Take a fresh look at your lifestyle.

మే 2 నుంచి 4 వరకు…యాదాద్రిలో నారసింహ జయంతి ఉత్సవాలు

భారీగా ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్య క్షేత్రంలో నృసింహ జయంత్యుత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రిలో ఏటా నృసింహ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఈ యేడాది మే 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నృసింహ జయంత్యుత్సవాలు నిర్వహించనున్నారు. అనుబంధ పాతగుట్ట, దబ్బగుంటపల్లి యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లోనూ నృసింహ జయంత్యుత్సవాలు సంప్రదాయరీతిలో నిర్వహించనున్నట్టు దేవస్థాన ఈవో గీతారెడ్డి తెలిపారు. ఆలయాలను రంగురంగుల విద్యుద్దీపాలు, మామిడి, అరటి, వివిధ రకాల పూలమాలతో అలంకరించనున్నట్టు తెలిపారు.

మహోత్సవాల్లో పాల్గొనే రుత్వికులకు ఆహ్వానాలు పంపినట్టు తెలిపారు. దేవస్థాన ఉద్యోగులకు సెలవులు రద్దు చేశామని, వేసవి సెలవులు కావడంతో మహోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారని,భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఆలయ తిరువీధి అలంకార వాహన సేవలు ఉదయం, సాయంత్రం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మూడు రోజుల పాటు మూల మంత్ర, మూర్తి హవన పూజలు, జపాలు, లక్షకుంకుమార్చన, లక్షపుష్పార్చన, సహస్రఘటాభిషేక పూజలు కొనసాగుతాయని, అర్చక స్వాములు వైదిక పర్వాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు తెలిపారు. యాదగిరిక్షేత్రంలో, అనుబంధ పాతగుట్ట ఆలయాల్లో  కొనసాగనున్న నృసింహ జయంతి వేడుకలను పురస్కరించుకొని భక్తులు స్వామి సన్నిధిలో జరిపించుకునే ఆర్జిత సేవలు మొక్కు, శాశ్విత కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హవన పూజలు నిలిపివేసినట్టు ఈవో గీతారెడ్డి తెలిపారు. జయంత్యుత్సవాలు పరిసమాప్తమైన తర్వాత మే 5వ తేదీ నుంచి యథావిథిగా ఆర్జిత సేవలు కొనసాగుతాయని తెలిపారు.

Leave a Reply