Take a fresh look at your lifestyle.

వృత్తి ధర్మమే వారికి ఊపిరి..

మూలిగే నక్క మీద తాటి పండు పడ్డ చందంగా జర్నలిస్టుల బతుకులు ..కొరోనా కు ముందు …అంతంత మాత్రంగా గడిచిన జీవితాలు ఇప్పుడు లైన్ల లో నిలబడి నిత్యావసరాలు దాతల నుండి తీసుకోవలసిన దుస్థితి ..!..ఉద్యోగాలు ఊడుతున్నాయి …పెద్ద పత్రికల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు ..రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ మీడియా సంస్థలదే హవా ..కొట్టుమిట్టాడుతున్న చిన్న, మధ్యతరహా పత్రికా విలేఖరులు…!”

కొరోనా కారణంగా క్షేత్ర స్థాయిలో పని చేసే జర్నలిస్టుల జీవితాలు ఛిద్రమయ్యాయి. వైట్ కాలర్ జాబ్ అని మురిసిపోవడం తప్ప జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితి మామూలు రోజుల్లోనే అంతంత మాత్రంగా ఉంటుంది. పెద్ద పేపర్లు, న్యూస్ చానల్స్ లలో నూ, అధికార పార్టీ మీడియా సంస్థల్లోనూ పని చేసే జర్నలిస్టులకు ఏ లోటూ ఉండదు. చిన్న, మద్యతరహా పత్రికలు, చానల్స్ లలో పని చేసే వారి పరిస్థితి మామూలు రోజుల్లోనే ఆర్థిక పరంగా కటకట లాడుతూ ఉంటుంది. కొరోనా కారణంగా కొన్ని పత్రికలూ, చానల్స్ మూత పడ్డాయి. మరి కొన్ని ప్రతిష్ఠ కోసం, సెంటిమెంట్ కోసం నడపబడుతున్నప్పటికీ సిబ్బందికి జీతాలు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి. అయితే, వృత్తితో ఎంతో కాలంగా బంధం పెనవేసుకుని పోవడం వల్ల జర్నలిస్టులు ఉన్న ఉద్యోగాలను వదులు కోలేక జీవనం సాగిస్తున్నారు.

కొరోనా కాటుకు ఒక్క హైదరాబాద్ లోనే మరణించిన జర్నలిస్టుల సంఖ్య లెక్కకు మిక్కిలిగా ఉంది. రాజకీయ నాయకులు సంతాపాలు తెలపడం తప్ప వార్తా సేకరణ రంగంలో ఉన్న వారి భద్రత కోసం చేసిందేమీ లేదు. సంతాప ప్రకటనలు జారీ చేయడానికి మాత్రం పోటీ పడుతుంటారు. లాక్ డౌన్ కాలంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొన్నప్పటికీ, జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి వార్తలు సేకరించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో నిజం నిష్టూరమన్న సామెత జర్నలిస్టులకు వర్తిస్తుంది. వార్త నిప్పు లాంటిది. దానిని ఎంత కాలం కప్పిపుచ్చలేమన్న మౌలిక సూత్రం ఉగ్గుపాలతో ఒంట పట్టించుకున్న జర్నలిస్టులు ఎటువంటి బెదిరింపులకూ, ఒత్తిళ్లకూ లొంగకుండా తాము సేకరించిన వార్తలను తమ సంస్థలకు పంపుతూ ఉంటారు. కొరోనా కేసుల విషయంలో జర్నలిస్టులు చాలా నిష్పక్షపాతంగా వార్తలు సేకరించి సమాజానికి వాస్తవాలను అందిస్తున్నారు. ఈ క్రమంలో వారు అధికార పార్టీ నాయకుల ఆగ్రహానికి గురి అవుతున్నారు. సమాజంలో వివిధ వర్గాలకు రక్షణ ఉంది. జర్నలిస్టులకు లేదు. ఎవరికి కోపం వచ్చినా ఉరుముఉరిమి మంగలం మీద పడినట్టు జర్నలిస్టులపై పడుతూ ఉంటారు. అయితే, పరిస్థితులు గతంలో కన్నా మారిన మాట మాత్రం నిజం. వార్తను వార్తగా రాయాలనే నిబద్దత గల జర్నలిస్టులు ఇప్పటికీ ఎంతో మంది ఉన్నారు. అయితే, పార్టీల వారీగా పత్రికల , చానల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకుని రావడం వల్ల వార్తా ప్రమాణాలపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. పార్టీల వారీగా సమీకరణ అయిన మీడీయా సంస్థల్లో పని చేసే వారికి యాజమాన్యాల నుంచి ఆర్థికంగా మంచి సహకారం లభిస్తోంది. అలాంటి వారి సంఖ్య చాలా తక్కువ. గత జూన్ లో కొరోనా చికిత్స కోసం హైదరాబాద్ లోని ప్రభుత్వ దవాఖానాలో చేరిన ఒక జర్నలిస్టు దయనీయ గాధ వింటే క్షేత్ర స్థాయిలో పని చేసే జర్నలిస్టుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతుంది. ఆ దవాఖానాలో లో కొరోనా చికిత్సకు సరైన సౌకర్యాలు లేవనీ, కిట్లు లేవనీ, కనీసం రోగిని పలుకరించేవారు కూడా లేడని అతడు అన్న చివరి మాటలను ఉటంకిస్తూ అతడి సోదరుడు చెప్పిన విషయాలను వింటే హృదయం ద్రవించి పోయింది.ఇది ఒక ఉదాహరణ మాత్రమే, ఇలాంటి ఘటనలు ఎన్నో.

మహానగరంలో పని చేసే జర్నలిస్టుల పరిస్థితే ఇలా ఉంటే గ్రామాల్లో, మండల కేంద్రాల్లో పని చేసే జర్నలిస్టుల పరిస్థితి ఇంకా హృదయ విదారకంగా ఉంది. సంబంధిత మంత్రి, అధికారులు జర్నలిస్టులు తమకు అందిన సమాచారాన్ని సరిచూసుకుని తమ మీడియా సంస్థలకు పంపాలని హితబోధ చేస్తుంటారు. సరిచూసుకోవడానికి ఏ స్థాయిలోనూ జవాబుదారీ వ్యక్తులు ఉండరు. వార్త సేకరించడానికే నానా కష్టాలు పడాల్సిన పరిస్థితులలో జర్నలిస్టులు సంబంధిత అధికారులు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం మొదలు పెడితే తెల్లారి పోతుంది. అయినా ప్రచార, ప్రసార మాధ్యమాల పోటీ పెరిగి పోయిన ప్రస్తుత పరిస్థితులలో వార్తను సరి చూసుకోవడం అనేది జర్నలిస్టులకు పెను సవాల్ గా తయారైంది. ప్రైవేటు , కార్పొరేట్ హాస్పిటల్స్ లో జబ్బుకు గురయిన వారి నుంచి భారీ ఎత్తున వసూలు చేస్తున్న ఫీజుల గురించి మొదట్లో సమాచారం అందించిన పత్రికలు, మీడియా సంస్థలపై గుర్రు పెంచుకున్న ఆ సంస్థల యాజమాన్యాలు ఇప్పుడు ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగేసరికి మారు మాట్లాడలేకపోతున్నాయి. నిజానికి కార్పొరేట్, ప్రైవేటు హాస్పిటల్స్ లో కొరోనా పరీక్షలకూ, చికిత్సలకూ భారీ ఎత్తున ఫీజులు వసూలు చేసిన సంస్థల్లోనే ఇప్పటికీ అదే ప్రకారం భారీ ఎత్తున వసూళ్ళ దందాలు సాగుతున్నాయి. వీటి గురించి మొదటగా బాహ్య ప్రపంచానికి తెలియజేసింది అధికార పార్టీ అనుబంధ మీడియా సంస్థల విలేఖరులు కాదు,. అతి సామాన్య, మధ్యతరగతి మీడియా ప్రతినిధులే. ముందుగా చొరవ తీసుకున్నది వారే. ఈ క్రమంలో కొందరికి బెదరింపులు కూడా వొచ్చాయి. ఇప్పటికీ వొస్తున్నాయి. అయితే, వృత్తి ధర్మానికి అంకితమైన జర్నలిస్టులు ఎవరి ఒత్తిళ్ళకూ, బెదరింపులకూ లొంగకుండా తమ బాధ్యతలను నెరవేరుస్తున్నారు. కొరోనా కాలంలో ఈ తరహా జర్నలిస్టుల కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సర్కార్ దవాఖానాలల్లో లోటు పాట్లనూ, బలహీనతలను కొరోనా బయటపెట్టింది. దవాఖానాలల్లో పరిస్థితుల గురించి పుంఖానుపుంఖాలుగా కథనాలను తవ్వి తీసి బాహ్య ప్రపంచానికి తెలియజేసింది చిన్న, మధ్య తరహా మీడియా సంస్థల ప్రతినిధులే. ప్రభుత్వం నుంచి ఎటువంటి మెప్పునూ, ప్రతిఫలాన్నీ ఆశించకుండా మీడియా సంస్థలను ఒక సంప్రదాయంగా నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రజల అండదండలే దన్ను. అందుకే , ప్రభుత్వ నుంచి సరైన సహకారం అందినా,అందకపోయినా, ప్రజలతో తమకు ఉన్న చిరకాల బంధాన్ని కాపాడుకునేందుకు చిన్న, మధ్యతరగతి మీడియా సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయి. వాటి దోవలోనే ఆయా సంస్థల సిబ్బంది వార్తా సేకరణలో నిష్పక్ష వైఖరిని ప్రదర్శిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. మీడియా సంస్థల్లో సిబ్బంది కొరోనా కాలంలో పడుతున్న కష్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించినట్టు లేదు. కనీసం ప్రాణాలు కోల్పోయిన వారికి కూడా ప్రభుత్వం నుంచి సరైన సహకారం, పరిహారం అందలేదు. ఇది అధికార పార్టీల వారూ, ప్రభుత్వాలు సిగ్గు పడాల్సిన విషయం. అధికార పార్టీ ప్రాపకంలో నిర్వహించే మీడియా సంస్థలలో జర్నలిస్టులు, మిడియా ఫోటో గ్రాఫర్లు ప్రభుత్వ అధికారులు అందించే సమాచారాన్ని మాత్రమే ప్రజలకు తెలియజేస్తున్నాయి. రెండో వెర్షన్ ప్రజలకు తెలియజేయడం లేదు. రెండో వెర్షన్ ను తెలియజేస్తున్నది చిన్న, మధ్యతరగతి మీడియా సంస్థల్లో పని చేస్తున్న జర్నలిస్టులే. ఇప్పుడే కాదు ఏ సంక్షోభం ఎదురైనా ప్రాణాలకు తెగించి వార్తా సేకరణ జరిపి సమాజానికి వాస్తవాలను తెలియజేస్తున్నది వృత్తి ధర్మాన్ని నరనరాన జీర్ణించుకున్న జర్నలిస్టులే. ఎవరి గుర్తింపు కోసమో, మెహర్బానీ కోసమో కాకుండా తమ ఆత్మసంతృప్తి కోసం పని చేస్తున్న జర్నలిస్టులు ఇంకా ఉన్నారు. వారి వల్లనే సమాజానికి వాస్తవాలు తెలుస్తున్నాయి.

Leave a Reply