Take a fresh look at your lifestyle.

వలస కార్మికుల తరలింపు ఓ ప్రహసనం

పొట్టకూటి కోసం వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వారంతా కొరోనా లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుబడి పోయారు. కొరోనా వల్ల పనులు కోల్పోయిన కార్మికులకు కేంద్రం ప్రకటించిన సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్నాయి. వలస కార్మికులకు అవి అందడం లేదు. వలస కార్మికులకు గుర్తింపు కార్డులు లేనందున వారికి ఆయా ప్రాంతాల్లో స్థానిక యంత్రాంగాలు వారిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అలా చిక్కుబడిన వలస కార్మికులు లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించిన నాటి నుంచి మాటల్లో వర్ణించలేని రీతిలో కష్టాలు అనుభవిస్తున్నారు. అలాంటి వారిని స్వస్థలాలకు పంపాలన్న నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. వలస కార్మికులు ఎవరికి చెందిన వారు, వారిని ఎలా తరలించాలనే ప్రశ్నలు తలెత్తినప్పుడు కేంద్రం, రాష్ట్రాలు శషబిషలతో చాలా రోజులు కాలక్షేపం చేశాయి. బస్సుల్లో తరలించాలంటే చాలా రోజులు పడుతుందని రైళ్ళను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోరాయి. దానిని అంగీకరించేందుకు కూడా కేంద్రం తాత్సారం చేసింది. మొత్తం మీద రైళ్ళను ఏర్పాటు చేశారు. ఈ రైళ్ళల్లో ప్రయాణించే వలస కార్మికులు భౌతిక దూరం పాటించాలని నిబంధనలు వల్లె వేసారే తప్ప, స్వస్థలాలకు చేరే వరకూ వారి ఆకలి మంటలు తీరే మార్గం గురించి కేంద్రం కానీ, రాష్ట్రాలు కాని ఆలోచించలేదు. కేంద్రం ఏదో మొక్కబడిగా రైళ్ళను ఏర్పాటు చేస్తే, వలస కార్మికులు వెళ్ళిపోతే చాలునన్నట్టుగా రాష్ట్రాలు వ్యవహరించాయి. వలస కార్మికులకు, అసంఘటిత రంగ కార్మికులకు భోజనం ఏర్పాట్లు చేస్తున్నామంటూ మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేసుకుంటున్నా వాస్తవ పరిస్థితి ఆ విధంగా లేదు. స్వచ్ఛంద సంస్థలైనా వలస కార్మికులు గమ్యస్థానాలు చేరేవరకూ వారి భోజన ఏర్పాట్ల బాధ్యత తీసుకుని ఉంటే బాగుండేది. ప్రభుత్వ యంత్రాంగాల మధ్య సమన్వయం ఉంటే స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చేవే. ఈ బాధ్యతను తీసుకునేది ఎవరు. లాక్‌ ‌డౌన్‌ ‌నిబంధనలు సడలించారు కనుక మద్యం దుకాణాలను ఎప్పటి నుంచి తెరవాలన్న ఆలోచన మీదే మంత్రులు తమ దృష్టిని సారించాయి. మొత్తం మీద కొంత మంది వలస కార్మికులను రైళ్ళెక్కించారు. తిండి కోసం వారి పాట్లు ఏవో పడుతూ ప్రయాణిస్తున్న వలస కార్మికులను కొన్ని చోట్ల టికెట్లు ఇవ్వాలని రైల్వే అధికారులు పట్టుపట్టారు.

- Advertisement -

దాంతో వారు విస్తుపోయారు. టికెట్లు తీసుకోవాలని ఎవరూ చెప్పలేదనీ, అయినా తమ వద్ద అంత డబ్బు లేదని వారు వాపోయారు. ఈ విషయం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి వచ్చింది. వలస కార్మికుల చార్జీలను ప్రభుత్వం భరించలేకపోతే ఆ సొమ్మును తాము భరిస్తామంటూ ఆమె ప్రకటించారు. దాంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. చార్జీలు వసూలు చేయాలని తాము ఎవరినీ ఆదేశించలేదని కేంద్రం వివరణ ఇచ్చింది. వలస కార్మికులకు అయ్యే చార్జీల సొమ్ములో 85 శాతాన్ని కేంద్రం భరిస్తుందనీ, మిగిలిన 15 శాతాన్ని రాష్ట్రాలు భరించాలని వివరణ ఇచ్చింది. ఆ వివరణ ఏదో ముందే ఇచ్చి ఉంటే సోనియాగాంధీ జోక్యం చేసుకుని ఉండేవారు కారు. బీహార్‌ ‌ముఖ్యమంత్రి నితీశ్‌ ‌కుమార్‌ ‌వలస కార్మికుల చార్జీల భారాన్ని తాము భరిస్తామనీ, అంతేకాక, ఒక్కొక్కరికీ ఐదేసి వందల రూపాయిలు కూడా ఇస్తామని ప్రకటించారు. ఆయన అలా ప్రకటించడానికి కారణం ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఆర్‌జెడీ అధ్యక్షుడు లాలూ కుమారుడైన తేజస్వినీ యాదవ్‌ ‌చార్జీల మొత్తం ఎంతో చెప్పండి చెక్కు రాసిచ్చేస్తానంటూ ప్రకటన చేయడమే. ఇది కేంద్రమూ, రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల నాయకులు గంభీర ప్రకటనలు చేయడానికి కారణం అయింది. కొరనా లాక్‌ ‌డౌన్‌ ‌నియమనిబంధనల అమలులో కానీ, పేదలకు సహాయం అందించడంలో కానీ, కేంద్రమూ, రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల వలస కార్మికుల రైలు చార్జీల వ్యవహారం ప్రహసనంగా తయారైంది. అన్ని పార్టీలకూ రాజకీయ లబ్ధి పొందాలన్న దృష్టే తప్ప పేదలకు, కార్మికులకు సాయం అందించాలన్న చిత్త శుద్ధి లేదని ఈ ఘటన రుజువు చేస్తోంది. కొరోనా కష్టాలు అనుభవిస్తున్న పేదలు, అసంఘటిత రంగ కార్మికులను రాజకీయ నాయకులు ఆదుకోకపోగా ఈ సమయంలోను రాజకీయ లబ్ది కోసం పాకులాడడం శోచనీయం.

Leave a Reply