విశ్వనగరంలో… మేయర్ అధికారిక నివాసం హుళక్కేనా ?
“జీహెచ్ఎంసి ఎన్నికలలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన సందర్భంగా నగరంలోని రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హైదరాబాద్ వంటి మహానగరంలో ప్రథమ పౌరుడైన మేయర్‌కు అధికారిక నివాసం లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ పాపమంతా గత పాలకులదేనని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలదేనని నిందించారు. హైదరాబాద్ మహానగరంలో మేయర్‌కు అన్ని సౌకర్యాలతో కూడిన అధికారిక నివాసాన్ని నిర్మించి ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. అయితే, సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఆరేళ్లు గడిచి తిరిగి మరో రెండు నెలల్లో జీహెచ్ఎంసి ఎన్నికలు జరుగనున్నాయి. మేయర్ అధికారిక నివాసం నిర్మాణంపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.”
- నెల రోజుల్లో నిర్మిస్తామన్న హామీ గాలికి
- ఆరేళ్లు గడచినా పడని పునాది
- ఆగ మేఘాల మీద ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల నిర్మాణం
హైదరాబాద్ కోటి మందికి పైగా నివాసం ఉండే మహా నగరం. భిన్న రాష్ట్రాల ప్రజలు, విభిన్న సంస్క్కృతుల సమ్మేళనం . దేశానికి అనధికార రెండో ఆర్థిక రాజధానిగా కాస్మోపాలిటన్ నగరంగా భాసిల్లుతున్న విశ్వ నగరం. ఇంతటి ఖ్యాతి కలిగిన మహా నగరంలో ప్రథమ పౌరునికి అధికారిక నివాసం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌లో ఇప్పటికీ మేయర్ కార్యకలాపాలు కొనసాగించాలంటే జీహెచ్ఎంసి కార్యాలయమే దిక్కు. దేశంలోని దిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి ప్రధాన నగరాలన్నింటిలో మేయర్లకు అన్ని సౌకర్యాలతో కూడిన అధికారిక నివాసాలు ఉన్నాయి. వీటిని ఆయా రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాలే నిర్మించాయి. అయితే, మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో మాత్రం మేయర్‌కు అధికారిక నివాసం ఇప్పటికీ లేకపోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జీహెచ్ఎంసికి జరిగిన తొలి ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించింది. మొత్తం 150 డివిజన్లకు గాను సొంతంగా 99 స్థానాలలో విజయం సాధించి గ్రేటర్‌పై గులాబి జెండా ఎగురవేసింది. ఆ తరువాత ఇండిపెండెంట్లుగా గెలిచిన మరికొంత మంది గులాబీ గూటికి చేరారు. దీంతో జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ బలం దాదాపు 115కు చేరింది. జీహెచ్ఎంసి ఎన్నికలలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన సందర్భంగా నగరంలోని రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హైదరాబాద్ వంటి మహానగరంలో ప్రథమ పౌరుడైన మేయర్‌కు అధికారిక నివాసం లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ పాపమంతా గత పాలకులదేనని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలదేనని నిందించారు.
హైదరాబాద్ మహానగరంలో మేయర్‌కు అన్ని సౌకర్యాలతో కూడిన అధికారిక నివాసాన్ని నిర్మించి ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. అయితే, సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఆరేళ్లు గడిచి తిరిగి మరో రెండు నెలల్లో జీహెచ్ఎంసి ఎన్నికలు జరుగనున్నాయి. మేయర్ అధికారిక నివాసం నిర్మాణంపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కాగా, సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతీ ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశ్యంతో దాదాపు అన్ని నియోజకవర్గాలలో ప్రభుత్వ వ్యయంతో క్యాంపు కార్యాలయాలు నిర్మిస్తున్నారు. వీటిలో చాలా వరకు ఇప్పటికే పూర్తి కాగా మరికొన్ని దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయి. అలాగే, ప్రతీ జిల్లాలోనూ జెడ్పీ చైర్మన్లకు సైతం అధికారికంగా క్యాంపు కార్యాలయాలు నిర్మిస్తున్నారు.
నియోజకవర్గాలు, ఈ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ నెలలో నోటిఫికేషన్ సైతం విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో సీఎం కేసీఆర్‌తో పాటు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తూ తమ హయాంలో హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధిపై ఊదరగొడుతున్నారు. తమ హయాంలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేశామనీ, ప్రపంచ పటంలో నగరానికి సుస్థిర స్థానం కల్పించామనీ ఆ ఘనత తమదేనంటూ మరో మారు నగర ప్రజల ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఆరేళ్లలో హైదరాబాద్ మహా నగరంలో రోడ్లు, తాగునీరు వంటి సౌకర్యాల కోసం రూ. 60 వేల కోట్లు ఖర్చు చేశామని ఇంత తక్కువ వ్యవధిలో నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశామనీ పేర్కొంటున్నారు. కానీ, నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల నిర్మాణంపై ఉన్న శ్రద్ధ హైదరాబాద్ మహా నగర మేయర్ అధికారిక నివాసం నిర్మాణంపై లేదని నగర ప్రజలు విమర్శిస్తున్నారు. కనీనం సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ నగర మేయర్‌కు అధికారిక నివాసం నిర్మిస్తామన్న హామీని ఎందుకు నెరవేర్చలేకపోయారో అనే విషయంపై వివరణ కూడా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు.