Take a fresh look at your lifestyle.

కామారెడ్డి అగ్ని కణాలు

మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌మాయ ముసుగులో..
పంటలకు నిప్పు పెట్టే కుతంత్రాలు
సాగుబడి చేతులు నరికే నీతులు
నేలతల్లి నిశ్శబ్ద నినాదాలకే కాదు..
కామారెడ్డి రైతు రౌద్ర కంపనాలకు..
ప్రభుత్వ నిర్ణయాలు జడిసే రోజులు !

మట్టి సత్తువ సలసల మసిలి..
కోపాగ్నితో ఎగిసి పిడికిలెత్తింది
కొలిమిలో కర్రు మొన ఎర్రగా కాలి..
నిరసన చురకల వాతలు పెడుతోంది
కొడవలి ప్రకోపంతో మహా ప్రణాళికల..
కలుపును కసితో తెగ నరకజూస్తున్నది !

గడ్డపార నిలబడి భీకరంగా గర్జించి..
కార్పొరేట్‌ ‌కోరల్ని కాటేయ చూస్తున్నది
ఎడ్లబండి ఎదురు తిరిగి ఎగిసి పడి..
రోడ్డుకు అడ్డుపడి కన్నెర్ర చేస్తున్నది
కర్షకలోక సంద్రం కుతకుత ఉడికి..
నాగటి సాళ్లల్లో ఆవేశ విత్తులు వేస్తున్నది !

మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌నిర్ణయాల్ని ఎదిరిస్తూ..
పల్లె జనగుంపులు ఏకగళం ఎత్తుతూ..
అన్నదాత కవాతుకు పీఠాలు కదుల్తూ..
విషాలోచనలకు సంకెళ్ళు వేస్తున్నాయి
మీతో మేమంటూ పంట పైరు మన్ను..
రైతెంట దర్నాలతో దడపుట్టిస్తున్నాయి !

మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌కాగితాలకు మంటబెట్టి..
కర్షక లోకానికి భరోసా గొడుగు పట్టి..
పుష్కల పాడి పంటలకు పట్టం కట్టి..
దూరాలోచన తెగులుకు మందు కొట్టి..
నిరాశ నిండిన రైతుకు ఆశల రక్తాన్నిచ్చి..
హరిత తెలంగాణను ఆవిష్కరిద్దాం !

  – డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
       కరీంనగరం – 9949700037

Leave a Reply