Take a fresh look at your lifestyle.

వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు .. పంపడం ఎలా ?

  • లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన కూలీల వివరాల సేకరణ
  • కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు
  • నోడల్‌ అధికారిగా సందీప్‌• ‌సుల్తానియా, వారంలోగా పంపేలా ఏర్పాట్లు

లాక్‌డౌన్‌ ‌కారణంగా రాష్ట్రంలో నిలచిపోయిన వాహనాలు, చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు ఎలా పంపాలనే విషయంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కొరోనా వైరస్‌ ‌నియంత్రణ చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మార్చి నెలలో లాక్‌డౌన్‌ ‌విధించడంతో ఉపాధి కోసం రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికులు ఇక్కడే చిక్కుకుపోయారు. ముఖ్యంగా ఇలాంటి వారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే లక్షల సంఖ్యలో ఉన్నారు. నగరంలో నిర్మాణ రంగం కార్యకలాపాలు అధికంగా ఉన్న గచ్చిబౌలి, మాదాపూర్‌, ‌బంజారాహిల్స్, ‌కూకట్‌పల్లి వంటి ప్రాంతాలతో బీహార్‌, ‌చత్తీస్‌గఢ్‌, ‌మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రాలకు చెందిన వారు ఉంటారు. వీరితో పాటు రోజువారీ కూలీ పనుల నిమిత్తం రాష్ట్రంలోని ఇతర జిల్లాలైన మహబూబ్‌నగర్‌, ‌మెదక్‌, ‌నల్లగొండ, వరంగల్‌ ‌జిల్లాల నుంచి వచ్చిన వారు చిక్కడపల్లి, ఉప్పల్‌, ‌పంజాగుట్ట, మెహదీపట్నం, అమీర్‌పేట, ఖైరతాబాద్‌ ‌వంటి ప్రాంతాలలో ఎక్కువగా నివసిస్తుంటారు.

ఒక్క హైదరాబాద్‌ ‌నగరంలోనే కాకుండా రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలైన వరంగల్‌, ‌కరీంనగర్‌, ‌నిజామాబాద్‌, ‌ఖమ్మం, ఆదిలాబాద్‌ ‌జిల్లాలకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో వలస కార్మికులు ఉపాధి కోసం వచ్చి ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. ఇలా జీవనోపాధి కోసం నగరానికి వచ్చిన కొందరు లాక్‌డౌన్‌ ‌ప్రారంభమైన తొలి రోజుల్లోనే పిల్లాపాపలతో తమ సొంత రాష్ట్రాలకు కాలినడకన బయల్దేరారు. వందల కిలోమీటర్ల దూరాన్ని సైతం లెక్కచేయకుండా తమ స్వస్థలాలకు పయనమయ్యారు. తమ సొంత రాష్ట్రాలకు వెళ్లలేని వారు ఏమి చేయాలో తెలియని సంకట స్థితిలో ఇక్కడే ఉండి పోయారు. లాక్‌డౌన్‌ ‌కారణంగా ఇక్కడ ఉండలేక, తమ సొంత రాష్ట్రానికి వెళ్లలేక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం షెల్టర్‌ ‌జోన్లలో నివాసం ఉండటానికి ఏర్పాటు చేయడంతో పాటు ఉచిత రేషన్‌, ‌నెలకు రూ. 500 నగదును సైతం గత రెండు నెలలుగా అందజేస్తోంది.

అయినప్పటికీ అటు ఉపాధి లేక ఇటు నిలువనీడ లేక ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో తమ సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని వందల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. రెండు రోజుల క్రితం సంగారెడ్డి సమీపంలోని కంది ఐఐటీలో భవన నిర్మాణ కార్మికులు దాదాపు 3 వేల మందికి పైగా రోడ్లపైకి వచ్చి తమ సొంత రాష్ట్రాలైన బీహార్‌, ‌మధ్యప్రదేశ్‌కు వెళ్లేందుకు అనుమతివ్వాలని డిమాండ్‌ ‌చేశారు. కాగా, దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలలో ఉపాధి కోసం వచ్చిన వలస కార్మికులు కూడా ఇదే తరహాలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి నిమిత్తం ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వచ్చిన వలస కూలీలను తమ సొంత రాష్ట్రాలకు పంపించి వేయాలని ఆదేశాలు జారీ చేసింది.

దీనికి సంబంధించి మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. ఆయా రాష్ట్రాలు వలస కూలీలకు కొరోనా పరీక్షలు నిర్వహించి బస్సులలో తరలించాలనీ, వారిని తరలించే ముందు బస్సులకు శానిటైజేషన్‌ ‌చేయాలనీ, వలస కూలీలందరినీ ఒకేసారి సామాజిక దూరం పాటిస్తూ తమ సొంత రాష్ట్రాలకు పంపించి వేయాలని సూచించింది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా నోడల్‌ అథారిటీలను ఏర్పాటు చేసి వలస కూలీల తరలింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించింది.

కేంద్రం తాజా మార్గదర్శకాల నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ‌కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాను ఎలా పంపించాలనే అంశంపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈమేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నిలచిపోయిన తమ రాష్ట్రాల వారి వివరాలను తెలియజేయాల్సిందిగా ఆయా రాష్ట్రాల చీఫ్‌ ‌సెక్రటరీలకు లేఖ రాశారు. తమ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను స్వరాష్ట్రానికి తరలించేందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లను చేసుకోవాలని ఆ లేఖలో కోరారు. వలస కార్మికులకు వేగంగా వారి సొంత రాష్ట్రాలకు తరలించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సందీప్‌ ‌కుమార్‌ ‌సుల్తానియా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నోడల్‌ అథారిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణలో నిలచిపోయిన వారికి అవసరమైన స్క్రీనింగ్‌ను నిర్వహించి వైరస్‌ ‌లక్షణాలు లేని వారికి ప్రయాణానికి అవసరమైన పాసుల కోసం నోడల్‌ అథారిటీని సంప్రదించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరోమారు పొడిగించనుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో నిలచి పోయిన వారిని వారంలోగా తమ సొంత రాష్ట్రాలకు పంపించాలన్న యత్నాలలో ప్రభుత్వం ఉంది.

Leave a Reply