Take a fresh look at your lifestyle.

వాళ్ళను.. వెళ్లనీయండి ! ప్లీజ్‌..

వాళ్ళు విమానాల్లో విహరించే వాళ్లకు రన్‌ ‌వేలు నిర్మించే  వలస జీవులు..
వాళ్ళు రైలు బోగీలకు పట్టాలేసి రహదారుల్ని నిర్మించిన బడుగుజీవులు
వాళ్ళు కాళ్ళు తడవకుండా బడాబాబుల్ని సముద్రాలు దాటించగల శ్రమజీవులు..
ఫ్యాక్టరీల పొగగొట్టాలే ఊపిరితిత్తుల్లా ఉచ్వాస నిచ్వాసాల్లో
విష వల(స )యం లో రాలిపోయి..తెగిపడిన విగత జీవులు వాళ్ళు
కళ్ళు తడుపుకుంటూ  కడుపు కాల్చుకుంటూ సకల సంపదల సృష్టి కర్తలు వాళ్ళు..
తాజ్‌ ‌మహల్‌ ‌నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల్లా
గ్రేట్‌ ఇం‌డియా వి(అంటి) ల్లాలకు చెమటోడ్చిన కష్టజీవులు వాళ్ళు..
వాళ్లేసిన రహదారులే వాళ్ళ కాలినడకను నిషేధిస్తే
వాళ్ళు నిర్మించిన ఆకాశ హర్మ్యాలే నిలువనీడనీయక  గెంటేస్తే
వాళ్ళ చెమటే పెట్టుబడులుగా నడిచే ఫ్యాక్టరీలు లాక్‌ ఔట్లలో విషం చిమ్మితే..
విశాఖ తీరం లో ఒరిగిపోయినవాళ్లు..
రైలు పట్టాలమీద తునకలైన వాళ్ళు..
వాళ్ళే దేశ సంపదకు రక్తం ధారపోసినవాళ్లు
వాళ్ళు వలసజీవులే కాని.. వలసపోయి దేశానికి రోగం తెచ్చిన వాళ్ళుకాదు..
వలసలతో కాలినడకన కరోనా దేశానికి అంటకుండా ‘సామాజిక ‘దూరంలో
పేగుబంధాలను పెనవేసుకోడానికి వేలమైళ్ళు
నడుస్తున్న వాళ్ళు.. రాళ్లు రప్పలు రైల్వే పట్టాలమీద
నెత్తుటి కాళ్లతో నడుస్తున్న వాళ్ళనర (డ  )క యాతన కు రైళ్లు..వాళ్ళను ఊళ్లకు చేర్చకున్నా..
నడిచి నడిచి అలసిన దేహాల్ని చీల్చకుంటే చాలు !!
వాళ్లిప్పుడు కాళీ కడుపులతో పిల్లాజెల్లను నెత్తురోడిన కాళ్లతో సూటుకేసుల్లా లాక్కెళుతున్నారు..
వీలైతే మానవత్వ నెనరుంటే వాళ్ళ గాయాలకు కట్టుకడదాం..
వాళ్ళ దేహాలన్నీ మహా నగర నిర్మాణాలకు రాళ్లెత్తి..
పాలరాతి పరిపాలనలో పశువులకన్నాహీనంగా తరమకుంటే చాలు
రహదారుల మీద నెత్తుటి కాళ్లపగుళ్ల తో రోదిస్తూ వెళ్తున్న వాళ్ళు..
స్టే హోమ్‌ ‌లో సేఫ్‌ ‌గా ఉన్నవాళ్లను..
వాళ్ళేమి వాటా అడగలేదు..
మనుసుంటే నడిచి నడిచి అలసిన దేహాలకు కాస్తంత నీడనివ్వండి..
వీలైతే బుద్దిజీవులుగా.. వాళ్ళను వాళ్ళ ఊళ్లకు క్షేమంగా వెళ్ళడానికి
పాలకుల మనసు కరిగేలా సందేశం పంపండి..
మనం ఇళ్లల్లో ఆత్మీయుల మద్య ఛాలెంజ్‌ ‌లు విసిరే విలాసాలకోసం కాకకన్న
తల్లి పేగుబంధం.. ఉన్నఊరు అనుబంధం కోసం..
వాళ్ళు ఊళ్లకు వెళ్తున్నారు..
వాళ్ళేమి దేశద్రోహుల జాబితాల్లో కాందిశీకులో..
కాదు ఈ నేలలో పుట్టి అభివృధి వెలుగు కోటలను నిర్మించిన వలసజీవులు..
భారత దేశ జీడీపీ లకు తమ నెత్తురు చెమటను నిత్యం ధారపోస్తూ రెక్కలకష్టం తప్ప..
ఏ నాడు ఏలికల్ని మావాటా మాకివ్వమని అడగలేని అభాగ్య జీవులు..
మనం మన ఇళ్లల్లో క్షేమంగా ఉండటం కోసం అయినా..
వాళ్ళను క్షేమంగా ఊళ్లకు వెళ్ళనిద్దాం.
వాళ్లకు విమానాలు విలాసవంతమైన క్వారెంటీన్‌ ‌లు వద్దు..
కడుపుకింత తిండి కాలుకింత దారి.. ఇవ్వండి న్యాయం అనిపిస్తే
మీపార్టీ మీటింగులకోసం.. ఎన్నికల్లో ఓట్లెయడానికి ఎత్తుకెళ్లినట్లు..
వాళ్ళింటిదాకా వాహనాల్లో దించిరండి మనుషులైతే…
సహచరి :9440970454

Leave a Reply