భక్త జన సందోహంతో …
వెదురు వనం వెల్లివిరిసేను
వనదేవతల కొలువుతో…
మేడారం మురిసి మెరిసేను
తలనీలాలు స్నానాలతో…
జంపన్న వాగు వెల్లువెత్తేను
జమిడిక డప్పు మోతతో…
చిలుకల గుట్ట చిందులేసేను
బంగారు బెల్లం రాశులతో…
గద్దెల ఎదలు పరవశించేను
శివసత్తుల పూనకాలతో..
తీర్థ పరిసరం ధ్వనించేను
జోడెడ్ల బండ్ల సవ్వళ్లతో…
కొండా కోనలు హోరెత్తేను
కోయల డోలిరాగాలతో…
తరువులు నాట్యమాడేను
ఒడిబియ్యం చీరె సారెలు
ఎదురుకోళ్ల మొక్కులతో
ఆధ్యాత్మికం అరివిరిసేను
మేడారం మహా జాతర
గిరిజన పోరాటాల వేదిక
అదీవాసీల త్యాగాల పీఠిక
వనదేవతల పరాక్రమ ప్రతీక
తెలంగాణ ఆత్మగౌరవ పతాక
తెలంగాణ కుంభమేళా
శ్రమ జీవుల సంబుర కేలా
అడవి బిడ్డల ఆనంద హేలా
సబ్బండ వర్గాల వికాస లోలా
మేడారం మహా జాతరకు
సకుటుంబంగా తరలుదాం
భక్తితో మొక్కులు చెల్లించి
తల్లుల దీవెనలందుకుందాం
( ఫిబ్రవరి 16న ఆరంభమయ్యే మేడారం జాతర సందర్భంగా ..)
కోడిగూటి తిరుపతి, 9573929493