Take a fresh look at your lifestyle.

వలస కార్మికులు, పొరుగు రాష్ట్రాల వారితోనే ప్రమాదం

  • గాంధీలో కొరోనా పాజిటివ్‌ ‌గర్భిణికి డెలివరీ చేసిన వైద్యులు
  • వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ‌సడలింపు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున వలస కార్మికులు, పొరుగు రాష్ట్రాల నుంచి ప్రయాణికులు వస్తున్న కారణంగానే రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా కొరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య పెరిగిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ ‌మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదట విదేశాల నుంచి వచ్చిన వారితో, తరువాత మర్కజ్‌ ‌యాత్రికుల వల్ల, ప్రస్తుతం విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న వారి కారణంగా వైరస్‌ ‌వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని తెలిపారు. రైళ్ల ద్వారా వచ్చిన వారిని ప్రతీ రైల్వే స్టేషన్‌లో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను హోటళ్లలో క్వారంటైన్‌లో ఉంచుతున్నట్లు వెల్లడించారు.

రోడ్డు మార్గంలో వచ్చిన వారికి రాష్ట్ర సరిహద్దుల్లోనే వైద్య బృందాలు పరీక్షలు చేసి 14 రోజుల పాటు హోమ్‌ ‌క్వారంటైన్‌లో ఉంచుతున్నారనీ, లక్షణాలు ఉన్న వారిని వెంటనే పరీక్షించి పాజిటివ్‌గా నిర్ధారణ అయిన పక్షంలో ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు విమానాల్లో 798 మంది, రైళ్లలో 239 మంది, రోడ్డు మార్గం ద్వారా 41,805 మంది రాష్ట్రానికి వచ్చినట్లు వెల్లడించారు. లాక్‌డౌన్‌ ‌సడలింపు వల్ల రాష్ట్రానికి ఎక్కువ మంది వస్తున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం గాంధీ వైద్యులు డా.షర్మిల, డా.రాణి కొరోనా పాజిటివ్‌ ఉన్న గర్భిణికి డెలివరీ చేశారనీ తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఐఎంఆర్‌ ఇన్ఫాంట్‌ ‌మోర్టాలిటీ రేటు గణనీయంగా తగ్గడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఐఎంఆర్‌ 39‌గా ఉండగా, ప్రస్తుతం 27కు తగ్గిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో ఈ విషయం స్పష్టమైందని తెలిపారు. ఇందుకోసం కష్టపడుతున్న వైద్య, ఆరోగ్య శాఖలోని ప్రతీ ఒక్కరికీ అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్‌ ‌కిట్‌ ‌వచ్చిన తరువాత చాలా మంది ప్రసవాల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకే వస్తున్నారనీ, దీనివల్ల తల్లిబిడ్డలు క్షేమంగా ఇంటికి వెళుతున్నారని ఈ సందర్బంగా మంత్రి ఈటల వెల్లడించారు.

Leave a Reply