Take a fresh look at your lifestyle.

మీకిది తగునా?

అంబేద్కర్‌ ‌కూడా ఊహించనంత గొప్ప వ్యక్తి రంజన్‌ ‌గోగోయ్‌

“పాలించే ప్రభువులు న్యాయమూర్తులను, విరమణానంతర పదవుల లాలసత్వంతో లోబరుచుకోవడానికి చాలా నిశ్శబ్దంగా చట్టాలను నిర్మిస్తారనీ  అవి అల్లిన కుట్రల వలె పైకి కనిపించవనీ అంటూ ఉంటారు. అయినా వాటిని మీరెందుకు పట్టించుకుంటారు? హాయిగా ఆరేళ్లు రాజ్యసభలో రాజ్యం చేయండి.  రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తానని మళ్లీ ప్రమాణం చేయండి. ఉత్త ప్రమాణమే కదా, చేసేస్తే ఓ పనై పోతుంది.”

janadharmaదేశమంతా చర్చిస్తున్నది, మీరు రాజ్యసభ సభ్యత్వానికి తలఒగ్గడం గురించి. పదవీ విరమణకు ముందు మీరిచ్చిన తీర్పుల మీద సందేహాలు కమ్ముకోవడం లేదా. మీకిది తగునా. దేశాధినేత రాష్ట్రపతి. ఆయనకు ప్రమాణ స్వీకారం చేయిస్తాడు ప్రధాన న్యాయమూర్తి. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లేకపోతే ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. అంతటి పదవి నిర్వహించిన వ్యక్తిమీరు. మీకు రాజ్యసభ సభ్యత్వం ఓ గొప్ప హోదానా? మిమ్మల్ని జస్టిస్‌ అని పిలవాలా లేక, పార్లమెంటేరియన్‌ అనాలా? మీరు అంబేద్కర్‌ ‌కూడా ఊహించనంత గొప్ప వ్యక్తి. మీ వంటి ప్రధాన న్యాయమూర్తి భారత దేశ న్యాయవ్యవస్థను పరిపాలిస్తాడని గానీ, మీరు పదవి ముగిసే ముందు అత్యంత కీలకమైన కేసులలో మీరే స్వయంగా ధర్మాసనాలలో కూర్చుని తీర్పులిస్తారని గానీ, ఆ తరువాత నాలుగు నెల్లలోనే మీకు రాజ్యసభ సభ్యత్వం వరించి వస్తుందని మిమ్మల్ని నామినేట్‌ ‌చేసి రుణం తీర్చుకునే సౌకర్యం మన సంవిధాన పాలనలో ఉంటుందని గానీ, పాపం ఎంత గొప్ప రాజ్యాంగ నిర్మాణ నిపుణుడైనా, అంబేడ్కర్‌ ఊహించి ఉండడు కదండీ.

మీ కన్న ముందు కేరళ గవర్నర్‌గా మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివం నియమితులైనారు. అంతకు ముందు రంగనాథ్‌ ‌మిశ్రా గారు పదవీ విరమణ చేసిన ఏడేళ్ల తరువాత ఆనాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రాజ్యసభకు పోటీ చేయడానికి టికెట్‌ ఇచ్చి, గెలిపించిన విషయం కూడా మీకు గుర్తుండే ఉంటుంది. జస్టిస్‌ ‌బహరుల్‌ ఇస్లాం అనే సుప్రీంకోర్టు జడ్జిగారు పదవీ విరమణ తరువాత కాంగ్రెస్‌ ‌టికెట్‌ ‌పైన రాజ్యసభకు పోటీ చేసి 1983లో గెలిచారు. మీరు పద్మభూషణ్‌ అరుణ్‌ ‌జైట్లీ అనే రాజ్యాంగ నిపుణుడు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న 2012 కాలంలో ఏమన్నారో విన్నారా? న్యాయమూర్తులు పదవీ విరమించిన తరువాత రెండేళ్ల దాకా ఏ పదవులను అంగీకరించకూడదనీ, వారికి ప్రభుత్వాలు ఏ పదవులూ ఇవ్వకూడదని వక్కాణించారు. అయినా చేసిన సేవలు రెండేళ్ల తరువాత గుర్తుపెట్టుకుని పదవులిచ్చే కృతజ్ఞత ఎవరికీ ఉండదని మీకు తెలియదా, అందుకే మీరు వెంటనే అంగీకరించి ఉంటారు. అప్పడికీ ఇప్పడికీ దిగజారుతున్న నైతిక ప్రమాణాలను లెక్క పెట్టాలి కదా సార్‌.

‌రంగనాథ్‌ ‌మిశ్రాగారికి ఎనిమిదేళ్ల తరువాత మాజీ ప్రధాన న్యాయమూర్తికి ధన్యవాదాలు తెలియజేయాలని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఎందుకు భావించిందో. ఇప్పుడు మీరు పదవీ విరమణ చేసిన నాలుగు నెలల్లోగానే సిగ్గుపడకుండా బిజెపి ప్రభువులు కృతజ్ఞత ఎందుకు ప్రకటించారో మీకే తెలియాలి. మీకు బిజెపి వారు ఏ కారణంతో పదవి ఇచ్చినా, మీరయితే సంతోషంగా ఒప్పుకున్నారు కదా? బహుశా మీరు బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా చాలా సంచలన తీర్పులు ఇచ్చిన ప్రధాన న్యాయమూర్తి అని వారు గుర్తించి ఉంటారు. మీరు అంత విధేయతతో పనిచేసినప్పుడు ధన్యవాదాలు చెప్పడంలో తప్పేముంది?. మీరయితే కొన్ని కేసులు విననే వినలేదు. కనుక అవి తీర్పుల దాకా రానేరావు. కొన్ని కేసులు విన్న తరువాత అన్యాయం జరిగితే, మరికొన్ని కేసులు వినకపోవడమే అన్యాయం. నల్లధనానికి చట్టబద్ధత రంగు పులిమే ఎలక్టోరల్‌ ‌బాండ్స్ ‌రాజకీయ అవినీతి పథకంపై కేసులు వినకుండా వాయిదా వేసి సర్కారు చేత మీరు షభాష్‌ అనిపించుకున్నారు. కశ్మీర్‌లో అక్రమ బందీల హెబియస్‌ ‌కార్పస్‌ ‌కేసులు వినకుండా ప్రభువులకు అభయం ఇచ్చారు కదా. మీమేలు ఎన్నటి కైనా మరువ గలరా? సిబిఐ అలోక్‌ ‌వర్మ తొలగింపు కేసులో మీరు ఇచ్చిన తీర్పు ఒక వింత. తరువాత సిబిఐ డైరెక్టర్‌ ‌నియామక కమిటీలో ప్రధానితో పాటు మీరు కూడా ఒక సభ్యుడి హోదాలో కూర్చున్నారు. మళ్లీ మీకే ఏదో అనిపించి ఉంటుంది. కనుక ఆ కమిటీ నుంచి తప్పుకున్నారు. ఎంత మంచి నిర్ణయం చెప్పండి.

మరొక కీలకమైన కేసు రఫేల్‌ ‌కుంభకోణం అందులే మీకే తప్పు కనబడకపోతే మీరేంచేస్తారండీ? రాజ్యాంగం, న్యాయసూత్రాలు ఏవో చెబుతూనే ఉంటాయి. మీరు రావణ కాష్టం వలె రగులుతున్న అయోధ్య సమస్యను అంబేద్కర్‌ ‌కూడా ఊహించని రీతిలో పరిష్కరించారు కదా. మీసృజనాత్మకతకు రాజ్యసభ సభ్యత్వం ఏం సరిపోతుంది? వెంకయ్య నాయుడు గారి పదవో లేక కోవిద్‌ ‌గారి పదవో మీకు రావలసింది. అప్పుడు మిమ్మల్ని ఎవరూన తిట్టి ఉండేవారు కాదు కదా. అస్సాంలో ఎన్‌ఆర్‌సీ అనే రిజిస్టర్‌ను మీరే స్వయంగా మీ అధ్వర్యంలో తయారు చేయించారు. మీ ప్రేరణతోనే కదా బిజెపి సర్కారు ఎన్నార్సీని దేశం మొత్తానికి విస్తరించేందుకు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నది. గోగోయ్‌ ‌గారు మీకు గుర్తుందో లేదో, మీరు అధ్యక్షత వహించిన ఒక ధర్మాసనం రోజర్‌ ‌మాథ్యూ కేసులో ‘‘న్యాయం చెప్పే పదవుల్లో ఉన్న వ్యక్తులకు రిటైర్మెంట్‌ ‌తర్వాత పదవులు ఇవ్వడం వల్ల వారి న్యాయ స్వతంత్రతపై దుష్ప్రభావం ఉంటుందనీ, దీని వల్ల ప్రజలకు న్యాయవితరణ విధానంపైన విశ్వసనీయత సడలిపోతుందని, న్యాయపాలనలో ప్రభుత్వ పాలకుల అనవసర జోక్యానికి దారి తీస్తుంద’’ని బోలెడు నీతి సూత్రాలు చెప్పారు. గోగోయ్‌ ‌గారూ మీ తీర్పు మీరే ఓసారి శ్రద్ధగా చదువుకుంటే బాగుంటుంది.

ఇక మీమీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగిని మీరు అంత పెద్ద హోదాలో ఉండి బాగా ఆలోచించి డిసెంబర్‌ 2018‌లో ఉద్యోగం నుంచి ఆమెను బర్తరఫ్‌ ‌చేసారు. మిమ్మల్ని మీరు రక్షించుకోవడం ముఖ్యం అని చాలా మందికి తెలియదు. దాన్ని కొందరు దారుణం అంటారనుకోండి మీరేం పట్టించుకోకండి. మళ్లీ ఒక సారి రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తానని దేవుడి సాక్షిగా లేదా అంతఃకరణ సాక్షిగా ప్రమాణం చేస్తారు కదా? అప్పుడు చూసుకోవచ్చు. మీరు సుప్రీంకోర్టు కుటుంబానికి పెద్ద. సిజెఐ అంటే మాటలా? న్యాయపాలకుడన్నమాట. మీ కేసులో స్వయంగా మీరే నిర్ణయం తీసుకున్నారంటున్నారు. మీ కేసులో మీరే తీర్పు చెప్పుకున్నంతపని చేశారు కదండీ. మీరే ధర్మాసనంపై ఉండడం, మీరే నమ్మకస్తులైన జడ్జిలను ఎంపికచేయడం, ఏం చేసైనా సరే మీరు నిర్దోషిగా బయటపడాలి. అవసరం కదా. అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవడం అన్నమాట. అయినా మీరు సిజెఐ పదవి వదిలి పెట్టిన కొన్నాళ్ళకు ఆ మహిళకు జనవరి 23, 2020 నాడు ఉద్యోగం మళ్లీ ఇచ్చారు. అంటే ఆమె ఆరోపణలు అందరూ అనుకున్నట్టు అసంబద్ధం కాదేమోనని జనం అనుమానిస్తున్నారు. అయినా మీరే కరెక్టా?. సుప్రీంకోర్టులో ఎందరో జడ్జిలు కదా, వారిలో ఒక్క జడ్జి కూడా ఇదేమిటని ప్రశ్నించ లేదంటే మీరు నిర్దోషి అని సుప్రీంకోర్టు జడ్జిలంతా ఏకగ్రీవంగా ఒప్పుకున్నారనుకోవాలా? పాలించే ప్రభువులు న్యాయమూర్తులను, విరమణానంతర పదవుల లాలసత్వంతో లోబరుచుకోవడానికి చాలా నిశ్శబ్దంగా చట్టాలను నిర్మిస్తారనీ, అవి అల్లిన కుట్రల వలె పైకి కనిపించవనీ అంటూ ఉంటారు. అయినా వాటిని మీరెందుకు పట్టించుకుంటారు? హాయిగా ఆరేళ్లు రాజ్యసభలో రాజ్యం చేయండి. రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తానని మళ్లీ ప్రమాణం చేయండి. ఉత్త ప్రమాణమే కదా, చేసేస్తే ఓ పనై పోతుంది.

ఇంతవరకు 44 మంది ప్రధాన న్యాయమూర్తులు మాజీలైన తరువాత పదవులు తీసుకున్నారట. మీరేం ఒంటరి కాదు. లోక్‌ ‌పాల్‌, ‌లోక్‌ అయుక్త, జాతీయ, రాష్ట్ర స్థాయి మానవ హక్కుల కమిషన్లు, లాకమిషన్‌ ఆఫ్‌ ఇం‌డియా వంటి అనేక పదవులను నూరులో 70 మంది జడ్జిలు తీసుకున్నారు కదా. వారంతా మీ పక్కన ఉన్నప్పుడు మీకు భయమేమిటి. సిగ్గేమిటి? మీ ముందున్న సిజెఐ గారు గవర్నర్‌ ‌పదవి కూడా తీసుకున్నారు కదండీ. అయినా మీకు గవర్నర్‌ ‌పదవి ఇస్తే బాగుండేది. హాయిగా హోం మంత్రిగారి సబార్డినేట్‌ ‌వ్యక్తిగా ఆయన గారికి సేవలు చేసుకుంటూ శేషజీవితం గడిపే వారు. మీరు రాష్ట్రపతికి కూడా పదవీ ప్రమాణం చేయించే ఉన్నతమైన పదవిలో ఉండేవారు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి కూడా లేని పరిస్థితి వస్తే దేశాధ్యక్షత పదవిని తాత్కాలికంగా నిర్వహించే బాధ్యత కూడా ప్రధాన న్యాయమూర్తికి ఉంటుందని రాష్ట్రపతి విధుల నిర్వహణ చట్టం 1969 నిర్దేశిస్తున్నది. అంతటి పదవిలో ఉన్న వ్యక్తి మీరు ఇంత చిన్న పదవిని స్వీకరించడం మీ నిరాడంబరతకు నిదర్శనం అనుకుంటే సరిపోతుంది. దీన్ని సిగ్గుచేటు అని కొందరనడమే సిగ్గు చేటు అంటే మరీ మంచిది.

ఏ వ్యవస్థ అయినా నమ్మకం మీద బతుకుతుంది. రాజకీయ పార్టీ కూడా ప్రజల నమ్మకం ఆధారంగానే ఎన్నికలు గెలుస్తుంది. దాన్ని విశ్వసనీయత అంటారు. న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకుండే విశ్వాసాన్ని గౌరవాన్ని, ప్రేమను, నమ్మకాన్ని భారీ ఎత్తున తగ్గించే చర్య ఈ నియామకం. మెజారిటీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ పార్టీ మిమ్మల్ని నమ్ముకున్నారు. అంతగా నమ్ముకున్నవారికి, వారిచ్చే పదవి నిరాకరించి ద్రోహం చేస్తారా ఎవరైనా? ప్రజాస్వామ్యరాజ్యాంగ వ్యవస్థలో న్యాయ కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య కావలసినంత దూరం ఉండాలని రాజ్యాంగ నిపుణులు ఘోషిస్తే ఏమిటట? అధికారాల వేర్పాటు అనేది ఫెడరల్‌ ‌రాజ్యాంగ మౌలిక సూత్రమట. అయితే ఏమిటి. ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి కలుసుకోవడం లేదా. వారు ఒక చోట సమావేశం కావడం కూడదని ఎక్కడ రాసి ఉంది. మీరంతా లీడర్లు కదా. డీలర్లు అని ఎవరైనా అంటే అది అచ్చుతప్పు అనుకోవచ్చు. ఎవ్వరి మాటా వినకండి. విమర్శలు పట్టించుకోకండి. న్యాయసూత్రాలు, రాజ్యాంగ నియమాలు ఏమిటండీ? జస్ట్ ‌మరిచిపోండి. జస్టిస్‌ ‌మరిచిపోండి. రాజ్యసభలో కొత్త చట్టాలు తేవడానికి కృషి చేసే సదవకాశం సుమండీ. లైంగిక వేధింపులు అని పై పదవిలో ఉన్నవారిని ఆడవారు మరీ వేధిస్తున్నారు. అసలు అవే వేధింపులు. లైంగిక వేధింపులు అని ఆరోపించిన ఆడవారి కుటుంబం మొత్తాన్ని జైల్లో పడేసే కఠిన చట్టాలు తేస్తే ఒక పక్షం జనం అంతా మీకు నివాళులర్పిస్తారు. రంజన్‌ ‌గోగోయ్‌ ‌గారూ. మీకిది తగునా అని అడుగుతున్నారు కదా. ఏదో ఒక జవాబు చెప్పేసేయండి. మిమ్మల్ని ఎవరైన విమర్శిస్తే రాజద్రోహం కేసు కూడా పెట్టే సౌకర్యం ఉంది కదా? జడ్జిలు మనవాళ్లు. ఎంత మాజీ అయినా, మోదీ షాలతో ఒదిగి ఎంపీగా ఎదిగిపోతున్న మీకు భయపడిపోతారు. మీకు వ్యతిరేకంగా వ్యవహరించడం ఎవరికి సాధ్యం చెప్పండి.

Leave a Reply