Take a fresh look at your lifestyle.

మానసిక ఆందోళనలో వలస కార్మికులు

దేశంలో లాక్‌డౌన్‌ ‌కారణంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నవారిలో వలస కార్మికులు ముందు వరసలో ఉన్నారు. సొంతూరికి వెళ్లలేక, నగరంలో ఉండలేక వలస కార్మికులు మానసిక ఆందోళనలకు లోనవుతున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల వార్తా పత్రికలలో ప్రచురితమైన వార్తలను చూస్తే బీహార్‌కు చెందిన యువకుడు హైదరాబాద్‌ ఉప్పల్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌ ‌కారణంగా కొద్దిరోజులుగా ఒంటరిగా ఉంటూ మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపాధి కోసం ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు వచ్చిన వలస కార్మికులంతా ఇక్కడే చిక్కుకుపోయారు. కొందరు ఏరకంగా ఇంటి బాట పట్టినా, సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు మాత్రం నగరంలోనే ఉండిపోయారు. లాక్‌డౌన్‌ ‌వల్ల పనులు లేక, సొంతూళ్లకు వెళ్లలేక ఆగమాగం అవుతున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నామనే బాధతో మానసిక కుంగుబాటుకు గురవుతున్నారు.

హైదరాబాద్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఇదే సమస్య ఉంది. మంగళవారం ముంబైలో వేలాది వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లడానికి బాంద్రా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేస్తారని, రైళ్లను నడిపిస్తారని భావించి వాళ్లు అక్కడికి వచ్చారు. తమ స్వస్థలాలకు పంపించాలని ఆందోళన చేశారు. అదేవిధంగా పొట్ట చేత పట్టుకొని వలసొచ్చిన ఎంతోమందికి తెలంగాణ ప్రాంతం ఆసరాగా నిలుస్తుంది. ఉపాధి రిత్యా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలతో అఖండ భారత ప్రజలు నివసించే ప్రదేశంగా ఉన్న హైదారాబాద్‌ ‌మినీ ఇండియాగా పేరుగాంచింది. పని చేసే ప్రదేశాలలోనే వసతి సదుపాయాలు కల్పించడంతో ఎలాంటి చింత లేకుండా కార్మికుల జీవనం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతోంది. అనుకోకుండా వచ్చిన కరోన మహమ్మారి వారి జీవితాలను అతలాకుతలం చేస్తోంది. కొంతమంది మానసిక ఒత్తిడికిలోనై బలవన్మరణాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. క్షణికావేశంతో ఆత్మహత్యలు : దేశవ్యాప్త లాక్‌ ‌డౌన్‌తో ఉపాధి దొరక్క మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తమ బాధను చెప్పుకునేందుకు ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, నా అన్నవారు ఎవరు  లేక మానసికంగా కుంగుబాటుకు లోనవుతున్నారు. ఒంటరితనంతో మానసిక ఒత్తిడి తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బతుకుదెరువు కోసం వలసొచ్చి ఇలా బలైపోయావా..అంటూ కుటుంబ సభ్యులు రోధించడం కన్నీళ్ళను  తెప్పిస్తుంది.

మానసిక ధృఢత్వం : శక్తితో కంటే యుక్తితో లక్ష్యం సాధించడం తేలిక. శారీరక శక్తి కంటే మానసిక యుక్తి ఎంతో బలమైనది. ప్రభుత్వాలకు కార్మికుల మధ్య  సమన్వయం ఎంతో అవసరం. ప్రస్తుత పరిస్తితులలో ఉద్యోగ భద్రత కొరవడటం, ఉన్న ఊరు వదిలి ఎన్నో వందల కిలోమీటర్ల దూరం లో ఉన్న ఇతర రాష్ట్రాలలో పని చేస్తున్నారు. లాక్‌ ‌డౌన్‌ ‌మూలంగా వాళ్ళ ఉపాధికి గండి పడింది. దిక్కు లేని వరమయ్యామనే బాధతో మానసిక ఆందోళన తో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రపంచంలోని వయోజనులు రోజులో ఎక్కువ సమయాన్ని పని చేసే ప్రదేశంలోనే గడుపుతున్నారు. ఒడిదుడుకులు లేని జీవన ప్రయాణం కొనసాగడానికి నిర్ణయించే అంశాలలో ఒకటి పని చేసే ప్రదేశంలోని అనుభవాలు అనడంలో సందేహం లేదు. పని మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది, కాని నెగెటివ్‌ ఆలోచనలతో కూడిన వాతావరణంలో పని చేయడం శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ప్రస్తుత సమాజంలోని యువత మానసిక దృడత్వం పై కనీస అవగాహన లేక పోవడం ఆందోళన కలిగించే అంశం.

- Advertisement -

ప్రభుత్వ సాయం : గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో ఉన్న వలస కార్మికుల్లో 36వేల మందికి 12 కేజీల బియ్యం, రూ.500 నగదు పంపిణీ , మరో 41 వేల మంది క్రెడాయ్‌ ‌సాయంతో భోజనం, వసతికి ఏర్పాట్లు, 96 వేల మందికి జీహెచ్‌ఎం‌సీ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాట్లు మరియు లాక్‌డౌన్‌ను పొడిగించడంతో అప్పటివరకు కార్మికులందరికీ 12 కేజీల బియ్యం, రూ.500 నగదు అందేలా చూస్తామని, అద్దె కోసం వీళ్లను ఇబ్బంది పెట్టొద్దని ఇంటి ఓనర్లను కోరతామని ప్రభుత్వం తెలిపింది. కార్మికుల నివాస ప్రాంతాలు లేదా పని చేసే ప్రదేశాలలో స్నేహపూర్వక వాతావరణం కల్పించాలి. శారీరక అనారోగ్యానికి  ఇచ్చే ప్రాధాన్యతను మానసిక ఆరోగ్యానికి కూడా ఇవ్వాలి. మానసిక రుగ్మతలపై అవగాహన శిక్షణాకార్యక్రమాలు నిర్వహించాలి.అండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు : కార్మికులు  పాజిటివ్‌ ఆలోచనలు కలిగి ఉండాలి. ముందుగా గుర్తుంచుకోవాల్సింది మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండడానికి అవసరమైన సందర్భంలో తప్పక సహాయాన్ని తీసుకోవాలి. సహాయం తీసుకోవడంలో వెనుకడుగు వేయొద్దు. మీ కోసం పని చేసే బలమైన వ్యవస్థ ఉందని గుర్తించుకోండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీ వెంటనే ఉంటాయని గ్రహించాలి. మీరు పని చేసే ప్రదేశం మానసిక ఆరోగ్యానికి సురక్షితం కాకపోతే అక్కడి నుండి మరో అనుకూలమైన(వీలయితే) చోటికి మారే ప్రయత్నం చేయాలి.

కార్మికులలో భరోసాకోసం కాల్‌ ‌సెంటర్‌ : ‌లాక్‌ ‌డౌన్‌ ‌పొడిగించిన నేపథ్యంలో వలస కూలీల సమస్యల పరిష్కారం కోసం కార్మిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అసంఘటిత రంగంలోని వారి సమస్యలు పరిష్కరించేందుకు, వలస కార్మికులు ఎదుర్కొంటున్న వేతన సంబంధిత సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకుంటూ కార్మికులలో భరోసా నింపడానికి  దేశవ్యాప్తంగా 20 కాల్‌ ‌సెంటర్లు ఏర్పాటు చేశారు.అందరి సహకారంతోనే  కరోనా కట్టడి సాధ్యం : శతాబ్దాలపాటు ఆంగ్లేయులపాలనలో కొనసాగిన భారతదేశం 1947లో స్వాతంత్య్రం పొంది 73 ఏళ్లపాటు ప్రజాస్వామ్య దేశంగా మనుగడ సాగించగలగడం మానవాళి చరిత్రలోనే ఒక మహత్తర విజయం. ఎందుకంటే వలస పాలన నుంచి బయటపడిన ఎన్నో దేశాలు ప్రజాస్వామ్యాలుగా ప్రయాణం ప్రారంభించినప్పటికీ ఎక్కువ కాలం అలా కొనసాగలేకపోయాయి. అక్కడ రాజ్యాంగాలు రద్దయినాయి. మిలటరీ కుట్రలలో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు పతనమయినాయి. భారత ప్రజాస్వామిక దేశంలో ప్రజా ప్రతినిధులతో పాటుగా కార్మికులు, కర్షకులందరూ కలిసి కట్టుగా సాగినపుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది. కరోనా మహమ్మారిని తరిమేయడానికి అందరి సహాకారంతోనే లాక్‌ ‌డౌన్‌ ‌సాధ్యం.

Dr Atla Srinivas Reddy
డా।। అట్ల శ్రీనివాస్‌రెడ్డి
కౌన్సెలింగ్‌ ‌సైకాలజిస్ట్ ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌,
‌చేతన సైకాలజికల్‌ ‌ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ ‌సెంటర్‌
9703935321

Leave a Reply