Take a fresh look at your lifestyle.

మిలియన్‌ ‌మార్చా? బిలియన్‌ ‌మార్చా ?

హుజూరాబాద్‌ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్నది. ముఖ్యంగా ఈ పార్టీలన్ని ఇప్పుడు యువతవైపు దృష్టి సారించాయి. ప్రధానంగా నిరుద్యోగ యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు విస్తృతంగా ప్రారంభించాయి. ఈ సందర్భంగా ఉపాధి అవకాశాల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌ ‌కోసం ఎదురు చూస్తున్న యువత కండ్లు కాయలు కాస్తున్నా, ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడాన్ని విపక్షాలు దుయ్యబడుతున్నాయి. ఈ విషయంలో బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌పై విరుచుకు పడుతుంటే, కేంద్రం ఇచ్చిన హామీలేమైనాయని కాంగ్రెస్‌, ‌టిఆర్‌ఎస్‌లు ప్రశ్నిస్తున్నాయి. పిఆర్‌సి నివేదిక ప్రకారం తెలంగాణలో ఉపాధికోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల సంఖ్య లక్షా తొంబై ఒక వేలు. వీరిలో చాలా మంది వయస్సు ఇప్పటికే నలభై ఏళ్ళు దాటి పోయింది.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ అర్హత వయస్సును పెంచుతామని ఉద్యమకాలంలో నేతలు చెపితే, యువత ఎంతో ఉత్సాహంగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఇక వొచ్చేది మన రాష్ట్రం, మన ప్రభుత్వమే కాబట్టి కావల్సినన్ని ఉద్యోగాలు స్థానికులకే లభిస్తాయని ఎంతో ఆశపడ్డారు. కాని, తెలంగాణ ఏర్పడి ఏడు సంవత్సరాలైనా ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్‌ ‌కూడా జారీ చేయకపోవడంతో యువత నిరుత్సాహానికి గురయ్యారు. కొందరు మానసిక సంఘర్షణకు లోనై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కనీసం ఆ మరణాలను చూసైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్‌లు జారీ చేయకపోవడంపై ఇప్పుడు ప్రతిపక్షాలు విరుచుకు పడుతున్నాయి. రాష్ట్రం ఏర్పడేనాటికి నేటికీ నిరుద్యోగుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. ఈ ఏడేళ్ళలో గ్రూపు వన్‌కు సంబంధించి ఒక్క నోటిఫికేషన్‌ ‌కూడా జారీ కాలేదు. గ్రూప్‌ ‌టు విషయంలో నోటిఫికేషన్‌ ‌వొచ్చినా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వొచ్చింది.

ప్రభుత్వం ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పించిందంటే కేవలం పోలీసు శాఖలో మాత్రమే. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఏవో ఎన్నికలు వొచ్చినప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలపై ప్రకటన చేయడం ఆనవాయితీ అయిపోయింది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యాభై వేల ఉద్యోగాలను కల్పిస్తామని చేసిన ప్రకటన, నేటికీ ప్రకటనగానే ఉండిపోయింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ అధినేత వైఎస్‌ ‌షర్మిల గత కొంతకాలంగా ఇదేఅంశం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చేవరకు ప్రతీ మంగళవారం ఒక్కో ప్రాంతంలో నిరహార దీక్షా కార్యక్రమాన్ని ఇప్పటికే కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 54 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అలాగే బిజెపి కూడా నిరుద్యోగ యువత పక్షాన పోరాటానికి సిద్ధమైంది. యువత బలిదానాలతో గద్దె నెక్కిన తెరాస, అధికారం చేపట్టిన తర్వాత ఆ విషయాన్నే మరిపోయిందంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రజా సంగ్రామ యాత్ర పేరున కలియతిరుగుతున్నారు. తెలంగాణ కోసం పద్నాలుగు వందల మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారు.

వారి బలిదానాలతో సంక్రమించిన రాష్ట్రంలో ఇక నిరుద్యోగ సమస్యే ఉండదనుకున్నారు. కాని, ఇప్పుడు ఉద్యోగాలు లేక మరికొంత మంది యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కనీసం వారిని ఓదార్చాలన్న ధ్యాస కూడా ఈ ప్రభుత్వానికి లేదు. వారి బలవన్‌ ‌మరణాలు చూసైనా ప్రభుత్వానికి జాలి కలగటంలేదు. ఒక విధంగా వారి జీవితాలతో ప్రభుత్వం దోబూచులాట అడుతుందంటూ ఆయన తన యాత్రల సందర్భంగా ఆవేశపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. తమ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని, అందుకు ఈ దీపావళిలోగా నోటిఫికేషన్‌ ఇవ్వక పోతే రాష్ట్రంలో మిలియన్‌ ‌మార్చ్ ‌చేపడుతామని బండి సంజయ్‌ ‌రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటమ్‌ ఇవ్వడం ఇప్పుడీ విషయం రాష్ట్రంలో హాట్‌ ‌టాపిక్‌ అయింది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వ ఉపాధి విషయంలో మాట తప్పినందుకు బిలియన్‌ ‌మార్చ్ ‌మేమూ చేపడుతామని టిఆర్‌ఎస్‌ ‌నేతలు ఆ పార్టీ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రంలో అధికారంలోకి వొచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని, ఇంత వరకు దాన్ని అమలు చేయక పోవడం పట్ల టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌జీవన్‌రెడ్డి ఘాటుగానే స్పందిస్తున్నారు. ప్రభుత్వం అంటే నిరుద్యోగాన్ని తగ్గించాలి కాని, టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పెంచి పోషిస్తున్నదంటూ బండి సంజయ్‌ ‌చేసిన వ్యాఖ్యలను ఆయన కేంద్ర ప్రభుత్వానికే అది వర్తిస్తుందని తిప్పికొట్టారు. కాంగ్రెస్‌ ‌కూడా అటు బిజెపి పైన, ఇటు టిఆర్‌ఎస్‌పైన ధ్వజమెత్తుతూనే ఉంది. నిన్నటివరకు దళిత, గిరిజన సమస్యలపై ఆందోళన చేపట్టిన ఆ పార్టీ ఇప్పుడు నిరుద్యోగ సమస్యపై స్పందించేందుకు సిద్ధమవుతుంది. వొచ్చేనెల 2వ తేదీ నుండి డిసెంబర్‌ 9‌వ తేదీవరకు ఈ పోరాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధపడుతున్నది. మొత్తం మీద రాజకీయ పార్టీలన్నీ నిరుద్యోగ సమస్యపైనే పోరాటం చేస్తున్నా యువతకు మాత్రం ఉపాధి అందని ద్రాక్షగానే ఉంది.

Leave a Reply