Take a fresh look at your lifestyle.

‘‘ ఎవలి కోసం?

‘‘ఒకప్పటి అడవిబిడ్డల పండుగ గిప్పుడందరి పండుగైంది. యేండ్ల సంది గిరిజనుల నమ్మకం, విశ్వాసాల మీద జరిగే పండుగల గిరిజనేతరుల పెత్తనమేందిర బయ్‌! అనడిగెటోళ్ళెవరు లేరు. ఎప్పుడైతె దందా జేషెటోళ్ళకు జాతర పెట్టుబడైందో గని గిరిజనుల విశ్వాసంల విలువలు పలుసనయినయి. కూడేటి జనంకాడ దోసుడే లెక్కని ఎవలి దోపిడివాళ్ళకు యాపారమైంది. మేమేం సూసుకుంటువుంటమా అని సర్కారుకు మస్త్ ఆమ్దాని తెచ్చే దందా అయింది. ఏండ్ల సందున్న గిరిజన జాతరా విలువలు మంట్లెవెట్టి, సంప్రదాయాల సాటున కోట్ల రూపాలదందా జరుగబట్టె. అధికారంలున్న పార్టీలున్న లీడర్లందరు ఏమనుకుంటె గదే ఖానూనైతాంది.‘‘

medaaram jathara latest updates

అడవిమాది, అడవిలున్న చెట్టూ పుట్ట, వాగూ వంకలన్ని మాయే! అడవి మీద పెత్తనం అడవి బిడ్డలదేనని, అడవి మీది కచ్చినోళ్ళతోని కొట్లాడి జీవిడిషిన సమ్మక్క తల్లీ! నీకు ముందుగాల శనార్తులు. సారాలమ్మా! జంపన్నా! మీకు సూత శనార్తులు. అడవి మీద, అడవిలున్న సంపద మీద అడవి బిడ్డలదే అధికారమన్న ఇగురం మరిషి అడవిని ఆగం జేషినోళ్ళపైకి కత్తి తిప్పిన మీ పౌరుషం యేటేటా యాదికి జేసుకుంటానం తల్లీ! కాకపోతె చరిత్రను కాట్లె బెట్టి కతలల్లుట్ల మనోళ్ళను మించిన తోపుల్లేరు. ఒకప్పటి అడవిబిడ్డల పండుగ గిప్పుడందరి పండుగైంది. యేండ్ల సంది గిరిజనుల నమ్మకం, విశ్వాసాల మీద జరిగే పండుగల గిరిజనేతరుల పెత్తనమేందిర బయ్‌! అనడిగెటోళ్ళెవరు లేరు. ఎప్పుడైతె దందా జేషెటోళ్ళకు జాతర పెట్టుబడైందో గని గిరిజనుల విశ్వాసంల విలువలు పలుసనయినయి. కూడేటి జనంకాడ దోసుడే లెక్కని ఎవలి దోపిడివాళ్ళకు యాపారమైంది. మేమేం సూసుకుంటువుంటమా అని సర్కారుకు మస్త్ ఆమ్దాని తెచ్చే దందా అయింది. ఏండ్ల సందున్న గిరిజన జాతరా విలువలు మంట్లెవెట్టి, సంప్రదాయాల సాటున కోట్ల రూపాలదందా జరుగబట్టె. అధికారంలున్న పార్టీలున్న లీడర్లందరు ఏమనుకుంటె గదే ఖానూనైతాంది. ‘ఇనడు’, ‘గినడు’! అడ్డత్తడనుకుంటె ఆ కుర్చీలున్న ఆధికార్లకు రాత్రికి రాత్రే తబాదలైతది. కోట్లమంది మొక్కే అమ్మల జాతరంటరు, కోట్ల రూపాల ఆమ్దాని వత్తాంటె సూత సౌలతుల సంగతి జరంత జూడలెగదా! సమ్మక్క ఎవలు? ఎవలి మీదికి మర్లవడ్డది? ఎందుకు మర్లవడ్డది! జంపన్న ఏమైండు? సారాలవ్వ ఎటువాయె! గీ కతలన్ని తెలిషినయేనాయే! మునుపటి అడవి బిడ్డల జాతరా ఇయాల్రేపు అందరి జాతరైంది? ఎట్లయింది! సమ్మక్క సారాలవ్వల జాతరపైన జనానికున్న విశ్వాసముళ్ళా! అనంటం అయ్యా! గీ సోంటి కతలుబడే విశ్వాసమె దోసుకున్నోళెటోళ్ళకు దందాగ మారింది. భక్తుల నమ్మికనే పునాది జేసుకొని అడ్డగోలు దోపిడికి నికార్సైన అడ్డా అయింది.

ఏటా వచ్చే కోట్ల ఆమ్దానీ తోని శాశ్వత సౌలతుల జేయించాలన్న సోయి సర్కారుకు లేకపాయె! ‘‘దూపయినప్పుడే షెరువు తవ్వుడన్నట్టు’’ ఎప్పటికప్పుడే తూతూ మంత్రం కతలు పడుడేగని ముందుసూపు కరువాయె! కోట్ల మంది హాజరయ్యే జాతరల సౌలతుల కోసం జేషే పనులు కాంట్రాక్టర్ల దయతోని ఇంక కాకుంటనే బోయినయి. గిరిజనుల సాంప్రదాయ ఇప్పసార కాన్రాకంట జేషి జాతర్ల చీప్‌ ‌లిక్కర్‌ ‌నిబ్బుల సరుకు దిగుతది. మొక్కుల సంగతేందో గని జాతరంటె తాగుడు తినుడే అన్నట్లయితాంది. ఈ సాకు తోనే బార్డరవుతలికేలి, ఇవుతలికేలి లారీలల్ల సరుకు మోపయితది. డుబ్లికేట్‌ ‌సరుకును నాలిగింతలు పిరంజేషి అమ్మకాలు జోరయితయి. అడవిల జాగను గజాల లెక్కన లీజులకిచ్చే దందాల అంత గులాల్‌ ‌రంగోళ్ళదే పెత్తనం నడువబట్టె! దారిపొడుగూత దుకాండ్లలొల్లి వచ్చే పోయెటోళ్ళకు కాలుమలిగెటట్టుండదు. పస్రా కాన్నుంచి మేడారం దాంక వుషికె పోత్తె రాలకుంట రాకపోకలుంటయి. దుకాండ్ల బెట్టుడు కాడ జరంత లెక్కావాత లేకుంట వుంటయి. చాయి, పలారం,నుంచి అన్ని పిరముండుడే గాక నాణ్యత సంగతెవలు పట్టించుకుంటలేరు. జాతర షురు కాకముందే లక్షలల్ల మంది భక్తులు చీమలోలిగె రాబట్టె. ఇప్పటికే జమయిన చెత్త కోసం పారిశుధ్యం పనులు వశపడు తలేవు. అమ్మలు గద్దెకచ్చేనాటికి పారిశుధ్యం పనులుయెటమటమయితె అంటురోగాలు ఆగం జేసుడయితది.

మేడారంల జాతర పనులకు రొండు సర్కార్లిచ్చే నిధులు ఏ టెండర్‌ ‌పనులకన్న జాడ ఎరుకుండదు. ఎటు బోతానయో తెల్వదాయె! యేటా గదే తిప్పలు. ఒకటికి తిప్పలేముండదిగని రొండుకైతె యమయాతనుంటది. అడవి తొవలన్నిమనయే తీ! అనుకుంటె రోగాలంటుకుంటయి. గిరిజనులు వాళ్ళ సాంప్రదాయాలనుసారంగ జేసుకునే పండుగల గిరిజనేతరులు కల్సుడంటె భక్తి అనుకుంటానం గని గీ భక్తి సంగతెనుక భక్తుల నిల్వుదోపిడేందని ఎవలడుగరాయె! సుట్టుపక్కలున్న పదిగల్ల రాష్ట్రాల నుంచి వచ్చే కోట్ల మంది మొక్కులు ఇచ్చుడైతానంక వాళ్ళ ఆరోగ్యం, వసతి, రక్షిత తాగే నీళ్ళు దొరికెటట్టు జూడాలె కదా! ఆర్టీసీ రవాణా సాలినన్ని బస్‌లు మాగనే బెట్టింది గని కిలో మీటర్ల పొడుగూత ఆగిపొయిన బండ్లు, కార్లు, గంటల కొద్ది జేషే తిప్పలు ఆగం జేసుడైతది. బంగారం(బెల్లం) అమ్మకాలు, కోళ్ళు, హోటళ్ళు, మందు గివీటి కాడ నాణ్యత కరువై అనారోగ్యం జాతర నుంచి మనెంబడే ఇంటికస్తది. ప్లాస్టిక్‌ ‌భూతం జాతరలల్ల లేకుంట జేత్తమని యేటా జెప్తనే వున్నరు, ఆఖరికి జాతరైనంక లారీలల్ల మిగిలే చెత్తంత ప్లాస్టిక్‌ ‌కవర్లే నాయె! అధికార యంత్రాంగం ఎవలి పని వాళ్ళు బరాబరి గనుక జేత్తె కాలుష్యం తిప్పలు, కల్తీ తిప్పలు ఏట్లత్తయి! కాంట్రాక్టర్లందరు అధికార పార్టీ సుట్టాలే కాబట్టి ‘‘చల్తీకా నామ్‌ ‌గాడీ’’ లెక్కన సూసుకుంట బోవుడే! పచ్చనాకుల అడవి జాతరైనంక కాలుష్యం బారిన పడి బాగుపడేందుకు ఆరేడు నెలలలు దాటుతది. అడవిల బతికే మూగ జీవాల గోస ఎవలు జూడరు. తల్లులు గద్దెకచ్చే రోజు భక్తుల తొక్కిసలాట కాడ కాపలుండే పోలీసులు అధికారుల, ప్రజా ప్రతినిధుల సేవలుండకుంటె సాలు. జాతరల్ని యాపారంగా మార్చుడంటె జనాలను దోపిడి జేసుడేనాయె ! జిల్లాల ఇంక నాలుగైదు దిక్కుల సమ్మక్క జాతర్లున్నయి. మేడారంల పుట్టి చిలకల గుట్టల జీవిడిషిన సమ్మక్క తల్లికి మేడారం బయట జాతర్లెట్ల ఐతయో యేందోగని భక్తుల అవసరాలే యాపారాలకు పాణం కాబట్టి జాతర్లు యేడ నైనా బెట్టచ్చని తెలుత్తాండె! సూడ్రా బయ్‌! ఇ‌క్రమార్క్ ‘‘ఇప్పటిదాంక ఇంటివి కదా’ అడవి మీద అన్ని హక్కులు గిరిజనులయే కదా! మరి వాళ్ళ పండుగల మీద గిరిజనేతరుల పెత్తనమేంది!? జాతర పేరుమీద కోట్ల రూపాల దోపిడి చేసే దళారులు భక్తుల విశ్వాసాలతోని దందా జేత్తాంటె సర్కార్‌ ‌బాధ్యతేం లేదా!? రొండేళ్ళకోపాలి జరుగుతానప్పుడు శాశ్వత సౌలతులు జేయని సర్కారును తప్ప బట్టాలని జనం ముందుకు ఎందుకత్తలేరు!? గీ ప్రశ్నలకు జవాబులు చెప్పకుంటె యెప్పటిలాగ చెట్టెకుత మరి!’’అని భేతాళ్‌ ‌బెదిరింపులు ఇన్న ఇక్రమార్కుడు భేతాళుని శవాన్ని భుజమ్మీదేసుకోని ‘‘భేతాళ్‌! ఇను రచన, దర్శకత్వం, పాటలు, మాటలు, సంగీతం, ఎం. టి. రామారావు, బి.ఏ. అని పాతకాలంల సినిమా పోస్టర్ల మీద ఏషేది, గట్నే ఇప్పుడు జాతర్లైనా, టెండర్లైనా, చీప్‌ ‌లిక్కర్‌ ‌దందా లైనా, అధికారి తబాదలా ఎనుకైనా అంత వున్నదొక్కలే! ఎం.టి. రామారావు. బి.ఏ. లెక్క గులాబీలే వున్నంక నువ్వడిగేది ప్రశ్నెట్లయితది!’’ అని మనుసులనుకుంట ఆలోచించుకుంట ఎప్పటి లాగనే…నడ్వబట్టిండు…నడ్వబట్టిండు.

Tags: medaaram jathara latest updates, liquire shops, telangana sarkar, sudrabhai

Leave a Reply