‘‘మానసిక ఒత్తిడికి గురి చేసే మనస్సే…మానసిక ఒత్తిడిని తగ్గించే ఆయుధంగా కూడా ఉపయోగ పడుతుంది. ఒత్తిడిని పెంచే ఆలోచనలకు స్వస్తి చెప్పి.. మనస్సును ఆహ్లాదపరిచే ఆలోచనలకు రూపకల్పన చేయాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. చక్కటి సెలయేరు, పక్షుల కిలకిల రావాలు, సుందర మైన దృశ్యాలను, పచ్చిక బయళ్లను, రంగుల పక్షులను ఊహించుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. ఇదే రీతిలో యోగా, ధ్యానం, సంగీతం, రిలాక్సేషన్ వంటివి కూడా దీనికి బాగా ఉపయోగ పడతాయి.’’
నేటి వేగవంతమైన జీవనంలో పాఠశాలకు వెళ్లే చిన్నారి విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిళ్లకు గురౌతున్నారు. వీటి నుంచి బయట పడే మార్గం తెలియక అవస్థలు పడుతున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల మరణం, ఆర్ధిక సమస్యలు, పరీక్షల్లో తప్పడం, ప్రేమ విఫలం, నిరుద్యోగం, పెళ్లి కాకపోవడం, నమ్మి మోసపోవడం, సొంత ఇంటి నిర్మాణం, కుమార్తెల పెళ్ళిళ్లు, వ్యాపారంలో నష్టాలు, శారీరక అనారోగ్యం… ఇలా పలు కారణాలతో ప్రజలు మానసిక ఒత్తిళ్ల బారిన పడుతున్నారు. వంశపారంపర్యంగా మానసిక జబ్బులకు లోనయ్యే అవకాశాలూ ఉన్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతిని ఓదార్చే పెద్ద దిక్కు లేక నేడు చిన్న సమస్యలకే యువత ఆత్మన్యూనతతో మానసిక సమస్యలకు గురౌతున్నారు. మానసిక ఒత్తిడిలో ఉన్న వ్యక్తుల్లో కోపం, చిరాకు, భయం, దిగులు, నిద్రలేమి ఉంటాయి. వీటికి తగిన చికిత్సలు పొందకుంటే క్రమేపీ శారీరక రుగ్మతలుగా మారతాయి.
సమాజంలో మానసిక ఆరోగ్యం పట్ల, మానసిక వ్యాధుల పట్ల తగినంత అవగాహన లేదని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇంట్లో మానసిక జబ్బుతో ఉన్న రోగి ఉంటే దానిని సరిగా గుర్తించకుండా గాలి సోకిందని, చేతబడి చేశారని నమ్మి బాధితులను గుళ్లు, గోపురాలు చుట్టూ తిప్పుతూ జబ్బును నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గర్భిణుల్లో సగటున 10 శాతం మంది, ప్రసవం తరువాత 13 శాతం మహిళలు డిప్రెషన్‌కు గురవుతున్నారు. వర్ధమాన దేశాల్లో ఈ శాతం మరింత ఎక్కువగా ఉంటోంది. వర్ధమాన దేశాలకు చెందిన 15 శాతం గర్భిణులు, ప్రసవం తరువాత 19.8 శాతం మంది మహిళలు డిప్రెషన్‌కు లోనవుతున్నట్లు తేలింది.
పిల్లలు కూడా డిప్రెషన్‌తో బాధ పడుతున్నారని, భారత్‌లో 0.3 నుంచి 1.2 శాతం మంది చిన్నారులు డిప్రెషన్‌తో బాధ పడుతున్నారని, సకాలంలో వారికి మానసిక వైద్యం అందకపోతే అది వారి మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలిపింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్’ 2016లో భారతదేశంలోని 12 రాష్ట్రాల్లో చేసిన సర్వేలో అనేక ఆందోళనకర అంశాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే ప్రకారం 2.7 శాతం ప్రజలు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో సతమత మవుతున్నారు. మన దేశంలో 15 కోట్ల మందికి మానసిక సమస్యల నుంచి ఉపశమనం కోసం సత్వర వైద్య సహాయం అవసరమనీ ఈ సర్వే తేల్చింది. సైన్స్ జర్నల్ లాన్సెట్‌లో 2016లో ప్రచురితమైన ఒక నివేదిక.. దేశంలో మానసిక వైద్య సహాయం అవసరమైన ప్రతి 10 మందిలో కేవలం ఒక్కరే అలాంటి సేవలు పొందగలుగు తున్నారని చెప్పింది.
మరోవైపు భారత్‌లో ఏటా మానసిక సమస్యలతో సతమత మవుతున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది ఇలాగే కొనసాగితే పదేళ్ల తరువాత ప్రపంచంలో మానసిక సమస్యల బారినపడిన వారిలో మూడింట ఒక వంతు భారతీయులే ఉండొచ్చని ఆ నివేదిక అంచనా వేసింది. దిల్లీకి చెదిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అల్లీడ్ సైన్సెస్(ఐహెచ్బీఏఎస్) డైరెక్టర్, గత నలభయ్యేళ్లుగా సైకియాట్రిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ నిమిష్ దేసాయ్ ‘’కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, భారత్‌లో పాశ్చ్యాత్తీకరణ శరవేగంగా జరుగు తుండడంతో కొత్త సాంకేతికతల ఆవిర్భావం కూడా ఒత్తిళ్లకు కారణం కావొచ్చు. అందుకే సరైన అభివృద్ధి కావాలా? సరైన మానసిక ఆరోగ్యం కావాలా అన్న ప్రశ్న ఉదయిస్తుంద’’న్నారు.
మానసికంగానూ ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరాన్ని ఇప్పుడు చాలామంది గుర్తించారని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఇప్పటికీ సమాజంలో చాలామంది మానసిక సమస్యలకు గురవడాన్ని, దాన్నుంచి బయట పడేందుకు చికిత్స తీసుకోవడాన్ని తప్పు పనిగానే భావిస్తున్నారని, బయటకు చెప్పుకోవడం లేదనీ వైద్యులు చెబుతున్నారు. టీనేజర్లు, యువతను డిప్రెషన్లోకి నెడుతున్న కారణాల్లో సోషల్ మీడియా కూడా ఒకటని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు.
పిల్లలలో కూడా సోషల్ మీడియాలో స్టేటస్ అప్డేట్ చేయడం వంటి విషయాల నుంచి అనేక అంశాలు ఒత్తిడి పెంచు తున్నాయి. దేశంలో మానసిక సమస్యలు ఓ వైపు పెరిగిపోతుంటే మానసిక వైద్య నిపుణుల కొరత కూడా అంతకుమించి పెరుగుతోంది. అమెరికాలో సైకాలజిస్టులు, సైకియాట్రిస్ట్‌లు 60 వేల నుంచి 70 వేల మంది ఉండగా భారత్‌లో వారి సంఖ్య 10 వేల లోపే. ప్రస్తుతమున్న అవసరాల పరంగా చూసుకున్నా దేశంలో కనీసం మరో 15 వేల మంది మానసిక వైద్య నిపుణుల అవసరం ఉంది. మానసిక ఒత్తిడిలో ఉన్న వారికి తగిన చేయూతనిచ్చి ఓదార్పు మాటలు చెప్పడం చాలా ముఖ్యం. తగిన ఓదార్పుతో బాధితులు భవిష్యత్తులో డిప్రెషన, ఇతర మానసిక సమస్యలకు గురి కాకుండా రక్షించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇలా ఓదార్పు నిచ్చే వ్యక్తులు సైకియాట్రిస్టులు కానక్కర్లేదనీ, సొంత కుటుంబ సభ్యులు లేదా మిత్రులు కావచ్చనీ సూచించింది. సైకాలజిస్టులతో పాటు ఆసక్తి ఉన్న సైన్స గ్రాడ్యుయేట్లకు తగిన శిక్షణ ఇచ్చి వీరిని మానసిక ఒత్తిడి తగ్గించే విధంగా ప్రథమ చికిత్సలు (కౌన్సెలింగ్) ఇచ్చే నిపుణులుగా వినియోగించు కోవాలని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.
మానసిక ఒత్తిడికి గురి చేసే మనస్సే…మానసిక ఒత్తిడిని తగ్గించే ఆయుధంగా కూడా ఉపయోగ పడుతుంది. ఒత్తిడిని పెంచే ఆలోచనలకు స్వస్తి చెప్పి.. మనస్సును ఆహ్లాదపరిచే ఆలోచనలకు రూపకల్పన చేయాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. చక్కటి సెలయేరు, పక్షుల కిలకిల రావాలు, సుందర మైన దృశ్యాలను, పచ్చిక బయళ్లను, రంగుల పక్షులను ఊహించుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. ఇదే రీతిలో యోగా, ధ్యానం, సంగీతం, రిలాక్సేషన్ వంటివి కూడా దీనికి బాగా ఉపయోగ పడతాయి. ఒత్తిడిని తగ్గించే మరో మార్గం ఏదో ఒక హాబీని అలవర్చు కోవడం. ప్రతి రోజూ నిర్ణీత సమయంలో వాకింగ్ చేయడం, ఈత కొట్టడం, సైక్లింగ్ చేయడం, చిత్రలేఖనం, చక్కటి సంగీతం వినడం ఎలా ఏదో ఒకటి ఎంచుకోవాలి. పెద్దవారైతే దైవ పూజలో, పుస్తక పఠనంలో గడపవచ్చు. ఒత్తిడిలో ఉన్నప్పుడు, కూర్చువాలి లేదా నిశ్శబ్దమైన, సౌకర్యవంతమైన ప్రదేశంలో పడుకోవాలి. కళ్లను మూసివేసి, ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ 5 అంకెలు, ఆపై శ్వాస వదులుతూ 5 అంకెలు లెక్కపెట్టాలి. రిలాక్సడ్ అయ్యేంతవరకు 5 లేదా 6 సార్లు పై పద్ధత్తిని పునరావృతం చేయాలి. అప్పుడు ప్రశాంతత చేకూరుతుంది. ఒత్తిడి అనేది జీవితంలో ఒక తప్పించలేని భాగం, తగ్గించేందుకు కృషి చేయాలి…
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494