Take a fresh look at your lifestyle.

మెడికల్‌ ఎమర్జెన్సీనా .. లాక్‌డౌనా..?

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కొరోనా పాజిటివ్‌ ‌కేసుల దృష్ట్యా దేశవ్యాప్తంగా మెడికల్‌ ఎమర్జెన్సీని ప్రకటిస్తారా లేక మరోసారి లాక్‌డౌన్‌ను కేంద్రం ప్రకటించనుందా అన్న చర్చ తీవ్రంగా జరుగుతున్నది. మొదటి వేవ్‌ ‌కొరోనా విజృంభిస్తునన్న దశలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ‌ప్రకటించి కేంద్ర ప్రభుత్వం సత్వర నిర్ణయం తీసుకోవడం ద్వారా వైరస్‌ ‌ప్రభలకుండా నిరోధించిందన్న ప్రశంసలను అందుకుంది. అయితే ప్రశంసలతో పాటు పలు విమర్శనలను కూడా మోదీ ప్రభుత్వం మోయాల్సి వొచ్చింది. ప్రజలకు ముందస్తుగా లాక్‌డౌన్‌పై అవగాహన లేకపోవడంతో అనేక మంది అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. ప్రధానంగా వలస కార్మికుల పరిస్థితి కడు దయనీయంగా మారింది. తినడానికి తిండి, ఉండటానికి గూడు లేక లక్షలాదిమంది అవస్థల పాలైనారు. కనీసం సొంత ఊర్లకు వెళ్ళాలంటే రవాణా వ్యవస్థంతా ఒక్కసారిగా స్థంబించిపోవడంతో వందలాది మైళ్ళు కాలినడకన ప్రయాణాలు సాగించి, కొందరు దారిలోనే మృత్యువాత పడ్డారు. ఇప్పుడు దేశంలో రెండవ విడతగా ప్రభలుతున్న కొరోనా ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరోధించలేకపోతున్నాయి. దేశంలో రోజుకు మూడున్నర లక్షలకు పైగా ప్రతీరోజు పాజిటివ్‌ ‌కేసులు నమోదవుతున్నాయి.

కొద్ది రోజుల్లోనే రోజుకు నాలుగు లక్షలమంది ఈ వైరస్‌ ‌బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయం టున్నారు. మేలో పరిస్థితి మరింత ధారుణంగా మారుతుందన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. అంతర్జాతీయ అధ్యయనాలుకూడా మేలో రోజుకు పదిలక్షల పాజిటివ్‌ ‌కేసులు వొచ్చే ప్రమాదమున్నట్లు చెబుతున్నాయి. కొరోనా ను కట్టడిచేసే విషయంలో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. ఈ విషయంలో న్యాయస్థానాలుకూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చివాట్లు పెట్టిన పాలకులు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించడంతప్ప మరో దారిలేదన్నది పాలకులు చెబుతున్న మాట. గత సంవత్సరం కొరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో దేశ ఆర్థిక పరిస్థితి కుదేలయింది. ప్రజలు ఆర్థికంగా కుంగిపోయారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. ఆర్థిక భారాన్ని తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే, మరికొందరు అప్పుల పాలైనారు. నేటికీ ఈ ఆర్థిక భారంనుండి బయట పడలేకపోతున్నారు. పిల్లవాళ్ళ స్కూల్‌ ‌ఫీజులకుకూడా బ్యాంకు రుణాలను తీసుకుంటున్నారు.

ఇలాంటి పరిస్థితిలో సినిమాహాళ్ళు, మాల్స్, ‌పాఠశాలలు, కళాశాలలు తెరిపించడంద్వారా కొంతైనా ఆర్థిక వెసులుబాటును కలిగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోచించాయి. కాని, ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ ప్రభుత్వాలు పెద్దగా దృష్టి పెట్టలేదు. సత్వర లాక్‌డౌన్‌ ‌విధించి దేశంలో కొరోనా మరణాలు ఎక్కువ జరుగకుండా కట్టడి చేయగలిగారుఅని ప్రధాని మోదీని మెచ్చుకున్న ప్రపంచదేశాలే ఇప్పుడు మోదీ నిర్లప్తతను తప్పు పడుతున్నాయి. కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌విషయంలో మోదీ పూర్తిగా నిర్లక్ష్యం వహించారంటున్నారు. వివిధ దేశాలు తమ ఆకాశ మార్గాలను భారత్‌కు రాకుండా కట్టడి చేశాయి.

మొదట్లో వివిధ దేశాలకు హైడ్రోక్లిన్‌ ‌క్లోరైడ్‌ను ఇచ్చి ఆదుకున్న భారత్‌ ‌కష్టకాలాన్ని చవిచూస్తుండడాన్ని గమనించి, భారత్‌ను ఆదుకోవడానికి ముందుకొస్తున్నాయి. శత్రు దేశాలైన చైనా, పాకిస్తాన్‌లుకూడా ఆపన్నహస్తాన్ని అందిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రజల అలసత్వం ఇప్పటికే వేలాది ప్రాణాలను హరించివేసింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పలు రాష్ట్రాల హైకోర్టులు సుమోటోగా కేసులను పరిశీలిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు అంక్షితలు వేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థిలో ప్రజల ప్రాణాలు ముఖ్యమా, ఆదాయం ముఖ్యమా అంటూ రాష్ట్ర ప్రభుత్వాలను చివాట్లు పెడుతున్నాయి. దేశాన్ని కుదిపివేస్తున్న కొరోనా మహమ్మారిపై చివరకు అత్యున్నత న్యాయస్థానం కూడా స్పందించకుండా ఉండలేకపోయింది. ఇంత మానవ హవనం జరుగుతుంటే చూస్తూ కూర్చోలేమన్న సుప్రీంకోర్టు సుమోటోగా దీనిపై విచారణ చేపట్టింది. దీనిపై జరుగుతున్న విచారణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పనితీరుపై సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసిందికూడా. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే సుప్రీం చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో ఇప్పుడు ఆందోళనగా మారాయి. కొరోనా కట్టడిలో జాతీయ విధానాన్ని అనుసరించాల్సిందిగా కేంద్రానికి సూచించిన సుప్రీం, ప్రస్తుతం మనం జాతీయ అత్యవసర పరిస్థితిలో ఉన్నామన్న విషయాన్ని గుర్తుచేసింది. దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నదో చెప్పాలంటూనే, ఆక్సీజన్‌, ‌మందులు, వ్యాక్సిన్‌, ‌ప్రైవేటు హాస్పిటల్స్ , ‌మందుల ధరలు ఏవిషయంలోనూ ప్రభుత్వ కట్టడిలేకపోవడాన్ని ఎత్తిచూపింది.

ఇది ఒక రకంగా ఆరోగ్య అత్యయిక పరిస్థితిని తలపిస్తున్నదంటూ చేసిన వ్యాఖ్యలతో దేశంలో మెడికల్‌ ఎమర్జెన్సీని ప్రకటిస్తారా అన్న ఆనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒక వేళ అదే నిజమైతే ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులేర్పడుతాయంటూన్నారు మేథావివర్గం. అన్ని అధికారాలు కేంద్రానికి కేంద్రీకరించబడుతాయని, కనీసం ఎదిరించి అడిగే స్వేచ్ఛకూడా ఉండదంటున్నారు. సోషల్‌మీడియా గా గొంతెత్తకుండా చేస్తారని, భావప్రకటనకు సంకెళ్ళు పడుతాయని, జాతీయ భద్రతాచట్టాన్ని ప్రయోగించే అవకాశాలుంటాయన్న భయాన్ని వ్యక్తంచేస్తున్నారు. అయితే లాక్‌డౌన్‌ ‌లాంటి నిర్ణయాలను రాష్ట్రాలకే వదిలేయాన్న సూచనమాత్రం హర్షనీయంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల ఆయా రాష్ట్రాలు అక్కడి పరిస్థితిని బట్టి సంపూర్ణ లాక్‌డౌనా, మినీ లాక్‌డౌన్‌ ‌విధించాలా అన్నది స్వయంగా నిర్ణయించుకునే అవకాశాలు దీనివల్ల ఏర్పడుతాయి.

ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నైట్‌ ‌కర్ఫ్యూలు విధిస్తుండగా, దిల్లీలాంటి రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ‌ప్రవేశపెట్టాయి. తాజాగా ఏపిలో ప్రభుత్వం ప్రకటించకున్నా తిరుపతిలాంటి నగరాల్లో ప్రజలే స్వీయ మినీ లాక్‌డౌన్‌ను ప్రకటించుకోవడం గమనార్హం. ఏదేమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఈ మహమ్మారికి ఎంతమంది బలైనా తమ రాజకీయలబ్ధినిమాత్రం వదులుకోరన్నది స్పష్టమవుతున్నది. ఎందుకంటే దేశంలో ఇటివల అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు, తెలంగాణ రాష్ట్రంలోకూడా రెండు కార్పోరేషన్‌, అయిదు మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు మార్చ్ 2‌నగాని వెలువడవు. ఆ తర్వాత గాని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. అప్పటివరకు ఇంతే సంగతులు.

Leave a Reply