Take a fresh look at your lifestyle.

వివాహేతర సంబంధాలతో మానసిక రుగ్మతలు

ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన సంఘటన ఒకరి తప్పు ఇద్దరి జీవితాలను ఆర్పేసింది. బావను పెండ్లి చేసుకుని ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన నవ వధువు  పాద పారాణి కూడా ఆరక ముందే అడవిలో విగత జీవిగా మారింది.  ప్రియురాలిని దక్కించుకునేందుకు భర్త చేసిన కుట్రతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ప్రియుడు చేసిన పని మనస్తాపానికి గురైన ఆ ప్రియురాలు రైలు కింద పడి  ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో చనిపోయింది ఇద్దరు యువతులైన కారణం మాత్రం వివాహేతర సంభంధమే అని ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

ఏమయ్యిందో ఏమో కానీ, చివరిదాక ఒకరి నొకరం కలిసుంటామని బాసలు చేసుకుని, వేద మంత్రాల సాక్షిగా,  మూడుముళ్ల బంధంతో ఏకమవుతున్న యువతీయువకులు మద్యలోనే బంధాన్ని తుంచేస్తున్నారు. ఇటీవల వార్తలను పరిశీలిస్తే ప్రస్తుతం వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి.

సాధారణంగా క్షణికావేశం లో మొదలయ్యే వివాహేతర సంబంధాలు హంతకులుగా మారుస్తున్నాయి.  వరంగల్‌ ‌లో జరిగిన సంఘటన చూస్తే వివాహ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉంది. కామంతో ఆమె కండ్లు మూసుకుపోయాయి. వావి వరుసలు మరించింది. కొడుకులా భావించాల్సిన మరిదిని ప్రియుడిగా మార్చుకుంది. ఆపై భర్త అడ్డు తగులుతున్నాడని చెప్పి.. ప్రియుడు మరో ఇద్దరితో కలసి భర్తను చంపించేసింది. అసలు ఏం జరుగుతుందో ఎందుకు ఇలా జరుగుతోంది. ఇవి ఇలాగే కొనసాగితే భారత దేశ సాంప్రదాయంలో వివాహ బంధానికి మాయని మచ్చలా ఏర్పడే ప్రమాదం ఉంది.

వివాహేతర సంబంధాలు దేశ సంస్కృతికి, వివాహ వ్యవస్థకు మాయని మచ్చగా పేట్రేగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడమేనా. ఆధునిక టెక్నాలజీ మనిషీ జీవన విధానానికి ఉపయోగపడటం కంటే వినాశానానికే దోహదం చేస్తుంది. వ్యక్తులు వివాహేతర సంబంధాన్ని చాలా చిన్న విషయంగా చూస్తున్నారు. విలువలను వదిలేస్తున్నారు. మహిళలైనా, పురుషులైనా దూరప్రాంతాల్లో ఉద్యోగాలు చేయడం, ఒంటరిగా జీవించడం, వివాహాలు ఆలస్యం కావడం, స్త్రీ పురుషులు ఇరువురు సంపాధనే లక్ష్యంగా వెంపర్లాడటం, కుటుంబానికి, భాగస్వామికి కావలిసినంత సమయం కెటాయించక పోవడంతో తీయని మాటలు చెప్పేవారికి దగ్గరయ్యి వివాహేతర సంబంధాలకు తెరలేపుతున్నాయి.

వాస్తవానికి స్త్రీలు ఎమోషనల్‌గా పురుషులకు దగ్గరయితే,  పురుషులు మాత్రం మోటివేషనల్‌గానే స్త్రీ సాన్నిహిత్యం కోరుకుంటున్నారు. వేళ్లూనుకుంటున్న ఈ విష సంస్కృతికి విరుగుడు ఉందా? అంటే సందేహం తప్ప సమాధానం రానంతగా ఈ దుర్వ్యవస్థ సమాజమంతటా విస్తరిస్తోంది.

సోషల్‌ ‌మీడియా ప్రభావం:

స్మార్ట్ ‌ఫోన్‌ ‌లు తక్కువ ధరలకే అందుబాటులోకి రావడం, ఇంట్లో కుటుంబసభ్యులు ఎందరు ఉంటే వారందరు స్మార్ట్ ‌ఫోన్‌ ‌లు వాడటం, మానవ సంబంధాల కంటే ఎక్కువగా  వాట్సాప్‌, ‌ఫేస్‌బుక్‌, ‌ట్విట్టర్‌, ‌టెలిగ్రామ్‌ ‌లాంటి సోషల్‌ ‌మీడియాకే ప్రాధాన్యతను ఇవ్వడంతో మానవ సంబంధాలను మరుగున పడుతున్నాయి. సోషల్‌ ‌మీడియా ద్వారా ఎవరెవరో ముక్కూ మొహం తెలియనివారు కూడా స్నేహితులుగా పరిచయమవుతున్నారు. స్నేహంతో మొదలయిన పరిచయాలు పక్కదారి పడుతూ  ఇంట్లో వుంటూనే రహస్యంగా చాటింగ్‌ ‌లు, మెసేజ్‌ ‌లు పంపించుకోవడం చేస్తున్నారు. మెసేజ్‌ ‌లతో మొదలయ్యి తీయటి మాటలతో వారి భాగస్వామి కంటే అమితంగా గౌరవిస్తున్నట్టు నటించి వారికి విడదీయలేనంత దగ్గరైపోతున్నారు. ఈ క్రమంలో వారితో కలిసి వుండేందుకు ఇవతలి వారు ఎంతకైనా సరే నంటూ తెగించేస్తున్నారు.  ఎదుటి వారిని వదిలి వుండలేని స్థితికి చేరిపోవడంతో రక్తసంబంధాలు, కుటుంబ కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలను సైతం తుంగలో తొక్కి హత్యలకు ఎగబాకుతున్నారు. వివాహేతర సంబంధాల వల్ల కలిగే అనర్థాలు, ఎదరయ్యే సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యతను ప్రభుత్వాలు సీరియ్‌సగా చేపట్టాలి.

సినిమాలు, సీరియళ్ల ప్రభావం:

వివాహేతర సంబంధాలపై  సినిమాలు, సీరియళ్ల తీవ్రంగా ప్రభావం చూపుతోంది. గతంలో కట్టుబాట్లకు విలువనిచ్చే మహిళలు, పురుషులపై టీవీ సీరియళ్లు, సినిమాల ప్రభావం తీవ్రంగా పడడంతో అవి కనుమరుగైపోయాయి. వివాహేతర సంబంధాల మోజులో పడి తమ భాగస్వామ్యులను అంతమొందించేస్తున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి తమ కన్నపేగులను సైతం సమిధలుగా మార్చుకుంటుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడో ఒకచోట భర్తను చంపిన భార్య… భార్యను చంపిన భర్త, అక్రమసంబంధానికి అడ్డుగామారాడని పిల్లలను చంపిన భార్య/భర్త వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పోకడలు వివాహ వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా చెప్పుకోవాలి.

కుటుంబానికి తగినంత సమయాన్ని కేటాయిస్తేనే …..
వివాహేతర సంబంధ బాధితులు సాధ్యమైనంత త్వరగా మామూలు జీవితం మొదలుపెట్టే దారులు వెతకటం అత్యంత ఆవశ్యకం. సానుకూల ఆలోచనలతో భవిష్యత్తు పట్ల ఆశావహ దృక్పథం తో ఉండటం చాలా అవసరం. స్మార్ట్ ‌ఫోన్‌ ‌సమయం మేరకే ఉపయోగిస్తూ కుటుంబంతో గడిపే సమయాన్ని పెంచుకోవాలి. సినిమాలు, టి.వి. సీరియల్లు ఎంటర్‌ ‌టైన్‌ ‌మెంట్‌ ‌గా మాత్రమే స్వీకరించాలి. వారాంతపు రోజులలో విహార యాత్రలకు కుటుంబ సమేతంగా వెళ్ల డానికి ప్రయత్నించాలి.

నమ్మిన వ్యక్తి ని మోసం చేయాలనే ఆలోచనను మనసులోకి రానివ్వకూడదు…..

పెళ్లంటే నూరేళ్ల పంట. ఆప్యాయత, అనురాగం… ఆత్మీయత, అనుబంధం… పెనవేసుకున్న బంధం భార్యాభర్తల ప్రేమ బంధం. దాంపత్య జీవన ప్రయాణానికి భర్త, భార్య ఇద్దరు  సారథులే. ఇద్దరూ సమానులే. ఒకరిపై మరొకరికి నమ్మకం దాంపత్య జీవితం లో ప్రధానమైనది. వేరొకరితో స్నేహంగానో, అవసరం ఉండి ఏదైనా మాట్లాడినా కూడా తప్పు పట్టుకుంటే అది బాధాకరమే. కించ పరిచే మాటలు మాట్లాడే అలవాటు ఉంటుంది కొందరిలో, అలా అనడం వలన తనకు ఆత్మ సంతృప్తి కలుగుతుంది కాని తనతో జీవితం పంచుకునే వ్యక్తికి బాధను కలిగిస్తుందనేది గుర్తించగలగాలి. తాత్కాలిక బంధాలు కోసం భవిష్యత్తును భారం చేసుకోకూడదు. నమ్మిన వ్యక్తి ని మోసం చేయాలనే ఆలోచనను మనసులోకి రానివ్వకూడదు. ఎక్కువశాతం వివాహేతర సంబంధాలు ఏర్పడటానికి కారణం, ఇద్దరి మధ్య ఉండే సంబంధాన్ని అభివృద్ధి చేసుకోకపోవడమే ప్రధాన సమస్య. ఒకరి అభివృద్ధికి ఇంకొకరు తోడు నీడగా ఉండాలి ఒకరికి ఒకరు భరోసా గా ఉండాలి. ఆనందమయ జీవితానికి సర్దుబాటు తప్పనిసరి అని గుర్తించాలి.

వివాహేతర సంబంధాలతో  మానసిక రుగ్మతలు …
వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకున్న వాళ్లల్లో మొదట్లో చిన్నగా దిగజారడం మొదలై తరువాత అదుపు చేయలేని స్థితికి వస్తారు. భావోద్వేగాలను అదుపు చేయలేక వారి సంబంధానికి అడ్డువస్తున్న వారిని చంపేందుకు సిద్ధపడతారు. న్యూయార్క్ ‌విశ్వ విద్యాలయ పరిశోధన ప్రకారం వివాహేతర సంబంధాలు మహిళల్లో బైపోలార్‌ ‌డిజార్డర్‌, ‌స్కిజోఫ్రేనియా వంటి మానసిక రుగ్మతలకు కారణమవుతోంది. భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య వస్తే పరిష్కరించుకునేందుకు నిపుణుల సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

కుటుంబ లోటుపాట్లు సరిదిద్దుకోవడానికి మనస్తత్వ వేత్తల ద్వారా కౌన్సెలింగ్‌ ‌తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ప్రభుత్వం తగిన స్థాయిలో సఖీ కేంద్రాల తరహాలో ఉచిత మానసిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి మనస్తత్వ నిపుణులతో ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ ‌సౌకర్యం ఏర్పాటు చేయడం ద్వారా ఈ తరహా నేరాలను అరికట్టే అవకాశం ఉంది.

Leave a Reply