సర్కారు తన ఠంకశాలను
పరిపుష్టం చేసుకునేందుకు
బీదలు సామాన్యు ప్రజలను
బలి పశువుగా మారుస్తుంది
ఆర్థికమాంద్యం మాటున
‘పన్ను’ల గుదిబండ మోపి
జనావళి వెన్ను విరుస్తుంది
నిత్యావసర ధరలను పెంచి
చుక్కల చూపింది చాలనట్టు
ఇపుడు మందు గోలీల మీద
భీకర ప్రతాపం ప్రదర్శిస్తుంది
ఔషధ రేటు భారీగా పెంచి
మృత్యు క్రీడలు వీక్షిస్తుంది
ఇపుడు జబ్బుల కన్నా
మందులే బాధిస్తున్నాయ్
వైద్యుని చీటి చూస్తేనే
గుండెలు జారుతున్నాయ్
ఆసుపత్రుల తలిస్తేనే
ప్రాణాలు పోతున్నాయ్
అయినా…
‘‘పన్ను’’ల గన్ను పేల్చి
జనాల వేపుకు తినడం
ఏలికలకు రివాజయింది
‘‘జిఎస్టీ’ అస్త్రం సంధించి
జేబులను కుళ్లపొడవటం
నిత్య తంతుగా మారింది
ఈ ధరాఘాతాల బెడద
కడతేరిపోయేది ఎపుడో !
సామాన్యుల బతుకులు
స్వస్థతగా సాగేది ఎన్నడో !
( ఇటీవల మందుల ధరలు పెరిగిన సందర్భంగా..)
– కోడిగూటి తిరుపతి, 9573929493