Take a fresh look at your lifestyle.

వలస వెనక్కి

“మొత్తం వలస కార్మికుల్లో 3.40 కోట్ల మంది అంసఘటిత రంగాల్లో దినసరి వేతనం మీద పని చేస్తున్న వారే. ఇప్పుడు లక్షలాది మంది వలస కార్మికులు పట్నం వదిలి పల్లెలకు తిరుగు ప్రయాణంలో ఉన్నారు. వందల సంఖ్యలో వలస కార్మికులు రోడ్ల మీదకు రావటంతో వీరందరిని సొంత ఊర్లకు తరలించటానికి కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా మొదటి రైలు హైదరాబాద్‌ ‌లింగంపల్లి స్టేషన్‌ ‌నుంచి ఝార్ఖండ్‌లోని హతియా స్టేషన్‌కి 1,230 మంది వలస కార్మికులను తీసుకువెళ్లింది.”

Rehanaమానవ పరిణామ క్రమంలో వలస సహజం. కొంత మంది ఉన్న ఊర్లో ఉపాధి లేక పొట్ట చేతబట్టుకుని వలస బాట పడతారు. మరి కొంత మంది మెరుగైన జీవితం కోసం, తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే లక్ష్యం కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళుతుంటారు. అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళటం ఒక రకంగా చైతన్యంలో భాగం. వలస వెళ్లే వారిలో విద్యార్థులు కూడా ఉంటారు. అయితే వీరి ప్రయాణం చదువు పూర్తయ్యే వరకు. అమెరికా, లండన్‌ ‌దేశాల్లో చదువు కోసం వెళ్లే వారిలో చాలా మంది అక్కడే ఉద్యోగం సంపాదించుకుని కొత్త జీవితం ప్రారంభిస్తుంటారు. ఇలా ఉన్న జీవితం, ఉద్యోగం, ఉపాధి నుంచి మరింత మెరుగైన అవకాశాల కోసం వెళ్లే వారి శాతం తక్కువగానే ఉంటుంది. పల్లెల్లో ఉపాధి లేక తినటానికి తిండి లేక వలస వెళ్ళే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది.

కరోనా సంక్షోభం
కరోనా ప్రకోపం ప్రారంభమవుతున్న సందర్భంలో…వైరస్‌ ‌వ్యాప్తిని అడ్డుకట్ట వేయటానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. కాని ప్రకటనకు ముందు దేశాన్ని, ప్రజలను 21 రోజుల లాక్‌డౌన్‌కు సిద్ధం చేయలేదు. ప్రకటనకు, ఆచరణకు మధ్య కేవలం నాలుగు గంటల సమయమే ఉండటంతో లాక్‌డౌన్‌ ‌కోసం సమాయత్తం అయ్యేందుకు తగిన సమయం లేకుండా పోయింది. దీని ప్రభావం అందరి కంటే వలస కార్మికుల పైనే ఎక్కువగా పడింది. ఉన్న పళంగా పనులు ఆగిపోయాయి. రెక్కాడితే గాని డొక్కాడదు. వీరి పరిస్థితి అర్థమైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సమాజం స్పందించింది. అటు కొద్ది రోజుల్లో కేంద్రం కూడా ఉపాధి కోల్పోయిన వారికి బియ్యం, ఆర్థిక సహాయం చేస్తూ ప్యాకేజీ ప్రకటించింది. కాని అసంఘటిత రంగంలో ఉన్న అందరికీ ప్రభుత్వాల లబ్ది అందలేదు. రేషన్‌ ‌కార్డులు లేని లక్షలాది మంది లబ్దికి ఆవల ఉండిపోయారు. కొన్ని చోట్ల ఆశ్రయాలు కల్పించారు. సరే ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలే. కొద్ది మందికే. రెండో, మూడో దఫా లాక్‌డౌన్‌ ‌కూడా కొనసాగించిన తర్వాత వలస జీవికి పట్టణాల్లో ఉండటం ఊపిరి ఆడకుండా చేసినట్లు అయ్యింది. పూట పూటకీ అన్నమో రామచంద్రా అంటూ ఎవరు ఇంత అన్నం ముద్ద పెడతారా అని పడిగాపులు పడాల్సిన దుస్థితి వచ్చింది. విశాల ప్రపంచంలో ఒంటరి వాళ్ళం అయిపోయాం అన్న మానసిక ఆవేదన మరోవైపు. దీనితో ఎలాగైనా సొంత ఊరికి వెళ్లిపోవాలన్న బలమైన కాంక్ష వాళ్ళని మండే ఎండల్ని సైతం ఖాతరు చేయకుండా
ఉన్న కాస్త మూటా ముల్లే నెత్తి పెట్టుకుని పిల్లా పాపలతో వందల కిలోమీటర్ల దూరం కూడా వెళ్లటానికి నడుం కట్టేలా ప్రేరేపించింది. ఈ అనివార్య, నిస్సహాయ ప్రయాణం కొంత మందిని అన్యాయంగా పొట్టన పెట్టుకుంది. ఆకలి, అలసట, ఆందోళన అన్నీ కలిసి కొంత మంది ప్రయాణం అర్థాంతరంగా ముగిసేటట్లు చేసింది. వీటిలో కొన్ని ఆకలి మరణాలు లేకపోలేదు. భవిష్యత్తు ఏమిటో అర్థం కాక ఆత్మహత్య చేసుకున్న వాళ్లూ ఉన్నారు.

వలస వెనక్కి
2011 సెన్సెస్‌ ‌ప్రకారమే దేశవ్యాప్తంగా 5.6 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు. వారిలో నాలుగు కోట్ల మంది పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. మొత్తం వలస కార్మికుల్లో 3.40 కోట్ల మంది అంసఘటిత రంగాల్లో దినసరి వేతనం మీద పని చేస్తున్న వారే. ఇప్పుడు లక్షలాది మంది వలస కార్మికులు పట్నం వదిలి పల్లెలకు తిరుగు ప్రయాణంలో ఉన్నారు. వందల సంఖ్యలో వలస కార్మికులు రోడ్ల మీదకు రావటంతో వీరందరిని సొంత ఊర్లకు తరలించటానికి కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా మొదటి రైలు హైదరాబాద్‌ ‌లింగంపల్లి స్టేషన్‌ ‌నుంచి ఝార్ఖండ్‌లోని హతియా స్టేషన్‌కి 1,230 మంది వలస కార్మికులను తీసుకువెళ్లింది.
నగరానికి ఉత్తరప్రదేశ్‌, ‌బీహార్‌, ‌ఛత్తీస్‌ఘడ్‌, ‌వంటి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వస్తుంటారు. అలా ఇక్కడి నుంచి ముంబాయి వంటి ఇతర ప్రాంతాలకు వెళుతుంటారు. ఇప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళందరిని సొంత ఊర్లకు పంపటానికి రవాణా ఏర్పాట్లు చేస్తున్నాయి. వలస కార్మికుల వెతలు కొంత వరకు తీరతాయి అనుకోవచ్చు. మరో వైపు ఉద్యోగం, ఉపాధి కోసం ఇతర దేశాలకు వలస వెళ్లిన వారి సంఖ్యా లక్షల్లోనే ఉంది. గల్ఫ్ ‌దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ప్రత్యేక విమానాల్లో వారిని వెనక్కి తెప్పించే ప్రయత్నాలను కేంద్రం చేస్తోంది. తమ దేశంలో ఉన్న విదేశీయులను భారం తగ్గింకునేందు దాదాపు అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. దుబాయ్‌ ఇప్పటికే వీసా గడువు ముగిసిన తర్వాత కూడా చట్టవిరుద్ధంగా ఉంటున్న  విదేశస్తులు తమ దేశం విడిచి వెళ్ళేందుకు క్షమాభిక్ష మంజూరు చేస్తోంది. పైగా ఇలా ఉంటున్నందుకు అంతకు ముందు విధించే పెనాల్టీలు కూడా వేయటం లేదు. వారి తిరుగు ప్రయాణ ఖర్చులు సైతం భరించటానికి సిద్ధంగా ఉంది. అదే విధంగా ఇతర దేశాల్లో ఉన్న చాలా మంది వెనక్కి రావటానికి ఎదురు చూస్తున్నారు. ఇవాల్టి నుంచి ఈ నెల 13 వరకు విదేశాల నుంచి భారతీయులను తీసుకుని రానుంది కేంద్రం. దశల వారీగా 2 లక్షల మందిని తీసుకుని రానున్నట్లు ప్రకటించింది. అమెరికా, లండన్‌, ‌మలేషియా, గల్ఫ్ ‌వంటి 12 దేశాల నుంచి వెనక్కి వస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌ ‌కే 2,350 మంది ఈ కాలంలో రానున్నారు. ఇంత భారీ సంఖ్యలో వచ్చే వారికి పూర్తి స్థాయిలో పరీక్షలు, క్వారంటైన్‌ ఏర్పాట్లు సవాళ్ళతో కూడుకున్న వ్యవహారం.

వలస ప్రయాణం సూపర్‌ ‌స్ప్రెడర్‌ ‌కానుందా?
అయితే ఈ ప్రయాణం ముఖ్యంగా వలస కార్మికులు వెనక్కి మళ్ళటం సున్నితమైన, సంక్లిష్టమైన వ్యవహారం. ఉపాధి లేదు, తినటానికి తిండి లేదు కనుక సొంత ఊర్లకు వెళ్లటానికి ప్రయాణ ఏర్పాట్లు చేయటం సమంజసమే. కాని వందల సంఖ్యలో వీరందరూ ఒక చోట చేరటం ఒక సమస్య. రైళ్లు, బస్సులు ఎప్పుడు వస్తాయో, వస్తాయో రావో అన్న ఆందోళనలతో గత కొద్ది రోజులుగా వీళ్ళంతా రైల్వే స్టేషన్లు, పోలీస్‌ ‌స్టేషన్లు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఒకటి అరా వాహనం దొరికితే సందు లేకుండా ఇరుక్కుని కూర్చుని ప్రయాణం చేస్తున్న దృశ్యాలు మీడియాలో వస్తున్నాయి. ఫిజికల్‌ ‌డిస్టెన్స్, ‌మాస్కులు వంటివి ఇక్కడ వైరస్‌ ‌వ్యాప్తిని అడ్డుకోలేవు. వీళ్ళందరికి థర్మల్‌ ‌పరీక్షలు చేస్తున్నారు. దీనితో ఒంట్లో ఉష్టోగ్రత మాత్రమే తేలుస్తుంది. వైరస్‌ ‌కాదు. కరోనా బాధితుల్లో చాలా మందికి కరోనా లక్షణాలు ఉండవు. అంటే దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు లేకుండా ఆరోగ్యంగానే కనిపిస్తారు. అందులోనూ శారీరక శ్రమ చేసే కార్మికుల్లో తొందరగా వైరస్‌ ‌లక్షణాలు బయటపడకపోవచ్చు. వీళ్లు సొంత ఊర్లకు చేరిన తర్వాత అక్కడ కలిసే వారు వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, శారీరకంగా బలహీనులు అయితే వైరస్‌ ‌వేగంగా వారిలో వ్యాపిస్తుంది. అంటే వీరు వైరస్‌ను ఇక్కడి నుంచి మోసుకువెళ్లి అక్కడ అంటించినట్లు అవుతుంది.

సరే వలస వచ్చిన వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో పెడతాం అని ప్రభుత్వాలు చెప్పినా…క్షేత్ర స్థాయిలో ఎంత వరకు సాధ్యం అన్న విషయం ఆలోచించాలి. చిన్న చిన్న ఇళ్లల్లో రెండు మూడు కుటుంబాలు కలిసి ఉండే దుర్భర పరిస్థితులే వలస కార్మికుల జీవితాల్లో ఉంటాయి. ప్రభుత్వ క్వారంటైన్లలో పెట్టినా అనుమానితులు అందరూ కలిసి ఒకే చోట ఉంటారు కనుక…క్యారియర్‌గా ఉండే వ్యక్తి నుంచి క్వారంటైన్‌లో ఉండే మిగిలిన వారికి వైరస్‌ ‌వ్యాపించే ప్రమాదాన్ని లెక్కవేయకుండా ఉండలేం. దీనికి కొన్ని ఉదాహరణలు చెబుతాను. సింగపూర్‌లో పరిస్థితి కాస్త స్థిమితంగానే ఉంది అనుకున్న తరుణంలోనే 24 గంటల వ్యవధిలో కరోనా కేసులు రెట్టింపయ్యాయి. 728 మందికి పాజిటివ్‌ ‌తేలింది. ఈ బాధితుల్లో 90 శాతం మంది అక్కడ డార్మిటరీల్లో ఉంటున్న విదేశీ కార్మికులే. దక్షిణాసియా వంటి అనేక ప్రాంతాల నుంచి దాదాపు 3 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అక్కడ ఉపాధి కోసం వచ్చి పెద్ద పెద్ద డార్మిటరీల్లో నివసిస్తుంటారు. పరీక్షలు చేస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇటు పంజాబ్‌ ‌కూడా ఇలాంటి ఉదంతాన్నే చూసింది. మహారాష్ట్ర నాందేడ్‌లోని హజూర్‌ ‌సాహిబ్‌ ‌నుంచి వచ్చిన వారితో పంజాబ్‌ ‌రాష్ట్రంలో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. ఇలా ప్రయాణం చేసే వారందరూ కొన్ని గంటల పాటు కొన్ని సందర్భాల్లో రెండు మూడుల రోజుల పాటు కలిసి ఉంటారు. కలిసి తింటారు. కాబట్టి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వెనక్కి మళ్ళుతున్న వలస ప్రయాణం కరోనా వేగంగా వ్యాపించటానికి కేంద్ర బిందువుగా మారే ప్రమాదం ఉంది.

Leave a Reply