- ఫిబ్రవరి మూడో వారంలో మిలియన్ మార్చ్
- తెలంగాణలో గతంలో ఎన్నదూ లేని దుర్భర పరిస్థితులు
- 48 గంటల దీక్ష విరమించిన కోదండరామ్
సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేస్తామని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ అన్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి మూడో వారంలో హైదరాబాద్‌లో మిలియన్ మార్చి తరహాలో భారీ ఎత్తున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఢిల్లీలో రైతుల స్ఫూర్తితో ఇకపై ప్రజల భాగస్వామ్యంతో భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయనీ, ఈ పరిస్థితికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. నాంపల్లిలోని టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో 48 గంటల నిరాహార దీక్షను కోదండరామ్ సోమవారం విరమించారు. పార్టీ ఉపాధ్యక్షుడు ప్రొ.పీఎల్ విశ్వేశ్వరరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోదండరామ్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయనీ, పండించిన పంట కొనే దిక్కు లేక రైతులు, ఉద్యోగాల భర్తీ లేక నిరుద్యోగులు, ఎల్ఆర్ఎస్ నిబంధనతో రియల్ ఎస్టేట్, ప్రైవేటు టీచర్ల బతుకు దయనీయంగా తయారైందన్నారు. ఈ పరిస్థితికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో పాలన సరైన విధంగా సాగుతుందన్న ఉద్దేశ్యంతో ప్రజలు సీఎంగా కేసీఆర్‌కు పట్టం కట్టారనీ, అయితే, ఈ ఏడేండ్లలో కేసీఆర్‌కు పాలన చేతకాదని అర్థమైందని అందుకే ప్రజలు ఇక ఆయన దిగిపోవాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. రైతులు, ప్రైవేటు టీటర్లకు బతుకుదెరువు కరువైందనీ, ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని కారణంగానే తాను నిరాహార దీక్షకు దిగాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.