Take a fresh look at your lifestyle.

పౌర భద్రతకు చర్యలు

  • 2500 కళాశాలల్లో సేఫ్టీ క్లబ్‌లు
  • మహిళా దినోత్పవ కార్యక్రమంలో
  • ప్రారంభించిన డిజిపి మహేందర్‌ ‌రెడ్డి

రాష్ట్రంలో నేరంచేస్తే వెంటనే శిక్ష పడుతుందనే భావనను సృష్టించడంలో తెలంగాణా పోలీస్‌ ‌శాఖ సఫలీకృతమైందని డీజీపీ ఎం.మహేందర్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్‌ ‌శాఖలోని మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో సేఫ్టీ క్లబ్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముషీరాబాద్‌ ఆర్టీసీ కల్యాణ మండపంలో డీఐజీ సుమతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనంతరం నిందితులకు శిక్షలు పడే సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. ప్రధానంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన మూడు ప్రధాన కేసులకు సంబంధించి న్యాయస్థానాల ద్వారా శిక్ష కూడా ఖరారైన విషయాన్ని గుర్తు చేశారు.

రాష్ట్రంలో కన్విక్షన్‌ ‌రేట్‌ 300 ‌నుండి 400 శాతం వరకు ఉందని వెల్లడించారు. ఒక్క హైదరాబాద్‌ ‌నగరంలోనే ఆరు లక్షల సీసీటీవీ కెమెరాలున్నాయని, ఏ నేరం జరిగినా ఈ సీసీటీవీల ద్వారా నిందితులను వెంటనే పట్టుకుంటున్నామని మహేందర్‌ ‌రెడ్డి తెలిపారు. పౌర భద్రత రాష్ట్ర ప్రభుత్వం కీలక ఎజెండాల్లో ప్రధానమైందని తెలుపుతూ అన్ని ప్రభుత్వ విభాగాలలో సమన్వయం ద్వారా పౌర భద్రతకు పోలీస్‌ ‌శాఖ పలు చర్యలు చేపడుతోందని వెల్లడించారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని దాదాపు 2500 డిగ్రీ కళాశాలల్లో విమెన్‌ ‌సెఫ్టీ క్లబ్‌ల ఏర్పాటుకు శ్రీకారంచుట్టామని అన్నారు. పోలీసింగ్‌ అనేది కేవలం పోలీసులతోనే సాధ్యం కాదని, ఈ విషయంలో పలు ప్రభుత్వ శాఖలు, స్వచ్చంద సంస్థలు, ప్రయివేటు సంస్థలను భాగస్వామ్యం చేస్తున్నామని వివరించారు.

ఇప్పటికే మహిళల భద్రతకు ఏర్పాటు చేసిన షీ-టీమ్‌ ‌ల పనితీరును ప్రజలు ప్రశంసిస్తున్నారని డీజీపీ పేర్కొన్నారు. మహిళలను, అమ్మాయిలను వేదించే పోకిరీలను తగు ఆధారాలతో షీ-టీమ్‌లు పట్టుకుంటున్నాయని అన్నారు. ఉన్నత విద్యా శాఖ కమిషనర్‌ ‌నవీన్‌ ‌మిట్టల్‌ ‌మాట్లాడుతూ లింగ వివక్షతకు వ్యతిరేకంగా పాఠ్యఅంశాలను కళాశాల స్థాయిలో ప్రవేశపెట్టిన ఘనత దేశంలోనే తెలంగాణా రాష్ట్రం మొదటిది తెలియచేసారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులు సభ్యులుగా సేఫ్టీ క్లబ్‌ ‌లను ఏర్పాటు చేయాలన్న పోలీస్‌ ‌శాఖ నిర్ణయం, దీర్ఘ కాలంలో సమాజంలో గొప్ప మార్పుకు అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజల ఆలోచనా దృక్పధంలో మార్పు వచ్చినప్పుడే సామాజిక మార్పు సాధ్యమని నవీన్‌ ‌మిట్టల్‌ అన్నారు.దీనికి ఈ సేఫ్టీక్లబ్‌లు దోహద పడతాయని అన్నారు.

మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతి లక్రా మాట్లాడుతూ రాష్ట్రం లోని 2500 కళాశాలల్లో సేఫ్టీ క్లబ్‌ ‌లను ప్రారంభించి వీటిలో లక్ష మందిని సభ్యులుగా చేర్పించి వీరి సేవలను మహిళలు, పిల్లలు, పౌర భద్రతకై స్వచ్ఛందంగా ఉపయోగించనున్నట్టు తెలియ చేశారు. రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతకై ఏర్పాటు చేసిన షీ-టీమ్‌ ‌లు, ఎన్‌.ఆర్‌.ఐ ‌సెల్‌, ‌భరోసా కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రం లోని మరో పది జిల్లాల్లో కొత్తగా పది భరోసా కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించిందని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ వాలంటరిసమ్‌ ‌పై అవగాహన, చతన్యంపై చొటా భీమ్‌తో రూపొందించిన యానిమేషన్‌ ‌వీడియో చిత్రాలను డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి, ఉన్నత విద్యా శాఖ కమిషనర్‌ ‌నవీన్‌ ‌మిట్టల్‌, ఐజీ స్వాతి లాక్రాలు విడుదల చేశారు.

సేఫ్టీక్లబ్‌లపై ఏర్పాటు చేసిన ఫేస్‌ ‌బుక్‌, ‌ట్విట్టర్‌, ఇన్‌స్టా గ్రామ్‌లను వీరు ప్రారంభించారు. వివిధ సామాజికాంశాలపై కళాశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సేవ్‌ ‌ది చిల్డ్రన్‌, ‌యంగిస్థాన్‌, ‌లీడ్‌ ‌లైఫ్‌ ‌ఫౌండేషన్‌, ‌సిరి మువ్వ తదితర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రముఖ గాయకుడు సాయి చంద్‌ ‌మహిళా సాధికారతపై పాడిన పాట విశేషంగా అకట్టుకుంది.

Leave a Reply