Take a fresh look at your lifestyle.

వివాహవయస్సు 21ఏళ్లు ఉండాల్సిందే

  • అప్పుడే వారి ఆరోగ్యానికి రక్షణ
  • బాలల హక్కుల పోరాట నేత కాశీనాథ్‌

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 7 : అమ్మాయిలకు కనీస వివాహ వయసు 18 కాకుండా 21 ఏళ్లు ఉండాలని  కేంద్రం చేసిన ప్రతిపాదనలు చట్టరూపంలోకి తీసుకుని రావాలని బాలల హక్కుల సంఘం, స్వచ్ఛందసంస్థ ప్రతినిధులు డిమాండు చేస్తున్నారు. దీనిపై విపక్షాలు మోకాలడ్డడం సరికాదన్నారు. ఇది వయసుకు సంబంధించిదే తప్ప మతానికి ముడిపెట్టరాదన్నారు. పెళ్లీడుకు ముందు జరుగుతున్న వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం దెబ్బతింటోందని ప్రముఖ బాలల హక్కుల పోరాట నేత కాశీనాథ్‌ అన్నారు. బాలలహక్కుల సంఘం స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, న్యాయనిపుణులు, సామాజికవేత్తలు, సైకియాట్రిస్టులు, గైనకాలజిస్టుల గతంలో అనేకమార్లు ఈ ప్రకటన చేశారు.

ఈ ప్రతిపాదనను మహిళా సంఘాలు స్వాగతిస్తున్నాయి. కేంద్రం ఇటీవల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచాలని నిర్ణయించినా సెలెక్ట్ ‌కమిటీకి పంపారు. దీనిని చట్టం చేయడంతో పాటు ప్రచారం చేయాలని ఆయన అన్నారు. అప్పుడే మహిళలకు రక్షణ కూడా ఉంటుందని అన్నారు.  యువతులకు 18 ఏళ్ల వయసులో భావోద్వేగ పరిపక్వత ఉండదని  చెప్పారు. వివాహాలు విజయవంతం కావాలంటే పెళ్లికూతురి వయసు 21 ఏళ్లు ఉండాలన్నారు. అమ్మాయిలు ఆర్థిక స్వాతంత్య్ర సాధించాలంటే వారు ఉన్నతవిద్య అభ్యసించాలని సూచించారు. అమ్మాయిల వివాహ వయసు తక్కువ ఉంటే వారు గర్భం దాల్చినపుడు తల్లీ పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని గౌనకాలజిస్టులు చెప్పారు. గర్భం దాల్చేందుకు మహిళలకు 21 నుంచి 25 ఏళ్లు సరైన వయసు అని డాక్టర్లు సూచించారు. తక్కువ వయసులో అమ్మాయిలకు పెళ్లి చేస్తే పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆరోగ్యానికి కూడా క్షేమం కాదన్నారు.

Leave a Reply