Take a fresh look at your lifestyle.

మానసిక రుగ్మతలే మానవాళి మనుగడకు ప్రమాదం

“ఆధునిక సాంకేతిక సమాజం సకల అవస్థల సమాహారంగా మారింది.. సమాజాన్ని పట్టి పీడించే అంతుపట్టని అంతులేని వింత వ్యాధి కొరోనా కంటే అతి వేగంగా ప్రబలుతున్నది. కుటుంబాలకు కుటుంబాలనే అధోగతి పాలు చేసే అతి భయంకరమైన మనో రుగ్మతలను లాక్‌ ‌డౌన్లు, కర్ఫ్యూలు నిరోధించలేవు. తాము బ్రతకడం కోసం ఇతరులను నాశనం చేయడం, మంచిని వంచించి దహించడం, సహనం నశించి, సాటి మనుషులను హింసించడం, ఈర్ష్యాద్వేషాలు వంటి అనేక రుగ్మతలు సమాజంలో ప్రశాంత వాతావరణాన్ని మాయం చేస్తున్నాయి.”

ఆధునిక సాంకేతిక సమాజం సకల అవస్థల సమాహారంగా మారింది.. సమాజాన్ని పట్టి పీడించే అంతుపట్టని అంతులేని వింత వ్యాధి కొరోనా కంటే అతి వేగంగా ప్రబలుతున్నది. కుటుంబాలకు కుటుంబాలనే అధోగతి పాలు చేసే అతి భయంకరమైన మనో రుగ్మతలను లాక్‌ ‌డౌన్లు, కర్ఫ్యూలు నిరోధించలేవు. తాము బ్రతకడం కోసం ఇతరులను నాశనం చేయడం, మంచిని వంచించి దహించడం, సహనం నశించి, సాటి మనుషులను హింసించడం, ఈర్ష్యాద్వేషాలు వంటి అనేక రుగ్మతలు సమాజంలో ప్రశాంత వాతావరణాన్ని మాయం చేస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా హింసాదృక్ఫథం విస్తరిం చింది. హింస అతి పెద్ద వ్యూహాత్మక ప్రక్రి యగా మారింది. ఉగ్రవాదం తో మనుషులను చంపే రాక్షస క్రీడ కొందరిదైతే, కారణ రహితంగా తోటి మనుషులను హింసించి బ్రతికే క్రీడా విన్యాసం మరికొందరిది. భౌతిక పరమైన హింసతో తృప్తి పొందే వారు కొందరైతే మానసిక హింసతో మురిసిపోయేవారు మరికొందరు. తనను తాను హింసించుకుని ఆనందించే వారు మరికొందరైతే పరులను తమ మాటలతో, చేష్ఠలతో హింసించి, వారు క్షోభపడితే, వారు పడే బాధలో నుంచి ఆనందాన్ని వెతుక్కునే పైశాచిక మనస్తత్వం మరికొందరిది. ఉగ్రవాదహింస రాజ్యకాంక్ష కోసమో, మతమౌఢ్య ప్రేరితమో కావచ్చు. పరులను మాటలతో, చేష్ఠలతో పీడించుకుతినే మానసిక రోగుల పరపీడనకు కారణమంటూ ఉండదు.

మనోవికారాలు – మానసిక జాఢ్యాలు వ్యక్తిగ తమైనవే కావు. ఈ రుగ్మతలు సమాజానికి పెను ప్రమాదం తీసుకువస్తున్నాయి. ఒకరి జీవితంలో మరొకరు జోక్యం చేసుకుంటూ కలహ భోజన ప్రియత్వంతో నిరంతరం తగువులు పెట్టే మహానుభావులు కొందరైతే, లేనివి ఉన్నట్లు కల్పించి, ఇతరుల జీవితాలలో చిచ్చుపెట్టి, వారి మరణాలను కారణభూతులౌతున్న వారు మరికొందరు. నలుగురు ఒకచోట కలిస్తే వేరేవారిపై వ్యాఖ్యనాలు, మళ్ళీ ఈ నలుగురే బయటకొచ్చి ఒకరిపై ఒకరు దుష్ఫ్రచారాలు. సుఖజీవన సారాంశాన్ని వదిలేసి, పరుల జీవితాలతో చెలగాటమాడడం ఈ దుష్టత్వం. కారణ రహిత విధ్వంస మనస్తత్వం ప్రమా దకరం. యువత మధ్యవయస్కులు, వృద్దులు ఒకరేమిటి ఈ రకమైన మానసిక రోగాలకు కుల, మత, ప్రాంతీయ బేధాలు లేనే లేవు. విద్యావంతులు, విద్యా విహీనులనే వ్యత్యాసమే కనిపించదు. విశ్వ వ్యాప్తి చెందిన మానసిక రుగ్మతలను నిర్మూలించక పోతే మానవాళి మనుగడకే ప్రమాదం.

చరవాణిలో ఛాటింగ్‌ ‌లేకపోతే మనో వ్యాకులత చెందేవారిని చూస్తున్నాం. సెల్ఫీల పిచ్చితో ప్రమాదాల్లో మరణించేవారిని, టిక్టాక్‌ ,‌పబ్జీ గేములతో వ్యసన పరులుగా మారి, సమాజానికి అత్యంత భారమై తల్లి దండ్రులకు మనో వ్యాకులతను కలిగిస్తున్న యువత సంగతి మనకు తెలుసు. సైకలాజికల్‌ ‌డిజార్డర్స్ ‌కోకొల్లలు. యువత కళాశాలల్లో జూనియర్లను వేధించే సంస్కృతి వేలం వెర్రి. విద్యార్ధులు,ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువత ర్యాగింగ్‌ ‌భూతానికి బలైపోతున్నది. వెర్బల్‌ అబ్యూస్‌, ‌ఫిజికల్‌ అబ్యూస్‌ ‌లాంటి అవాంఛనీయ చేష్ఠలకు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ర్యాగింగ్‌ ‌మనస్తత్వాలు పెరిగి బంగారు జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి. చక్కని విద్యాప్రమాణాలతో విలసిల్లుతున్న ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలలో, యూనివర్శిటీల లో ర్యాగింగ్‌ ‌కి ఎన్నో జీవితాలు నిష్కారణంగా బలై పోతున్నాయి. ‘‘ర్యాగింగ్‌’’ అనేది ఒక మానసిక రుగ్మత.

మాదకద్రవ్యాల వ్యసనం మరో రకమైన మానసిక వ్యాధి. యువశక్తి నిస్తేజమై పోతున్నది. మనకు సంబంధించి ఇది దేశ ఆర్ధిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడానికి పన్నిన కుట్ర. ఈ మనోవైకల్యం అంటించుకున్న యువత మత్తు లో పడి దేశానికి తీరని నష్టం చేస్తున్నది. కుల,మత దురహంకారాలనే మానసిక రుగ్మతలు సమాజానికి తీరని ద్రోహం చేస్తున్నాయి. ఈ సామాజిక రుగ్మతలను కొందరు స్వార్ధ ప్రయోజనాలకోసం వాడుకుంటున్నారు. కొందరిలో మూఢ విశ్వాసాలు, మూఢభక్తి పెరగడం విచారం. మానవత్వం, మంచితనం, పరోపకారం, సత్ప్రవర్తన మాత్రమే దైవానుగ్రహానికి అర్హం.’’అతి సర్వత్రవర్జయేత్‌ ‘‘ అన్నారు.

ప్రత్యేక దర్శనాలతోనో, నిరంతర జప,తప విన్యాసాలతోనో, రేయింబవళ్లు భగన్నామ స్మరణతోనో దైవానుగ్రహం కలగదు. స్వామీ వివేకానంద హితవచనాలే మూఢభక్తికి విరుగుడు. ఆధ్యాత్మిక చింతన వలన పాపభీతి కలగాలి. ఆధ్యాత్మిక చింతనే సకల రోగ హరణం అని పరిశోధనలు తేల్చిచెప్పాయి. హింస,అత్యాచారాలు, నోటి దురుసుతనం, శీలహననం, అహంకారం, వాక్కాలుష్యం.. మనిషిని దిగజార్చే మనో వ్యాధులు. ఈ మానసిక రుగ్మతల నివారణకు చిత్తశుద్ధితో కూడిన ఆధ్యాత్మిక చింతన, నైతిక ప్రవర్తన, అభ్యుదయ భావాలతో కూడిన ఆలోచనా సరళే నిజమైన ఔషధాలు. చిన్నతనం నుండే సత్ప్రవర్తన అలవడాలి. సమాజం పట్ల అవగాహన, పెద్దల పట్ల గౌరవం, సంస్కారం, వినయ విధేయతలు లోపించిన విద్యల వలన సమాజానికి లాభం కంటే నష్టమే అధికం.
– సుంకవల్లి సత్తిరాజు : 9704903463,సంగాయగూడెం,

దేవరపల్లి మండలం, ప.గో.జిల్లా, ఆంధ్రప్రదేశ్‌-534 313.

Leave a Reply