ఒడిశా రాష్ట్రంతో చర్చలు
కేంద్ర నిధులు త్వరగా వొచ్చేలా చూడాలి
సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షలో సిఎం వైఎస్ జగన్
అమరావతి, అక్టోబర్ 01 : నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఒడిశా రాష్ట్రంతో చర్చల కోసం చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. తోటపల్లి బ్యారేజీ కింద వొచ్చే ఖరీఫ్ నాటికి నీటిని అందిస్తామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ పనులు వేగవంతం చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. వంశధార స్టేజ్-2 పనులు వొచ్చే మే నాటికి పూర్తి చేస్తామని అధికారులు సిఎంకు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల ప్రగతిని సీఎం జగన్‌కు వివరించారు.
ప్రాజెక్ట్‌కు సంబంధించిన దిగువ కాపర్ డ్యాం పనులు, కెనాల్స్‌కు కనెక్టివిటీ అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. గ్యాప్ 3 కాంక్రీట్ డ్యామ్ పనులు పూర్తి చేశామని, వొచ్చే ఖరీఫ్ నాటికి కాల్వల ద్వారా నీరందించేందకు సిద్ధంగా ఉన్నామని, ఈసీఆర్‌ఎఫ్ పనుల ప్రారంభానికి ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఆర్ అండ్ ఆర్ పనులపై కూడా సీఎం జగన్ సమీక్షిస్తూ కేంద్రం నుంచి రాష్ట్రానికి 2,033 కోట్ల రూపాయలకు పైగా నిధులు రావాల్సి ఉందని అధికారులు సీఎం జగన్‌కి తెలిపారు. ఈ క్రమంలో కేంద్ర నిధులు త్వరగా వొచ్చేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తి చేశామని.. నవంబర్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధమని, అవుకు టన్నెల్ నిర్మాణంలో గణనీయ ప్రగతి సాధించామని..వొచ్చే ఆగస్టు నాటికి టన్నెల్ పూర్తి చేసి నీటిని ఇస్తామని అధికారులు తెలిపారు. మహేంద్రతనయ ప్రాజెక్ట్ నిర్మాణంపై దృష్టి పెట్టాల్సిందిగా సీఎం జగన్ ఆదేశించారు. కొల్లేరు వద్ద గోదావరి, కృష్ణా డెల్టాల్లో రెగ్యులేటర్ నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. తాండవ ప్రాజెక్ట్ విస్తరణ, కృష్ణా నదిపై బ్యారేజీల నిర్మాణంపై దృష్టి పెట్టాలని కోరారు. తాండవ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఇప్పటికే టెండర్లు పిలిచామని అధికారులు సీఎం జగన్‌కి తెలిపారు. తొలివిడత టెండర్ల ప్రక్రియలో అధికంగా కోట్ చేసిన పనులపై మరోసారి రివర్స్ టెండరింగ్‌కు వెళ్లామని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నూతన సీఎస్ సమీర్ శర్మ, ఇరిగేషన్ సెక్రెటరీ శ్యామలరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.