- లక్ష మందిని తరలించేందుకు బీజేపీ రాష్ట్రశాఖ సన్నాహాలు
- నియోజకవర్గాలవారీ కార్యకర్తల సమావేశాలు
సీఏఏకు అనుకూలంగా హైదరాబాద్‌లో వచ్చే నెలలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ యోచిస్తోంది. మార్చి 15న సీఏఏకు అనుకూలంగా ఈ సభకు కనీసం లక్ష మందిని తరలించాలని రాష్ట్ర నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గం నుంచి బీజేపీ కార్యకర్తలతో పాటు ఆ పార్టీ సానుభూతిపరులు కూడా ఈ సభకు హాజరయ్యేలా చూడాలని పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించారు. ముందుగా హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నియోజకవర్గంతో సీఏఏపై ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ నియోజకవర్గమైన ఇక్కడ నిర్వహించిన సమావేశం విజయవంతమైంది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నేతలు అసలు సీఏఏ అంటే ఏమిటి ? కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయడానికి కారణం ఏమిటి ? ఈ చట్టం వల్ల మైనార్టీలకు ఏవైనా సమస్యలు వస్తాయా ? వంటి సందేహాలపై నేతలు పార్టీ కార్యకర్తలకు అవగాహన కలిగించారు. ముషీరాబాద్‌లో నిర్వహించిన ఈ సమావేశం విజయవంతం కావడంతో ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా సీఏఏపై అవగాహనా సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. కాగా, దేశంలో సీఏఏ చట్టం అమలును రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీఏఏ పేరుతో దేశంలో విచ్ఛిన్నవాదాన్ని ప్రేరేపించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో విమర్శించారు. దేశ లౌకిక వ్యవస్థ స్ఫూర్తికి ఇది విరుద్ధమని తీవ్రంగా ధ్వజమెత్తారు. అంతేకాకుండా మరో అడుగు ముందుకు వేసి ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఏఏ అమలునువ్యతిరేకంగా తీర్మానం చేశారు. సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.
అవసరమైతే ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసే అంశంపై ఆలోచిస్తామని సైతం వెల్లడించారు. మరోవైపు, రాష్ట్రంలో సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ స్థాయిలో ఉద్యమిస్తున్నారు. ఇప్పటికే ఎంఐఎం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం దారుస్సలాంతో పాటు మరికొన్ని చోట్ల సీఏఏ వ్యతిరేక సదస్సులు నిర్వహించారు. సీఏఏ చట్టం మైనార్టీలకు పూర్తిగా వ్యతిరేకమనీ, దీంతో ముఖ్మంగా ముస్లింలకు సమాజంలో భద్రత ఉండదని ఆయన ప్రచారం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం హిందువుల హక్కుల పరిరక్షణ కోసమే పనిచేస్తున్నదనీ, ఇది దేశ లౌకిక వ్యవస్థ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని ఆయన ప్రచారం చేస్తున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ సైతం సీఏఏ చట్టాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నది. ఇందులో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర శాఖ నేతృత్వంలో ఇందిరా పార్కు వద్ద భారీ ధర్నాను సైతం నిర్వహించారు. అయితే, ప్రతిపక్ష కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు సీఏఏ అంశంపై ప్రజల్లోకి వెళ్లి బీజేపీని దోషిగా నిలబెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తుండగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దానిని తిప్పికొట్టడానికి సభలు సమావేశాలు నిర్వహించాలని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆ పార్టీ జాతీయ స్థాయి నేతలు ఢిల్లీ నుంచి వచ్చి రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో సీఏఏ అనుకూల సభలు, సమావేశాలు నిర్వహించారు. ఎంఐఎం బీజేపీ మినహా మిగతా అన్ని పార్టీలను కలుపుకుని నిజామాబాద్‌లో సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ నిర్వహించింది. దీనికి పోటీగా బీజేపీ సైతం అక్కడే సీఏఏకు అనుకూలంగా సభ నిర్వహించింది. అయితే, రాష్ట్రంలో అధికారంలో టీఆర్‌ఎస్, ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం, ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుండటంతో ఆ పార్టీల దాడిని తిప్పికొట్టేందుకు భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఈమేరకు మార్చి 15న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియంలో దాదాపు లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.