కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావాన్ని చూపే అవకాశం లేక పోలేదు. ప్రధాని మోదీ, అమిత్ షా మరియు జె పి నడ్డా అనుభవాన్ని పునాదిగా చేసుకొని భాజపా ప్రచారంలో ముందున్నది. అనాదిగా రాజ్యమేలిన కాంగ్రెస్ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారడం, ప్రాంతీయ పార్టీలను ఆశ్రయించడం చూస్తున్నాం.
ఈ ఐదు రాష్ట్రాలలో అధికార పార్టీకి వోటర్ల ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీచే అవకాశాలు కూడా లేక పోలేదు. 2016లో కాంగ్రెస్-డియంకె విఫలయత్నంతో ఏఐఏడియంకె అధికారంలోకి వచ్చింది. కరునానిధి లేని డియంకె, జయలలిత లేని ఏఐఏడియంకె పార్టీల బలహీనతలను వోట్లుగా మలుచుకోవడానికి, తమిళనాడులో తన ఉనికిని చాటుకోవడానికి భాజపా, కాంగ్రెసులు రణ నీతి రచిస్తున్నాయి. స్టాలిన్ నేతృత్వంలోని డియంకె మరియు అంతర్గత కుమ్ములాటలతో నడుస్తున్న ఏఐఏడియంకె మధ్య ప్రధాన పోరు జరిగితే, భాజపా మరియు కాంగ్రెస్‌లు తమిళ ప్రాంతీయ పార్టీల పొత్తులతోనే సర్దుకు పోవలసిన దుస్థితిలోనే ఉన్నాయనేది నిపుణుల అభిప్రాయం. చిన్నమ్మ శశికళ రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించి రాజకీయ విశ్లేషణకులను ఆశ్చర్యంలో ముంచెత్తడం కొస మెరుపు.
కేరళలో యల్డియఫ్ ప్రభుత్వం మరో సారి తన సత్తా చాటుకోవాలని చూస్తున్న తరుణంలో ప్రభుత్వ వ్యతిరేకతను తనవైపు మలుచుకునేలా భాజపా వ్యూహాలకు పదును పెడుతున్నది. గత నాలుగు దశాబ్దాలుగా కేరళ అసెంబ్లీలో లెఫ్ట్ పార్టీల కూటమి యల్డియఫ్ మరియు కాంగ్రెస్‌తో కూడిన యూడియఫ్ పార్టీలు మాత్రమే ప్రభుత్వాలను ఏర్పరుస్తూ వస్తున్నాయి. కేరళలో కాంగ్రెస్‌తో లెఫ్ట్ పార్టీల మధ్య పోరు జరిగితే, ఇతర రాష్ట్రాలలో ఈ పార్టీలు కలిసి పోటీ చేయడం విచిత్రంగా తోస్తున్నది. ప్రభుత్వంలోని యల్డీయఫ్ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ మరియు భాజపాలు శ్రమించాల్సిందే.
పాండిచ్చెరీ కేంద్ర పాలిత ప్రాంతంలో 33 అసెంబ్లీ సీట్లలో 3 సీట్లు నామినేటెడ్ కేటగిరీలో ఉండగా 30 సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. పాండీచ్చెరీలో 88 శాతం తమిళం మాట్లాడే ప్రజలు ఉండగా, తెలుగు, మలయాళం , ఉర్దూ మరియు హిందీ మాట్లాడే జనులు కూడా ఉన్నారు. సియం నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిన తరుణంలో రాష్ట్రపతి పాలన విధించిన వేళ ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్‌తో డియంకె మరియు లెఫ్ట్ పార్టీల కూటమి అధికారంలోకి రావడానికి ప్రణాళికలు వేస్తున్నది. భాజపాతో ఏఐయన్ఆర్సి, ఏఐఏడియంకె మరియు ఇతర చిన్న పార్టీల కూటమి కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు కృషి చేస్తున్నది.
ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో 824 ఎమ్మెల్యేలను ఎన్నుకోనున్నారు. నేటి ఫలితాలు భవిష్యత్తులో 116 యంపీ స్థానాల ఎన్నికల్లో ప్రభావాన్ని చూపనున్నాయి. కేరళ మరియు అస్సామ్‌లలో కాంగ్రెస్ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు పరీక్ష పెట్టనున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా తన వోట్ల శాతాన్ని పెంచుకొని, బెంగాల్ మరియు అస్సామ్‌లలో అధికారాన్ని చేజిక్కించుకునే విశ్వ ప్రయత్నాలు చేయడం ఖాయంగా తోస్తున్నది. ప్రజాస్వామ్యంలో సిద్ధాంతాలు, ఎన్నికల మానిఫెస్టోల ఆధారంగా జరగాల్సిన ఎన్నికల్లో నోట్ల కట్టలు, ఫిరాయింపులు, మద్యం ప్రవాహాలు, అసాధ్య వాగ్దానాలు లాంటి అనారోగ్యకర అనైతిక అంశాలు ప్రధాన భూమిక నిర్వహిస్తే, ఏ పార్టీలు గెలిచినా, ప్రజలు మరియు ప్రజాస్వామ్యం ఓడి పోయినట్లే అని నమ్మాలి.

జాతీయ ఉత్తమ అధ్యాపక ఆవార్డు గ్రహీత , విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ, కళాశాల
కరీంనగర్ – 99497 00037