Take a fresh look at your lifestyle.

రైతుబజార్‌ ‌గట్టిండ్రు.. గాలిల ఒదిలిండ్రు..!

  • అమ్మెటోళ్ళు లేరు.. కొనెటోళ్ళు రారు..
  • బోసివోతున్న మేడిపల్లి రైతుబజార్‌..
  • ‌నిగ్రాని లేక దివాలా లక్షల సొమ్ము దండుగనేనా..? 

మేడిపల్లి, పరిసర ప్రాంతాల వారి అవసరాలు తీర్చుతుందనుకున్న మేడిపల్లి రైతుబజార్‌ ‌మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మూన్నాళ్ల పాటే ముచ్చటగా వెలిగిన ఈ రైతుబజార్‌ ‌భవితవ్యంపై కారుమేఘాలు అలుముకు ంటున్నాయి. లక్షలు వెచ్చించి అందుబాటులోకి తెచ్చినా సంబంధిత అధికారులు దాని నిర్వహణపై దృష్టిసారించక పోవడంతో కొనుగోలుదారుల ఆదరణ కరువై ఉనికి అగమ్యగోచరంగా తయారయ్యింది. ఓ వైపు వారాంతపు వీధి సంతలు ప్రజలకు చేరువ వుతుంటే ఈ రైతు బజార్‌ ‌మాత్రం దూరమ వుతోంది. రైతుబజార్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చిత్తశుద్ధితో చొరవతీసుకుంటేనే మన గలుగుతుంది.

వెలవెలబోతున్న రైతుబజార్‌ ‌స్టాలు
వెలవెలబోతున్న రైతుబజార్‌ ‌స్టాలు
ప్రజాతంత్ర, మేడిపల్లి
రైతులకు గిట్టుబాటు ధర, వినియోగదారులకు సరసమైన, నాణ్యమైన, తాజా కూరగాయలు ఇతర
ఆహార ఉత్పత్తులు అందించాలనే సదుద్దేశంతో మేడిపల్లిలో నెలకొల్పిన రైతుబజార్‌ ‌భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. నెలకొల్పిన తొలినాళ్లలో కిక్కిరిన జనంతో కిటకిటలాడిన ఈ రైతుబజార్‌ ‌కొంతకాలంగా ఒకటి, రెండు స్టాళ్లకే పరిమితమై కళతప్పి వెలవెలబోతోంది. మణ్య దలారీల ప్రమేయం లేకుండా నేరుగా రైతులు తమ ఉత్పత్తులను వినియోగదారులకు అమ్ముకునేందుకు వేదికగా రైతుబజార్‌లు ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు రైతులు, ఇటు వినియోగదారుల మేలు కాంక్షించి పీర్జాదిగూడ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌లో అంతర్భాగమైన మేడిపల్లిలోనూ 2015 సంవత్సరం జూన్‌ ‌నెలలో రూ. 66 లక్షలు వెచ్చించి ప్రధాన రహదారి సమీపంలోని ఎకరాకుపైగా స్థలంలో సుమారు 40 స్టాళ్ళతో రైతుబజార్‌ ‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో తాగునీరు, మరుగుదొడ్డు, మూత్రశాలలు, విద్యుత్‌దీపాలు, వాహనాల పార్కింగ్‌ ‌వంటి మౌళిక సౌకర్యాలు కల్పించింది. ఈ రైతుబజార్‌ ‌ప్రారంభమైన తొలినాళ్లలో ఇతర ప్రాంతాల రైతులతో కొద్ది కాలంపాటు విక్రయాలు సాగించారు. అయితే దూరప్రాంతాల నుంచి రైతుల రాక తగ్గడంతో వ్యాపారులదే ఇష్టారాజ్యంగా ఇక్కడ కూరగాయలు అధిక ధరలకు, నాసిరకం ఉత్పత్తులు అమ్మకాలు జరుపడం వినియోగదారుల ఆద•రణ  కోల్పోవడానికి ఓ కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి.
దివాలాకు పెయిడ్‌ ‌పార్కింగ్‌, ‌వీధి సంతలే కారణమా..!?
అధిక ధరల ప్రభావం, నాసిరకం కూరగాయల అమ్మకాలతో పాటు వాహనాలపై వచ్చే వినియోగదారుల నుంచి బలవంతంగా పార్కింగ్‌  ‌ఫీజుల (పెయిడ్‌ ‌పార్కింగ్‌) ‌భారం మోపడం ఓ వైపు మరో వైపు వారాంతపు వీధి సంతలు రైతుబజార్‌ ‌దివాలాకు కారణమని  స్థానికులు పేర్కొంటున్నారు. ఈ చర్యలతో కొనుగోలుదారుల నుంచి ఆద•రణ అంతకంతకు కొరవడడంతో అమ్మకందారులు స్టాళ్లను మూసివేసి ఇతర చోట్లకు తరలిపోయారు. ప్రస్తుతం ఈ రైతుబజార్‌ ఒకటి, రెండు స్టాళ్లకే పరిమితమయ్యింది. ఆయా కాలనీల్లో వారానికొకరోజు చొప్పున నిర్వహిస్తున్న సంతల మూలంగా కొనుగోలుదారులు తగ్గిపోయారని పలువురు అభిప్రాయపడుతున్నారు. రైతుబజార్‌ ‌పూర్వవైభవానికి, సక్రమ నిర్వహణకు సంబంధిత శాఖ అధికారులు, స్థానిక మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌చొరవ చూపాలని, లేదంటే ప్రభుత్వం లక్ష్యం నెరవేరకపోగా లక్షల రూపాయల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరవుతుందని పలువురు హెచ్చరిస్తున్నారు.

రైతుబజార్‌ ‌సంరక్షణకు పూనుకోవాలి..
మేడిపల్లిలో రైతుబజార్‌ ‌మనుగడ ప్రశ్నార్థకమవడం శోచనీయం. దీర్ఘకాలిక ప్రయోజనాలతో కూడుకున్న రైతుబజారు దివాలా తీసిన పరిస్థితులు భేరీజు వేసుకుని దిద్దుబాటు చర్యలకు పూనుకోవాలి. సరైన నియంత్రణ, పర్యవేక్షణలకు అవకాశం లేని వీధి సంతలు రైతు బజారుకు ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కావు. భవిష్యత్‌ అవసరాలకు తగినట్లు మేడిపల్లి రైతు బజారును ఆధునీకరించి సక్రమంగా కొనసాగేలా చూడాలి.

image.png

– ఎ. ఉమామహేశ్వరరావు, మేడిపల్లి.

వీధి సంతలను నియంత్రించాలి..
మేడిపల్లి మండల పరిధిలోని పీర్జాదిగూడ, పర్వతాపూర్‌, ‌బోడుప్పల్‌, ‌చెంగిచర్ల ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీల్లో వారానికోసారి వీదుల్లో సంతలు కొనసాగడం రైతుబజార్‌ ఉనికికి సవాల్‌ ‌విసురుతోంది. రైతుబజార్‌లో కూరగాయలతో పాటు పూలు, పండ్లు, నిత్యావసర సరుకులు అమ్మేలా చర్యలు తీసుకోవాలి. అంతే కాకుండా ఏటిఎం,  మీ సేవ కేంద్రాలు, ఆర్టీసీ రిజర్వేషన్‌ ‌కౌంటర్‌ ‌వంటివి ఏర్పాటు చేస్తే ప్రజలు ఆదరిస్తారు.
image.png

– పి. శేషగిరిరావు, మేడిపల్లి.

Leave a Reply