Take a fresh look at your lifestyle.

మత ప్రచారకులతో కొరోనా విస్తృతమవుతున్నదా?

విదేశాలనుండి వస్తున్న మత ప్రచారకులతోనే తెలంగాణలో కరోనా వైరస్‌ ‌పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది. విదేశాలనుండి వస్తున్న భారతీయుల్లో అక్కడక్కడ ఒకరిద్దరికి వైరస్‌ ‌పాజిటివ్‌ ‌కనిపిస్తున్నప్పటికీ, మత ప్రచారం కోసం ఇండోనేషియానుంచి వచ్చినవారికే ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.  కరీంనగర్‌లో ఇండోనేషియాకు చెందిన ఎనిమిదిమందికి ఈ వ్యాధి లక్షణాలుండడమే ఈ భయానికి కారణమవుతున్నది.  భారతదేశానికి భిన్న మతాలు, సంస్కృతుల కూడలిగా పేరున్నది. అందుకు  ప్రధానంగా హైదరాబాద్‌ ఆదర్శంగా నిలుస్తున్నది. మన రాజ్యాంగం మతప్రచార స్వేచ్ఛను కల్పించిన దరిమిలా వివిధ దేశాలనుండి, వివిధ మతాలకు చెందిన ప్రచారకులనేకులు భారతదేశానికి రావడం పరిపాటైపోయింది.దీంతో నిత్యం భిన్నమతాలకు చెందిన ప్రచారకులరాకపోకలు ఇక్కడ విస్తృతమయ్యాయి. అయితే వీరి కార్యక్రమాల మీద కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు ఏమేరకు సమాచారం ఉంటుందో తెలియదుగాని, కరోనా కారణంగా దేశంలో మతప్రచారకులు ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారన్న విషయంమాత్రం వెలుగులోకివస్తోంది. ఎన్టీఆర్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్న ఉమ్మడి ఏపిలో పట్వారీ వ్యవస్థను తీసివేయడానికిముందు గ్రామాల్లో ఒకవిధమైన కట్టుబాటు ఉండేది. ఎవరైనా కొత్తవారు గ్రామానికి వస్తే, ముందుగా వారిసమాచారం ఆనాటి పోలీస్‌పటేల్‌ ‌లేదా పట్వారీకి అందజేయాల్సి ఉండేది. వారెందుకొచ్చారు, ఎన్ని రోజులుంటారు, వారికి ఎవరు ఆశ్రయమిస్తున్నారన్న పూర్తి వివరాలు అందజేస్తేనే వారిని ఆఊరిలో ఉండనిచ్చేవారు.

కాని పట్వారి వ్యవస్థను ఎత్తివేసినతర్వాత ఆ నిబంధనలను పెద్దగా ఎవరూ పట్టించుకున్నట్లులేదు. అలాగే విదేశాలనుండి ఎవరైన వచ్చి, జిల్లాల్లో పర్యటించేప్పడు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్న నిబంధన ఇప్పుడుంది. విదేశాలనుండి వచ్చిన వారెవరు,  జిల్లాల్లో ఎందుకు పర్యటిస్తున్నారు, ఎంతకాలముంటారు, వారికి ఎవరు ఆశ్రయం ఇస్తున్నారన్న విషయాలన్నిటిని ‘ఫామ్‌ ‌సి’ద్వారా పోలీసులకు అందజేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి సమాచారం పోలీసులకు ఇప్పుడు ఉందా లేదా అన్నవిషయం పక్కనపెడితే, కొరోన కారణంగా ఎంతమంది విదేశ మత ప్రచారకులు  మతంపేరున నెలల తరబడి ఇక్కడ మకాంవేసి ఉంటున్నారన్న విషయం మాత్రం వెలుగులోకి వస్తున్నది. ఇలా  వచ్చిన మత ప్రచారకులను ఇంతవరకు 77మందిని ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తున్నది. ఇందులో ఇండోనేషియాకు చెందిన వారు పదమూడు మందికాగా, కజికిస్తాన్‌ ‌నుంచి 19, థాయిలాండ్‌ ‌నుంచి ఎనిమిది, మలేషియానుంచి 13, ఇరాన్‌ ‌నుంచి 14, సూడాన్‌ ‌నుంచి 10 మంది వచ్చినట్లు తెలుస్తున్నది. అయితే వీరిలో ఇండోనేషియానుంచి వచ్చినవారికే పాజిటివ్‌ ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇండోనేషియన్ల పుణ్యమా అని ఒక్క కరీంనగర్‌ ‌జిల్లాలోనే 76వేల మందిని స్క్రీనింగ్‌ ‌చేయాల్సి వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో విదేశాలనుండి వచ్చినవారి కారణంగానే కొరోనా ప్రబలుతున్నదన్న విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం గ్రామస్థాయి నుండి రాష్ట్ర రాజధానివరకు ప్రజాప్రధినిధులు, అధికారులందరినీ భాగస్వాములు చేయడంతో విదేశీయుల సమాచారం ప్రభుత్వానికి సత్వరం అందుతున్నది. ఏవో స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీరిక్కడికి వచ్చినట్లు తెలస్తున్నది.

- Advertisement -

కరీంనగర్‌, ‌హైదరాబాద్‌, ‌నల్లగొండ తదితర ప్రాంతాల్లో ఈ బృందాలు తిరిగినట్లు పోలీసులు సమాచారం రాబట్టారు. హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌లో ఇండోనేషియానుండి వచ్చిన నాలుగు జంటలు తిరిగినట్లు, అలాగే  నల్లగొండలో ఇండోనేషియా, సౌదీనుంచి పద్నాలుగు మంది వచ్చి, పర్యటించినట్లు జరిగిన ప్రచారం ఆ జిల్లావాసులను కలవరపర్చింది. తాజాగా, కరీంనగర్‌ ‌సంఘటన  తెలంగాణ ప్రభుత్వాన్నే అలర్ట్ ‌చేసింది. కరీంనగర్‌, ‌రామగుండం ప్రాంతాల్లో  ఇండోనేషియానుంచి వచ్చిన బృందం  విస్తృతంగా పర్యటించిన విషయాన్ని స్థానికుల ద్వారా పోలీసులు తెలుసుకోగలిగారు.  మత ప్రచారకులుగా వచ్చిన వీరిని పరిశీలించినప్పుడు వీరిలో చాలమంది వైరస్‌ ‌సోకినవారే కావడం మరింత భయాందోళనకు కారణమైంది.  ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాపించే ప్రమాదంముండగా ఈ మత ప్రచారకులు కొంతకాలంగా తెలంగాణలోని పలు ప్రాంతాలను పర్యటించినప్పుడు ఎంతోమందిని కలిసిఉంటారు. వారితో కరచాలనం చేయడం, కలిసి భోజనం చేయడం సమీపంలోకూర్చుని మాట్లాడటం  జరిగిఉంటుంది. అందుకే ప్రభుత్వం వారు తిరిగి, కలిసిన వారినందరినీ గుర్తించేందుకు వంద బృందాలను ఏర్పాటుచేసి  76 మందిని పరీక్షించారు. అయితే ఇక్కడ మరో విషయం గ్రహించాల్సి ఉంది. వీరికన్నా ముందు  ఇండోనేషియానుండి వచ్చిన మరో బృందం ఈనెల పదవ తేదీన మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించి ఢిల్లీకి వెళ్ళినట్లు  పోలీసులు సమాచారం సేకరించినట్లు తెలుస్తున్నది. తెలంగాణలో  రోజురోజుకు కరోనా బారిన పడినవారి సంఖ్య పెరుగుతుండడంతో ఇలాంటి బృందాలు ఇంకా ఎన్ని ఎక్కడెక్కడ పర్యటించాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Leave a Reply