- సిద్ధిపేట మున్సిపల్ కార్మికులు, కమిషనర్‌పై మంత్రి హరీష్‌రావు అగ్రహం
- పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, గ్లౌజులు అందజేత
కరోనా మహమ్మారి ఎంతగా వణికిస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా ప్రభుత్వం ఎన్నో ముందస్తు చర్యలను తీసుకుంటున్న ఈ తరుణంలో మీరు(పారిశుద్ధ్య కార్మికులు)మాస్కులు, గ్లౌజులు లేకుండా ఎలా విధులను నిర్వహిస్తున్నారనీ సిద్ధిపేట మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులు, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డిపై స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని రాజీవ్ రహదారి సమీపంలో గల పొన్నాల నుంచి పట్టణానికి వచ్చే దారిలో పారిశుద్ధ్య కార్మికులు చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్కులు లేకుండా రోడ్లు ఊడుస్తున్న కార్మికులను చూసిన మంత్రి హరీష్‌రావు తన కారు కాన్వాయ్ ఆపారు. రోడ్లు శుభ్రం చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను పలకరించారు. కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోవడం లేదని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది, కార్మికుల తీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, గ్లౌజులు ఉన్న కిట్లను అందజేసి కరోనా వ్యాధి నివారణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, అందులో భాగంగా మాస్కులు, గ్లౌజులు లేకుండా పారిశుద్ధ్య పనులు చేయొద్దని కార్మికులకు మంత్రి హరీష్‌రావు అవగాహన కల్పించారు.