Take a fresh look at your lifestyle.

బిఆర్‌ఎస్‌లో ఏపి నాయకుల భారీ చేరికలు

ప్రజాతంత్ర డెస్క్, ‌జనవరి 2 : వైకుంఠ ఏకాదశి పర్వదినాన బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ద్వారాలు తెరుచుకున్నాయి. టిఆర్‌ఎస్‌ ‌ప్రాంతీయ పార్టీ నుండి బిఆర్‌ఎస్‌ ‌జాతీయ పార్టీగా మారిన తర్వాత వొచ్చిన ఈ ఏకాదశి ఆ పార్టీకి బాగా కలిచివచ్చినట్లుంది. పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపి రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు, వివిధ సంస్థల ప్రతినిధులు ఆ పార్టీలో చేరేందుకు సోమవారం క్యూ కట్టడం ప్రారంభించారు. ఇది ఒక విధంగా బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి శుభపరిణామమనే చెప్పాలి.  దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులే కాకుండా పలువురు ఉద్యమకారులు ఈ పార్టీలో చేరేందుకు ఆలోచిస్తున్నట్లు కొంతకాలంగా వొస్తున్న వార్తలు దీనివల్ల నిజమైనాయి. బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆవిష్కరణ సభలో తమ పార్టీని (అబ్‌ ‌కీ బార్‌ ‌కిసాన్‌ ‌సర్కార్‌)  ‌రైతు పార్టీ అంటూ కెసిఆర్‌  ‌ప్రకటించిన నేపథ్యలో దేశంలోని రైతు నాయకులు ఈ పార్టీలో చేరేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ముందుగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పార్టీని విస్తరించి, అక్కడ జరిగే ఎన్నికల్లో భాగస్వామి కావాలని బిఆర్‌ఎస్‌ ‌యోచించింది.

అయితే విచిత్రమేమంటే ఇతర రాష్ట్రాలకన్నా ముందు పక్కనున్న ఆంధప్రదేశ్‌ ‌నుండే నాయకులు లైన్‌ ‌కట్టడం ప్రారంభించారు. వాస్తవంగా బిఆర్‌ఎస్‌ ‌ప్రకటన వెలువడ గానే ఏపిలో కెసిఆర్‌ ‌బ్యానర్లు, కటౌట్లు  భారీసంఖ్యలో దర్శనమిచ్చాయి. ఆ పార్టీలో చేరేందుకు పలువురు ఆసక్తిని ప్రదర్శిస్తూ  ప్రకటనలు కూడా చేశారు. దీంతో పార్టీపైన పత్రికల్లో, ఎలక్ట్రానిక్‌ ‌మీడియాల్లో విస్తృతంగా నేటీకీ ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మనస్సులో ఎలా ఉన్నా, రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా పార్టీని ఏర్పాటు చేసుకోవచ్చు, ఎక్కడి నుండి అయినా పోటీ చేయవచ్చని ఏపీకి చెందిన అధికార పార్టీ మంత్రులు పేర్కొన్న విషయం కూడా తెలియందికాదు. అయినప్పటికీ ఈ విషయంలో ఏపి నుండి భిన్న వాదనలు నిత్యం వినవస్తూనే ఉన్నాయి. తమ ప్రాంతాన్ని విడగొట్టి అన్యాయం చేసిన తెలంగాణ పార్టీ ఇక్కడికి రావడానికి తాము ఎట్టి పరిస్థితిలోనూ వ్యతిరేకిస్తామంటూ ఆవేశపడినవారూ లేకపోలేదు. ఏదిఏమైనా ఏపిలో పార్టీ విస్తరణ విషయాన్ని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌కు కెసిఆర్‌ అప్పగిండంతో, పార్టీ ముందుకు దూసుకుపోతూనే ఉంది.

ఆయన ఇప్పటికే పలు దఫాలుగా ఏపి నాయకులతో జరిపిన సంప్రదింపులు మంచి ఫలితాన్నిచ్చినట్లు  కనిపిస్తున్నది. ఆ ప్రాంతం నుండి నాయకులు క్యూ కడుతుండడమే ఇందుకు నిదర్శనం. కొత్త సంవత్సరం ప్రారంభమైన మరుసటి రోజున్నే పార్టీలో చేరికలతో హైదరాబాద్‌లోని బిఆర్‌ఎస్‌ ‌కార్యాలయం కిటకిట లాడింది. గుంటూరు, విజయవాడ, నూజివీడు ప్రాంతాల నుండి  నాయకులు, మేధావులు, విద్యార్థి సంఘాల నాయకులు, యువకులు,  జర్నలిస్టులు, రైతు నాయకులు ఇలా ఒకరేంటి అన్ని వర్గాల వారు చేరేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. సోమవారం చేరిన వారంతా అనామకులేమీకాదు. అంతో ఇంతో పేరున్నవారు కావడంతో అక్కడి నుండి చేరికలు ఇంకా కొనసాగుతాయన్నది స్పష్టమవుతున్నది.

వైకుంఠ ఏకదశి పర్వదినాన చేరిన వారిలో ప్రధానంగా చెప్పుకోదగిన వ్యక్తి మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు. విచిత్రమేమంటే ఆయన కెసిఆర్‌ ‌వ్యతిరేకిస్తున్న భారతీయ జనతాపార్టీకి గుడ్‌ ‌బై చెప్పి బిఆర్‌ఎస్‌ ‌కండువ కప్పుకోవడం.ఆయన ముందుగా 2014లో గుంటూరు జిల్లా పత్తిపాడు శాసనభ నియోజకవర్గం నుండి గెలిచి, చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో సాంఘీక సంక్షేమ మంత్రిగా కొనసాగిన వ్యక్తి. మారుతున్న రాజకీయల కారణంగా  2019లో జనసేన పార్టీలో చేరి అదే నియోజకవర్గం నుండి పోటీచేసి ఓటమి చవిచూశారు. ఆ తర్వాత భాజపాలో చేరినప్పటికీ, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితుడైనట్లు చెబుతున్నాడు. ముఖ్యంగా ఏపిలో టిడిపి, వైఎస్‌ఆర్‌ ‌రాజకీయాలతో అక్కడి ప్రజలు విసిగి పోతున్నారని, ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తున్నప్పుడు తమకు బిఆర్‌ఎస్‌ ‌మధ్యే మార్గంగా కనిపించిందంటారాయన.  బిఆర్‌ఎస్‌ ‌గులాబి కండువ కప్పుకున్న మరో వ్యక్తి జనసేన నుండి వొచ్చిన చింత పార్థసారథి. ఆయన 2019లో తన ఐఆర్‌ఎస్‌ ‌పదవికి  రాజీనామాచేసి అనకాపల్లి లోకసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూశారు.

అదేపార్టీ (జనసేన) నుండి వొచ్చిన మరో వ్యక్తి తోట చంద్రశేఖర్‌. ‌మహారాష్ట్ర క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారిగా ఇరవై మూడేళ్ళపాటు పనిచేసిన వ్యక్తి. ప్రముఖ సినీనటుడు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీపట్ల మొదట్లో ఆకర్షితుడైన  చంద్రశేఖర్‌  2009‌లో తన పదవికి రాజీనామా చేసి, గుంటూరు లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి విఫలమైనారు. 2014లో వైకాపాలో చేరి ఏలూరు లోకసభ స్థానం నుండి పోటీచేసినప్పటికీ అదృష్టం ఆయన్ను వరించలేదు.  ఆ తర్వాత ఆయన 2019లో  పవన్‌కళ్యాణ్‌ ‌నెలకొల్పిన జనసేనపార్టీ నుండి గుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు కెసిఆర్‌ ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్‌లో చేరారు. ఏపిలో బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం చేత, ఏపి బిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఆయనకే బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు వినికిడి. ప్రజారాజ్యం తరఫున అనంతరపురం నగర నియోజకవర్గం నుండి 2009లో పోటీచేసి ఓటమి చవిచూసిన తుమ్మలశెట్టి జయప్రకాశ్‌ ‌నారాయణ(టీజే ప్రకాశ్‌), ‌రమేష్‌నాయుడు, గిద్దెల శ్రీనివాసనాయుడు, జేజే రామారావు కూడా నేడు గులాబీ కండువ కప్పుకున్నవారిలో ఉన్నారు. ఏపి నుండి పలు వాహనాల్లో వందల సంఖ్యలో వొచ్చిన వారికి  బిఆర్‌ఎస్‌ ‌నాయకులు ఎదురేగి ఘనస్వాగతం పలికారు.

Leave a Reply