Take a fresh look at your lifestyle.

మాత్రేదైనా ఇవ్వగలరా?

చిన్నతనాన్ని
తలుసుకున్నపుడల్లా
ఉయొచ్చిన ఇంట్ల ఊరినట్టే
కండ్లల్ల నీళ్ళూరుతుంటై

సూరెంబడి టపటపా రాలి
వాకిలంత పొక్కిలి పడ్డట్టు
మనసంతా పొక్కిలి పొక్కిలైతది

నిమ్మచ్చిన ఇంటి గోడల తీరు
కన్నీళ్ళ వానకు
పెయ్యంతా నానుతది

ఒంటి మీద ఉడుకు నీళ్ళు పడ్డప్పటికంటే
సాయితగాని ఇంటికాడ
అంటూ సొంటని సల్లిన
పసుపు నీళ్ళ కొచ్చిన బొబ్బలే
గురుతొచ్చినపుడల్లా పగిలి మంటమండుతున్నై

మడికట్లల్ల ఉరుకంగా గుచ్చిన పట్నం తుమ్మ ముళ్ళు కంటే
పటేల్‌ ఇం‌టికాడ కుర్చీ గుంజుకున్నది యాదికొస్తెనే
కొచ్చని సూదిని గుండెల దింపి కెలికినట్టైతది

మాదిగోళ్లు, మాశినోళ్లు,అంటరానోళ్లన్న మాటలిన్నపుడు
కొసెంటికల నుండి కాలి గోటి దాకా పాణమంతా
శీంపట్టిన పుండు తీరు సలుపుతది

‘‘భీం’’ ఇచ్చిన కాగడా ఎలుగుల
సోయిదెచ్చుకుని
కొలువు దెచ్చుకుని
పదవి దెచ్చుకున్నా
సదువుకన్నా కొలువుకన్నా  పదవికన్నా ముందు
మా కులం పేరుతోనే గుర్తిస్తున్నప్పుడు
పక్కు గట్టిన పుండును గెళ్లగిచ్చినట్టే ఉంటది

మా కట్టును బొట్టును, మా కంచంల కూడును జూసి
నొసలు శిట్లించినోల్ల శీకటి మెదట్లల్ల
దీపం ముట్టిత్తే బాగుండు

పైసల కోసం, పదవుల కోసం
మానాన్ని పభువుల కాళ్ళకు చెప్పులుగా తొడిగిన
మా జాతోల్లకు  ఆత్మాభిమానపు గుండెమార్పిడి జేస్తే బాగుండు

గింత పెరిగిన గీ టెక్నాలజీ కాలంల
మనషుల మనసు మకిలిని కడిగే మందు లేదా?
మా గాయాలని ఇప్పటికిప్పుడే మాన్పే మాత్రే లేదా?

– దిలీప్‌.‌వి, జిల్లా ప్రధాన కార్యదర్శి
మానవ హక్కుల వేదిక, ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా
సెల్‌:8464030808

Leave a Reply