Take a fresh look at your lifestyle.

కోవిడ్ -19 విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మాన‌సిక ఆరోగ్యానికి ప్రాధాన్య‌త‌

ఈ మహమ్మారి పై పోరాటంలో భాగంగా వారాలు, నెల‌లు మాత్ర‌మే కాదు..సంవ‌త్స‌రాల‌పాటు స‌మ‌యం ప‌డుతుంది. అంత‌వ‌ర‌కూ దృఢంగా, ధైర్యంగా, ద‌య‌తో, మనుషులుగా మ‌న‌కుండాల్సిన ఔదార్య స్ఫూర్తితో, నాయ‌క‌త్వ ప‌టిమ‌తోమెల‌గాల్సిన స‌మ‌య‌మిది. రాబోయే రోజుల్లో మ‌న భ‌విష్య‌త్తు ఎలా వుంటుంది, త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో కోవిడ్ 19 ప‌రిస్థితుల‌కు అనుగుణంగా సామాజిక ప్ర‌వ‌ర్త‌న‌ల్ని అల‌వాటు చేసుకోవ‌డం, ఆర్ధిక ప‌రిస్థితులు మొద‌లైన అంశాల కార‌ణంగా అనేక మాన‌సిక స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశ‌ముంది. ఇప్పటికే సున్నితంగా వుంటున్న‌వారిని ఈ స‌మ‌స్య‌లు మ‌రింత‌గా క్రుంగ‌దీసే అవ‌కాశ‌ముంది. 

“మీరు త‌ప్ప మిమ్మ‌ల్ని ఈ ప్ర‌పంచంలో ఇంకొక‌రు కాపాడ‌లేరు. మిమ్మ‌ల్ని మీరు కాపాడుకోవడం ముఖ్యం. ఈ యుద్ధంలో అంత సులువుగా విజ‌యం వ‌రించ‌దు. అయితే ఇంత‌కంటే విలువైన విజ‌యం మ‌రొక‌టి వుండ‌దు..” – ఛార్లెస్ బుకోవ‌స్కీ.

నేప‌థ్యం

నాగ‌రిక‌మైన‌, ఆధునిక‌మైన ఈ 21వ శ‌తాబ్ద చ‌రిత్ర‌లో  ఈ స్థాయిలో ప్ర‌మాదాన్ని మాన‌వాళి ఏనాడూ ఎదుర్కోలేదు. ఇప్పుడు ఒకటి కాదు రెండు ర‌కాల ప్ర‌మాదాల‌ను మాన‌వాళి ఎదుర్కొంటున్న విపత్క‌ర ప‌రిస్థితులివి. అటు భౌతికంగాను, ఇటు మాన‌సికంగాను ప్ర‌పంచ ప్ర‌జ‌లు రెండు ప్ర‌మాదాలబారిన పడ్డారు. కోవిడ్ -19 కార‌ణంగా శారీర‌క ఆరోగ్యానికి ఏర్ప‌డే స‌మ‌స్య‌ల‌ను నిపుణులు న‌మోదు చేస్తూనే వున్నారు. ప్ర‌మాద రేటు ఎంత వుంటుంది, చికిత్స విధానాలు, కోలుకునే రేటు ఎంత వుంటుంది, వ్యూహాలు, స్వ‌యం ర‌క్ష‌ణ‌కు కావాల్సిన చిట్కాల గురించి డాక్కుమెంట్ చేయ‌డం బాగా జ‌రుగుతోంది. అయితే ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ కార‌ణంగా మ‌నిషి ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్య స‌మ‌స్య‌ల గురించి పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఆరోగ్య రంగానికి సంబంధించిన వారంద‌రూ త‌మ దృష్టిని పెట్టాల్సిన అంశ‌మిది.

మాన‌సిక ఆరోగ్యమ‌నేది క‌ళ్ల‌కు క‌నిపించ‌దు. ఇలాంటి అన‌రోగ్య స‌మ‌స్య‌ల‌కు త‌ర‌త‌రాలుగా భార‌తీయులు దేశీయ విధానాల మీద ఆధార‌ప‌డి చికిత్స చేసుకునేవారు. ఈ విధానాలు మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణం కూడా. మ‌న దేశీయ విధానాల్లో ఎక్కువ‌గా అమ‌ల్లో వున్న‌ది, అన్నిటిలో బ‌ల‌మైన‌ది మ‌న‌కు వున్న సామాజిక బంధాలు. అంద‌రికంటే ఎక్కువ వేగంగా మ‌నం సోష‌ల్ మీడియాను ఉప‌యోగిస్తున్నాం. అయితే ఈ సోష‌ల్ మీడియా అనేది మ‌నం భౌతికంగా ఏర్పాటు చేసుకునే స‌మావేశాలను, మ‌న ఉత్స‌వాల‌ను, కార్య‌క్ర‌మాల‌ను త‌గ్గించ‌లేదు. మ‌నం భౌతికంగా ఏర్పాటు చేసుకునే అన్ని స‌మావేశాలు మ‌న‌కు ఒక‌రితో మ‌రొక‌రికి బంధాల‌ను అందించే వ‌న‌రులు. ఈ స‌మావేశాల్లో క‌లుసుకునే ప్ర‌జ‌ల‌ద్వారా… వారు చెప్పే సంగ‌తులద్వారా మ‌నం సామూహికంగా మాన‌సిక శ‌క్తుల‌ను రీఛార్జ్ చేసుకోగ‌లుగుతున్నాం.

అయితే కోవిడ్ -19 మ‌హ‌మ్మారి వైర‌స్ కార‌ణంగా భౌతిక దూరం పాటించాల్సి వ‌స్తోంది. ఎందుకంటే ఈ వైర‌స్ ను నివారించాలంటే ఉత్త‌మ‌మైన విధానాల్లో ఒక‌టి మ‌నిషి మ‌నిషికి మ‌ధ్య‌న త‌గిన భౌతిక దూరం పాటించ‌డం. దాంతో మ‌నిషికి మాన‌సిక ఆరోగ్యాన్ని, ఉల్లాసాన్ని క‌లిగించే సోష‌ల్ నెట్ వ‌ర్క్ అనేది మ‌న‌కు దూర‌మ‌వుతోంది. దీనికితోడు దేశంలోని అత్య‌ధిక శాతం మంది ప్ర‌జ‌లకు, ఆయా క‌మ్యూనిటీల ప్ర‌జ‌ల‌కు చేరుతున్న స‌మాచారం ఎక్కువ‌గా భ‌యాల‌ను క‌లిగించే విధంగా వుంటోంది. అన్ని విధాలుగా భ‌విష్య‌త్ ఆందోళ‌న‌క‌రంగా వుంటుంద‌నే స‌మాచారం ప్ర‌జ‌ల‌కు ఎక్కువ‌గా చేరుతోంది. దాంతో ప్ర‌జ‌లంద‌రూ సామూహికంగా వ‌త్తిడికి, ఆందోళ‌కు గుర‌వుతూ వేగంగా మానసిక అనారోగ్యం బారిన ప‌డుతున్నారు. మ‌న‌కు అండ‌గా నిలిచే స్నేహితులు, ఇరుగుపొరుగువారు మ‌న‌కు అందించే ఆత్మీయ స్ప‌ర్శ ఇప్పుడు ల‌భించ‌డం లేదు. స్నేహ‌పూర్వ‌కంగా ఇచ్చే కౌగిలి, మ‌నం మంచి ప‌ని చేయ‌గానే మ‌న వెన్ను త‌ట్టే హ‌స్తం, మ‌న క‌న్నీళ్ల‌ను తుడిచే హ‌స్తాలు ఇప్పుడు మ‌న‌కు దూర‌మ‌య్యాయి. ఆ ప‌ని ఎవ‌రు చేయ‌కుండా నిబంధ‌న‌లు పెట్టుకున్నాం. ఈ స‌మ‌యంలో ప్ర‌ముఖ ర‌చ‌యిత మార్క్ ట్వెయిన్ హాస్య‌పూరితంగా చెప్పిన ఒక వాక్యం ఇక్క‌డ మ‌న‌కు గుర్తుకు రాక‌మాన‌దు. నేను కోల్పోయిన వ‌స్తువుల‌న్నిటిలో ముఖ్య‌మైన‌ది నా ఆలోచ‌నాశ‌క్తి అని ఆయ‌న స‌ర‌దాగా అనేవారు.

భార‌త‌దేశ మాన‌సిక ఆరోగ్య ముఖ‌చిత్రం

భార‌త‌దేశంలోకి కోవిడ్ -19 మ‌హ‌మ్మారి రాక‌ముందు దేశంలో మాన‌సిక ఆరోగ్య‌, అనారోగ్యానికి సంబంధించిన స‌మ‌స్య‌లు ఎలా వున్నాయ‌నే విష‌యాన్ని అర్థం చేసుకోవ‌డం ముఖ్యం. ఈ అంశాల నేప‌థ్యంలో ప‌రిస్థితిని స‌మ‌గ్రంగా అవ‌గాహ‌న చేసుకొని వీటి గురించి మాట్లాడాలి. ఒక స‌మాజంగా మ‌నం మానసిక ఆరోగ్యం గ‌రించిగానీ లేదా అది స‌మాజంలో లేక‌పోవ‌డం గురించిగానీ మాట్లాడాలి. మ‌నిషికి భౌతిక‌ప‌ర‌మైన అనారోగ్యాలు వ‌చ్చిన‌ప్పుడు వాటి గురించి మాట్లాడుకుంటున్నాంగానీ, మానసిక స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు వాటి జోలికే వెళ్ల‌డం లేదు. స‌మాజంలో పూర్తిగా వ్య‌తిరేక‌త వుంది. మాన‌సిక స‌మ‌స్య‌లుండ‌డం ఒక మ‌చ్చ‌గా చూస్తున్నారు. మాన‌సిక స‌మ‌స్య‌లు వున్నాయన‌గానే వాటి గురించి స్వంత అభిప్రాయాల‌తో తీర్పులు ఇస్తున్నారు.

పాశ్చాత్య దేశాల‌ను తీసుకుంటే అక్క‌డ మాన‌సిక అనారోగ్యాల‌పై మంచి అవ‌గాహ‌న వుంది. శ‌రీరంలో జ‌రిగే ర‌సాయ‌నిక, న్యూర‌ల్ అప‌స‌వ్య‌త‌ల గురించి, జెనెటిక్స్ స‌మ‌స్య‌ల గురించి ఎండో క్రైనిక్ వ్య‌వ‌స్థ ప‌ని విధానం గురించి బైట‌నుంచి వ‌చ్చే వ‌త్తిళ్ల కార‌ణంగా త‌లెత్తే మానసిక స‌మ‌స్య‌ల గురించి వారు బాగానే అర్థం చేసుకున్నారు. మ‌నిషికి వ‌చ్చే ప‌లు మాన‌సిక అనారోగ్యాల‌కు మూల కార‌ణాల‌ను వారు బాగానే అవ‌గాహ‌న చేసుకున్నారు. అయితే భార‌త‌దేశంలో మ‌న దుర‌దృష్టంకొద్దీ చ‌దువుకున్న‌వారికి సైతం వీటిపై అవ‌గాహ‌న వుండ‌డం లేదు. త‌మ ద‌గ్గ‌రివాళ్లకు, బంధువుల‌కు మాన‌సిక స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు వెంట‌నే వారికి నిపుణులైన వైద్యుల‌తో చికిత్స చేయించ‌డానికి సంకోచిస్తున్నారు. ఈ ప‌రిస్థితిని వారు ఆమోదించ‌డం లేదు.

ఈ నేప‌థ్యంలో భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి ( ఐసిఎంఆర్ ) 2017లో ప్ర‌చురించిన నివేదిక చూద్దాం. భార‌త‌దేశంలో ప్ర‌తి ఏడు మందిలో ఒక‌రు ప‌లు ర‌కాల మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్నార‌ని ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. దేశంలో మాన‌సిక వ్యాకుల‌త ( డిప్రెష‌న్ ), మాన‌సిక ఆందోళ‌న ఎక్కువ‌గా క‌నిపిస్తున్న మాన‌సిక స‌మ‌స్య‌లు. ఇవి వ‌రుస‌గా 45. 7 మిలియ‌న్, 44.9 మిలియ‌న్ ప్ర‌జ‌ల‌ను పీడిస్తున్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2020 నాటికి డిప్రెష‌న్ అనేది రెండో అతి పెద్ద మాన‌సిక స‌మ‌స్య‌గా నిలువ‌నున్న‌ద‌ని గ్లోబ‌ల్ బ‌ర్డ‌న్ ఆఫ్ డిసీజ్ ( జిబిడి 2017) నివేదిక చెబుతోంది. మ‌న దేశానికి చెందిన మెంట‌ల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ జాతీయ సంస్థ ( నిహ్సాన్స్) దేశ‌వ్యాప్తంగా జ‌రిపిన జాతీయ మానసిక ఆరోగ్య స‌ర్వే 2015-16 ప్ర‌కారం దేశంలో దాదాపు 150 మిలియ‌న్ పౌరుల‌కు మాన‌సిక ఆరోగ్య చికిత్స అవ‌స‌రం. కానీ కేవ‌లం 30 మిలియ‌న్ మంది మాత్ర‌మే ఇలా చికిత్స‌లు తీసుకుంటున్నార‌ని ఈ స‌ర్వేలో తేలింది.

కాక‌తాళీయ‌మే అయిన‌ప్ప‌టికీ మాన‌సిక ఆరోగ్యానికి సంబంధించి ఆందోళ‌న‌క‌ర‌మైన విష‌యాలు కోవిడ్ -19 కార‌ణంగా బైట‌కు వ‌స్తున్నాయి. ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ బారిన ప‌డిన బాధితులు, అనుమానితులు అంద‌రికంటే ఎక్కువ‌గా మాన‌సిక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. కోవిడ్ -19 రోగుల చుట్టూ ముసురుకుంటున్న అపోహ‌ల‌నేవి మ‌నం ప్ర‌తి రోజూ ఎదుర్కొంటున్న నిరాధార స‌మాచారాన్ని ప్ర‌తిఫ‌లిస్తున్నాయి. ఈ మ‌హ‌మ్మారి వైర‌స్‌పై పోరాటంలో భాగంగా వైద్య‌రంగ సిబ్బంది అవిశ్రాంతంగా ప‌ని చేస్తున్నారు. వారు త‌మ కుటుంబాల‌కు దూరంగా వుంటూ త‌మ జీవితాల‌కు ప్ర‌మాద‌మ‌ని తెలిసినా స‌రే సేవ‌లందిస్తున్నారు. వారిని వారి క‌మ్యూనిటీల‌కు చెందిన‌వారు దూరంగా వుంచ‌డ‌మనేది ఈ వైద్య‌రంగ సిబ్బందికి నిరుత్సాహం క‌లిగించే విష‌యం. ఇది వారికి బాగా వ‌త్తిడి క‌లిగిస్తున్న విష‌యం.

ఈ మ‌మ్మారిపైపోరాటంలో భాగంగా వారాలు, నెల‌లు మాత్ర‌మే కాదు..సంవ‌త్స‌రాల‌పాటు స‌మ‌యం ప‌డుతుంది. అంత‌వ‌ర‌కూ దృఢంగా, ధైర్యంగా, ద‌య‌తో, మనుషులుగా మ‌న‌కుండాల్సిన ఔదార్య స్ఫూర్తితో, నాయ‌క‌త్వ ప‌టిమ‌తోమెల‌గాల్సిన స‌మ‌య‌మిది. రాబోయే రోజుల్లో మ‌న భ‌విష్య‌త్తు ఎలా వుంటుంది, త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో కోవిడ్ 19 ప‌రిస్థితుల‌కు అనుగుణంగా సామాజిక ప్ర‌వ‌ర్త‌న‌ల్ని అల‌వాటు చేసుకోవ‌డం, ఆర్ధిక ప‌రిస్థితులు మొద‌లైన అంశాల కార‌ణంగా అనేక మాన‌సిక స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశ‌ముంది. ఇప్పటికే సున్నితంగా వుంటున్న‌వారిని ఈ స‌మ‌స్య‌లు మ‌రింత‌గా క్రుంగ‌దీసే అవ‌కాశ‌ముంది.

 ఒక స‌మాజంగా ఐక‌మ‌త్యంగా మ‌నం ఏం చేయ‌గ‌లం?

కోవిడ్ -19 మ‌హ‌మ్మారి కార‌ణంగా త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఒంట‌రిగా వుండాల్సిన ప‌రిస్థితుల‌నుంచీ, త‌ద్వారా వ‌చ్చే ప‌రిణామాల‌నుంచి బైట‌ప‌డ‌డానికిగాను మ‌నం ఇప్ప‌టికే అనేక సృజ‌నాత్మ‌క ప‌రిష్కారాలు క‌నుక్కోవ‌డం జ‌రిగింది. అంతే కాదు వీటిని క్ర‌మం త‌ప్ప‌కుండా అభివృద్ధి చేసుకోవ‌డం జ‌రుగుతోంది. డిజిట‌ల్ సాంకేతిక‌ల్ని విస్తృతంగా వినియోగించుకోడం జ‌రుగుతోంది. దేవాల‌యాలు, వ్యాయామ‌శాల‌లనుంచీ యోగా స్టూడియోలవ‌ర‌కు ప‌లు సంస్థ‌లు త‌మ కార్య‌క‌లాపాల్ని ఆన్ లైన్ ద్వారా కొన‌సాగిస్తున్నాయి. ఉద్యోగ బాధ్య‌తల్ని, చ‌దువుల్ని డిజిట‌ల్ సాంకేతిక‌త‌ద్వారా కొన‌సాగిస్తున్నాం. దాంతో సామాజికంగా ఒంట‌రివాళ్లం కాకుండా చూస్తూ… భౌతిక దూరాన్ని పాటించ‌డానికిగాను ఇవి ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సోష‌ల్ మీడియా నెట్ వ‌ర్కులు కూడా ఈ విష‌యంలో ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. ముఖ్యంగా కోవిడ్ బాధితులు, క్వారంటైన్ లో వుంటున్న అనుమానిత‌ల‌కు ఈ సోష‌ల్ మీడియా నెట్ వ‌ర్కులు బాగా ఉప‌యోగ‌ప‌డుతున్నాయి.

ల‌క్ష‌లాది మంది వైద్య ఆరోగ్య కార్య‌కర్త‌ల‌కు శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల‌ను డిజిట‌ల్ సాంకేతిక‌త‌ద్వారానే విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డం జ‌రిగింది. కోవిడ్ -19కు సంబంధించి అపోహ‌ల‌ను తొల‌గించ‌డానికి, త‌గిన చైత‌న్యం పెంచ‌డానికి సంబంధించిన అంశం…ఇంటిగ్రేటెడ్‌ గ‌వ‌ర్న‌మెంట్ ఆన్ లైన్ ట్రెయినింగ్ ప్లాట్ ఫామ్ ( ఐ గాంట్‌) లో త‌ప్ప‌నిస‌రి మాడ్యూల్‌. ఈ వేదిక ద్వారా పోలీసుల‌కు, ర‌క్ష‌ణ రంగ సిబ్బందికి, కార్య‌క‌ర్త‌ల‌కు, విద్యార్థుల‌కు, ఆరోగ్య రంగ సిబ్బందికి ఆన్ లైన్ ద్వారా శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రుగుతోంది. జిల్లాల‌వారీగా మానసిక‌రంగ నిపుణుల‌ను, వాలంటీర్ల‌ను అందుబాటులో తేవ‌డం జ‌రిగింది. కోవిడ్ -19 మ‌హ‌మ్మారికి, లాక్ డౌన్ కు సంబంధించి ప్ర‌జ‌ల్లో క‌లిగే మానసిక స‌మ‌స్య‌ల‌ను తొల‌గించ‌డానికిగాను నిమ్హాన్స్ సంస్థ  జాతీయ స్థాయిలో ఒక హెల్ప్ లైన్ ( 080- 46110007)ను మార్చి 30న ఏర్పాటు చేసింది. ఇది ప‌లు భాష‌ల్లో అందుబాటులోకి తెచ్చారు. కోవిడ్ 19 ఆరోగ్యభ‌ద్ర‌తా సిబ్బందికోసం ప్ర‌త్యేక‌మైన హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. నిపుణులు కౌన్సిలింగ్ స‌ర్వీసులు అందించ‌డానికిగాను https://psychcare-nimhans.in/  ప్రారంభించారు. వ‌త్తిడి నిర్వ‌హ‌ణ‌, అపోహ‌ల్ని తొల‌గించ‌డానికి, ఆరోగ్య‌రంగ సిబ్బందికి వ‌చ్చే మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి, చిన్నారులు, వృద్ధుల‌తో ఎలా వ్య‌వ‌హ‌రించాలి అనేది తెలిపేందుకు క్ర‌మం త‌ప్ప‌కుండా నిహ్సాన్స్ వారు, ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఏఐఐఎంఎస్)వారు  ప‌లు వెబినార్ల‌ను, వీడియోల‌ను కేంద్ర ఆరోగ్య‌శాఖ వారి వెబ్ సైటు www.mohfw.gov.in  లో అప్ లోడ్ చేస్తున్నారు. ఇవి బిహేవియ‌ర‌ల్ హెల్త్ సైకోసోష‌ల్ రీసోర్సెస్ అనే విభాగం కింద అందుబాటులో వున్నాయి.

 ప్ర‌ఖ్యాత స్ఫూర్తిదాయ‌క ప్ర‌సంగాల ఉప‌న్యాస‌కుడు లెస్ బ్రౌన్ చెప్పిన కొన్ని మాట‌ల్ని ఇప్పుడు చూద్దాం.  మీలో మీరు కుంగిపోవ‌డం ఆపేయండి. ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్పులు చేస్తారు. ప్ర‌తి ఒక్క‌రికి ఎదురు దెబ్బ‌లు, అప‌జ‌యాలు వుంటాయి. ప్ర‌తిసారీ విజ‌యం సాధించడాన్ని చెప్పే పుస్త‌కం ఏదీ లేదు. ప్ర‌ణాళిక ప్ర‌కారం వెళ్లినా స‌రే ఒక్కోసారి అప‌జ‌యం వస్తుంది. ఎందుకంటే మ‌నం మాన‌వ‌మాత్రులం కాబ‌ట్టి. ముందు ముందు గొప్ప జీవితాన్ని త‌యారు చేసుకోవ‌డానికి అప‌జ‌య‌మ‌నేది మ‌న‌కు  ఒక ఉప‌యోగ‌ప‌డే సాధ‌నం…అని  లెస్ బ్రౌన్ చెప్పారు. కాబ‌ట్టి ఈ మాట‌ల్ని మార్గ‌ద‌ర్శ‌కంగా తీసుకొని మ‌న మాన‌సిక స‌మ‌స్య‌ల గురించి మ‌నం బ‌హిరంగంగా మాట్లాడాలి. ఎలాంటి భ‌యం, సిగ్గు లేకుండా వాటి గురించి మాట్లాడాలి. అంతేకాదు మ‌న‌ల్ని, ఇత‌రుల్ని … అపోహ‌ల‌తో చూసుకోవ‌డం మానేసి ఒక జాతిగా, మాన‌వ‌త‌తో ఐక‌మ‌త్యంగా నిలిచేలా తయారు చేసుకొని ఒక‌రికొక‌రం సాయం చేసుకోవాలి. ముంద‌డుగు వేయాలి.

– ప్రీతి సూడాన్‌, ఐఏఎస్ , క‌వితా నారాయ‌ణ్‌, ఎఫ్ ఏ సి హెచ్ ఇ

శ్రీమ‌తి సూడాన్ కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి

శ్రీమ‌తి నారాయ‌ణ్ కేంద్ర ఆరోగ్య‌శాఖ సాంకేతిక స‌ల‌హాదారు

( ఈ వ్యాసంలో వ్య‌క్త‌మైన అభిప్రాయాలు ర‌చ‌యిత‌ల వ్య‌క్తిగ‌త‌మైన‌వి)

 

Leave a Reply