Take a fresh look at your lifestyle.

జిల్లాకో మెడికల్‌ ‌కాలేజీ…!

  • కాలేజీల విషయంలో రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం
  • దేశవాప్య్తంగా మంజూరు చేసిన 171 కాలేజీల్లో రాష్ట్రానికి ఒక్కటీ ఇవ్వలేదు
  • కేంద్రం తీరుపై అసెంబ్లీ వేదికగా మండిపడ్డ హరీష్‌ ‌రావు
  • బస్తీ దవాఖానాలు పేదలకు గొప్పగా వైద్యసేవలు అందిస్తున్నాయని వెల్లడి

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 14 : మెడికల్‌ ‌కాలేజీల విషయంలో కేంద్రం తెలంగాణపై తీవ్ర వివక్ష చూపిందని కేంద్రంపై మంత్రి హరీష్‌ ‌రావు అసెంబ్లీ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ…దేశంవ్యాప్తంగా 171 మెడికల్‌ ‌కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఒక్కో కాలేజీకి 200 కోట్లు మంజూరు చేసిన కేంద్రం…తెలంగాణకు మొండి చేయి చూపిందని విమర్శించారు. వైద్యారోగ్య రంగాన్ని ఉమ్మడి పాలకులు నిర్లక్యం చేశారన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 3 మెడికల్‌ ‌కాలేజీలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్యను 33కి పెంచుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఉక్రెయిన్‌ ‌వెళ్లిన మన విద్యార్థుల బాధలు వర్ణనాతీతమన్నారు. గత పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపించారు. వైద్య విద్య కోసం భాష రాకపోయినా ఉక్రెయిన్‌, ‌చైనా తదితర దేశాలకు వెళ్లి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకొక మెడికల్‌ ‌కాలేజీ ఏర్పాటు చేస్తున్నందు వల్ల విద్యార్థులు ఇక్కడే వైద్య విద్యను చదువుకోవడం సాధ్యం కానున్నదని చెప్పుకొచ్చారు. 60 ఏళ్ళలో తెలంగాణలో 3 ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేస్తే.. 6 ఏళ్ళలో 33 మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు.

ఇప్పటి వరకు ఉన్న 700 ఎంబీబీఎస్‌ ‌సీట్ల సంఖ్యను.. వొచ్చే విద్యా సంవత్సరానికి ఈ సంఖ్య 2,850కి పెంచుకోవడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా యూజీ సీట్లు 1640కి, పీజీ సీట్లు 934కు పెంచడం జరిగిందన్నారు. ఈ మేరకు శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇస్తూ.. కేంద్రం తెలంగాణపై నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా 171 ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీలు మంజూరు చేస్తే.. తెలంగాణకు ఒక్క కాలేజీ ఇవ్వకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. నిమ్స్‌లో ప్రస్తుతం 1400 పడకలు ఉన్నాయని, మరో 2 వేల పడకలు అదనంగా ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మెడికల్‌ ‌కాలేజీలలో డెడ్‌ ‌బాడీల కొరత ఉందని, చట్ట సవరణ చేసి డెడ్‌ ‌బాడీలను మెడికల్‌ ‌కాలేజీలకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 33 మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామని, కొత్తగా ఏర్పాటు చేసిన 8 మెడికల్‌ ‌కాలేజీలలో ఈ సంవత్సరమే క్లాసులు ప్రారంభిస్తామని వెల్లడించారు. పట్టణాల్లోని పేదల సుస్తీని పోగొడుతూ.. బస్తీ దవాఖానాలు గొప్పగా సేవలు అందిస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనతో దేశంలో మొదటి సారి ఏర్పాటు చేసిన ఈ బస్తీ దవాఖానపై 15వ ఆర్థిక సంఘం ప్రశంసలు కురిపించిందని పేర్కొన్నారు. 350 ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ప్రస్తుతం 259 సేవలు అందిస్తున్నాయని…త్వరలో మిగతా చోట్ల అందుబాటులోకి వొస్తాయని వెల్లడించారు. బస్తీ దవాఖానల నుండి టెలి మెడిసిన్‌ ‌సేవలు కూడా అందిస్తున్నామన్నారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ‌వైద్యులు ఈ విధానం ద్వారా అవసరమైన సేవలు అందిస్తున్నారని హరీష్‌రావు తెలిపారు. ఉచితంగా 57 రకాల పరీక్షలు, ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడం వల్ల పట్టణ పేదలకు ఎంతో ఉపయోగం ఉందన్నారు. అన్ని పట్టణాల్లో 60 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి హరీష్‌రావు ప్రకటించారు.

Leave a Reply