Take a fresh look at your lifestyle.

జెండా ఎగరేస్తాం.. మేయర్‌ ‌కుర్చీ గెలిచేస్తాం.. గెలుపుపై అన్ని పార్టీల ధీమా..!

Mayor's chair wins,Insurance parties, victory 
బోడుప్పల్‌, ‌పీర్జాదిగూడ నగరపాలికల పీఠాల కైవసానికి అన్ని పార్టీల యత్నాలు
వేడెక్కిన రాజకీయ వాతావరణం..

రాజధాని మహానగర శివారులోని  జంట నగరాలైనా పీర్జాదిగూడ, బోడుప్పల్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. రాజకీయ పార్టీలు ఎవరికి వారే గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి..  అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నాయి..  నగరపాలక సంస్థలుగా ఏర్పడిన తరువాత తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో మేయర్‌ ‌పీఠాన్ని చేజిక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి.. డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఔత్సాహిక నాయకులు అధిష్టానం కన్నుల్లో పడి అభ్యర్ధిత్వం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు.. సగం డివిజన్లు మహిళలకు కేటాయించడంతో సతీమణులను నిలబెట్టి స్థానాన్ని కైవసం చేసుకునేందుకు నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.. పీర్జాదిగూడ, బోడుప్పల్‌ ‌మేయర్‌ ‌సీట్లు జనరల్‌కు కేటాయించడంతో పోటీ తీవ్రంగా ఉండనుంది.

బోడుప్పల్‌, ‌పీర్జాదిగూడ నగర పాలక సంస్థలను ఎలీగైనా కైవసం చేసుకోవాలని అన్ని పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ జంట నగరాల తొలి మేయర్‌గా గెలుపొంది చరిత్రలో నిలిచిపోవాలన్న ఉత్సాహంతో పలువురు పోటీ పడుతున్నారు. పార్టీల అధినాయకులు ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుండంతో స్థానిక నాయకులు మరింత ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. నగరపాలక సంస్థలపై తమ పార్టీల జెండాలే ఎగరాలని ఎవరికి వారు పోటీ పడుతూ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గెలుపు దారుల్లో తలమునకలయ్యారు. ముందుగా కార్పొరేటర్‌ ‌స్థానాలు ఎక్కువ గెలుచుకుని మేయర్‌ ‌సీటు కైవసం చేసుకోవాలన్న వ్యూహప్రతివ్యూహాలతో పార్టీ శ్రేణులను సమాయాత్తం చేస్తున్నారు. పీర్జాదిగూడలో 26, బోడుప్పల్‌లో 28 డివిజన్లు ఉన్నాయి. నాయకుల ఉత్సాహం చూస్తే ప్రతి డివిజన్‌ ‌నుంచి అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీ జంట నగరాల మేయర్‌ ‌పదవులను ఎలాగైనా  కైవసం చేసుకుని తీరాలని ఆరాటపడుతోంది. కాంగ్రెస్‌, ‌బీజేపీలు సైతం బలమైన అభ్యర్థులను రంగంలోకి మెజారిటీ స్థానాలు గెలుపొంది మేయర్‌ ‌కుర్చీ ఎక్కాలని ఆరాటపడుతున్నాయి.

ఎలాగైనా బరిలో నిలవాల్సిందే..

ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉత్సాహంగా ఉన్న కొందరు ఆశావాహులు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉన్న పార్టీలో టికెట్‌ ‌రాకుంటే ఇతర పార్టీ నుంచైనా లేదంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి• అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొదటి నుంచి ఎంచుకున్న డివిజన్‌లో రిజర్వేషన్లు అనుకూలించక పోవడంతో పలువురు ఇతర డివిజన్ల నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే కొందరు నాయకులు ఇతర పార్టీల నాయకులతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

 ఎన్నాళ్ళకో వచ్చిన సదవకాశం..

ఈ సారి మున్సిపల్‌ ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్న వారు సైతం పోటీ చేయడానికి అవకాశం కల్పించడంతో గతంలో ఎన్నికలకు దూరంగా ఉన్నవారు ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఇద్దరు పిల్లల నిబంధన ఉండటంతో దశాబ్దాల తరబడి పలువురు నాయకులు ఎన్నికలకు దూరంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలకే పరిమితమయ్యారు. అయితే  అలాంటివారికి ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం రావడంతో పోటీకి సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలలో అధిష్ఠానం పిలుపు కోసం ఎదురు తెన్నులు చూస్తున్నారు. వలసలను అరికట్టేందుకు నామినేషన్‌ ‌పత్రాల చివరి రోజున అభ్యర్థులను ప్రకటించి బీఫాంలు ఇచ్చేందుకు అన్ని పార్టీలు ఆచితూచి వ్యవహరించనున్నట్లు సమాచారం.

Tags: Mayor’s chair wins,Insurance parties, victory

Leave a Reply