మేయర్ గారూ.. గిదేంది సారూ..?
గప్పుడు పార్కులెట్ల.. గిప్పుడు ప్లాట్‌లెట్ల..?
రూ. 10 కోట్ల విలువైన ప్రజాప్రయోజనాల స్థలానికి రెక్కలు..!
పీర్జాదిగూడలో బల్దియా ఆస్తులకు పాతర..?
పరిరక్షించాలని పలువురి డిమాండ్
ప్రజాతంత్ర, మేడిపల్లి : రోజు రోజుకూ నగరం విస్తరిస్తున్నది. అంతటా భవనాలు పుట్టుకొచ్చి చెట్టూ చేమా కనిపించకుండా పోయి కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్నది. అయితే అక్కడక్కడా మిగిలి జనానికి కాస్త ఊపిరినిస్త్తున్న కాలనీల్లోని ప్రజోపయోగ(పార్కు, బడి, గుడి, సామూహిక భవనాలు) స్థలాలపై కబ్జాకోరుల కన్నుపడి మాయమవుతున్నాయి. ఇదే కోవలో పీర్జాదిగూడ బల్దియాలో ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి. ‘కంచే చేను మేసిన’ చందంగా పరిరక్షించాల్సిన పాలకులే కబ్జాదారులకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. గతంలో పంచాయత్‌రాజ్ ఉన్నతాధికారులు ఈ స్థలాలను ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన ఖాళీ స్థలాలని నిర్ధారించినా కబ్జాకోరులు మాత్రం వాటిని చేజిక్కించుకునేందుకు పట్టువదలకుండా దశాబ్దాల నుంచి పావులు కదుపుతూనే ఉన్నారు. వివరాల్లోకి వెళితే..నగర పాలక సంస్థ పరిధిలోని మేడిపల్లి సర్వే నంబరు 40లో కొన్ని దశాబ్దాల క్రితం లేఅవుటు వేసి ప్లాట్లు విక్రయించారు. ఇందులో సామూహిక అవసరాలైన బడి, గుడి, కమ్యూనిటీ హాలు తదితర వాటికి ప్లాటు నంబర్లు 38, 39, 40, 132లలోని 1253 చదరపు గజాల స్థలాన్ని కేటాయించారు.
కొన్నేళ్ల క్రితమే 132 ప్లాటు నంబరులోని 303 గజాల స్థలంలో పక్కా నిర్మాణం జరిగి దానికి ఇంటి నంబరు సైతం కేటాయింపు జరిగింది. తాజాగా 38, 39,40 నంబర్ల ప్లాట్లలోని 950 చదరపు గజాల స్థలంలో నిర్మాణాలకు అంకురార్పణ జరుగుతున్నది. పాత లే అవుటు మార్చి, సదరు ప్లాట్లకు నకిలీ డాక్యుమెంట్లు సృ్ట••ంచి విక్రయించినట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తతంగంలో నగర ప్రథమ పౌరుడు మిన్నకుండడం, కొనసాగుతున్న పనులను నిలువరించక•పోవడం పలు రకాల ఊహాగానాలకు తావిస్తున్నది. బల్దియా ఆస్తులన్నింటినీ పకడ్బందీగా పరిరక్షిస్తామంటూ చేసిన వ్యాఖ్యలు ఆర్భాటపు ప్రకటనల వరకేనా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. పాలకుల తీరు ఈ విధంగా ఉంటే భవిష్యత్తులో ఈ ప్రాంతంలోని లేఅవుట్లలో నిర్మాణాలు జరిగితే అసలు ఖాళీ స్థలాలనేవి మచ్చుకైనా కనబడతాయా..? అనే సందేహం పలువురు వ్యక్తం చేస్తున్నారు. నివాసితులు చిన్నపాటి కార్యం చేయాలన్నా స్థలాలు లేకుండా ఉంటే ఎట్లా ఉంటుందనేది పలువురిని తొలుస్తున్న ప్రశ్న.
ప్రజాప్రయోజనాల స్థలాలేనని తేల్చిన పంచాయతి ఉన్నతాధికారులు..
నానాటికి భూముల ధరలు అంతకంతకూ పెరిగిపోతుండడంతో సదరు లేఅవుటు మార్పిడి చేసి సామూహిక అవసరాల(ప్రజాప్రయోజనాల) కోసం కేటాయించిన స్థలాలను కైవసం చేసుకునేందుకు గతంలో భూకబ్జాదారులు అనేక రకాలుగా యత్నించారు. లేఅవుట్లలో అవకతవకలు, మార్పిడి ప్రయత్నాలు జరుగుతున్నట్లు అప్పట్లో జోరుగా ప్రచారం కావడంతో ఓ సామాజిక కార్యకర్త ఈ లేఅవుటుతో పాటు మేడిపల్లిలోని పలు లేఅవుట్లలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్, పంచాయతీ ఉన్నతాధికారుల దృష్టికి తీసికెళ్ళారు. సదరు లేఅవుట్లలో ప్రజాప్రయోజనాల స్థలాలను కబ్జాదారుల వశం కాకుండా తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో జిల్లా పంచాయతీ ఉన్నతాధికారులు సదరు లేఅవుట్లపై క్షేత్రస్థాయిలో మండల స్థాయి అధికారులతో నిశితంగా విచారణ జరిపించి సామూహిక అవసరాల కోసం కేటాయించిన ప్రజాప్రయోజనాల స్థలాలేననని నిగ్గుతేల్చారు. అంతేకాకుండా సదరు స్థలాలను ప్రజోపయోగం కోసం కేటాయించినట్లు సూచిక బోర్డులు సైతం ఏర్పాటు చేయించారు.
ఇదే వ్యవహారంలో గతంలో పంచాయతి కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు..
అయితే ఈ లేఅవుటుతో పాటు మేడిపల్లిలోని మరికొన్ని లేఅవుట్లలో కేటాయించిన పార్కు, బడి, గుడి వంటి సామూహిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలను పరిరక్షించకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించడం, కొన్నింటికి ఇండ్ల నిర్మాణ అనుమతులు సైతం మంజూరీ చేశారనే అభియోగాలు ఉండడం, వాటికి బలం చేకూర్చేలా ఆధారాలు లభించడంతో అప్పటి స్థానిక పంచాయతి కార్యదర్శి కబ్జాదారులకు కొమ్ముకాసారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే పంచాయతీ పాలన ముగిసి మున్సిపల్‌గా మేడిపల్లి అభివృద్ధి చెందడంతో కబ్జాదారుల ప్రయత్నాలు మళ్ళీ మొదలైనట్లు తెలిసింది. ఇటీవలే సదరు ప్రజోపయోగ స్థలాలలో పక్కా నిర్మాణాలకు అంకురార్పణ చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
దీనికి కొందరు ప్రజాప్రతినిధులు, మరి కొందరు నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు, ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు అందినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నివాసితుల సామూహిక అవసరాల కోసం కేటాయించిన ఖాళీ స్థలాలు పరిరక్షించాల్సిన వారే కంచే చేను మేసిన చందంగా వాటి అన్యాక్రాంతానికి పచ్చజెండా ఊపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై స్థానికులు తీవ్రంగా మండిపడుతూ ప్రజోపయోగ స్థలాలు ఆక్రమించేందుకు యత్నిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.