కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల జేఏసి నేతృత్వంలో హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద మానవహారం నిర్వహించారు. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతు సంఘాలు నిర్వహిస్తున్న నిరసన దీక్షలు శనివారంతో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా వారికి సంఘీభావంగా బ్లాక్ డేగా పాటించడంతో పాటు మానవహారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతు సంఘాల కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలనీ, దీనిపై అఖిలపక్ష నేతలను వెంటనే చర్చలకు పిలవాలని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు గొంతు కోసే విధంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
కేవలం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించడానికే ఈ చట్టాలను తీసుకొచ్చిందని విమర్శించారు. మొదట్లో రైతు సంఘాల అఖిలపక్ష నేతలతో చర్చల పేరిట కాలయాపన చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రైతులు మొండిగా వ్యవహరిస్తున్నారనే సాకు చూపి పూర్తిగా చర్చలు జరపడమే మానివేసిందని ఆరోపించారు.