ప్రతిభా అవార్డు పొందిన గంటల్లోనే డిమోషన్
మరిపెడ ఆగస్టు 03( ప్రజాతంత్ర విలేకరి): ట్రైనీ ఎస్సైగా పనిచేస్తున్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా ఐజీ నాగిరెడ్డి ఆదేశానుసారం మరిపెడ ఎస్సై పి. శ్రీనివాస్‌రెడ్డిని సస్పెన్సన్ చేసినట్లు మహబూబబాబాద్ జిల్లా ఎస్పీ యన్.కోటిరెడ్డి మంగళవారం తెలిపారు. సోమవారం రాత్రి మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమాయగూడెం సమీపంలో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటికను పట్టుకునేందుకు మహిళా ట్రైనీ ఎస్సైతో పాటు వెళ్లారు. పోలీస్ రైడ్‌లో నల్లబెల్లం, పటికను పట్టుకున్నారు. నల్లబెల్లాన్ని పట్టుకున్నందుకు ఉదయం వేళలో రివార్డు పొందాడు. అంతలోనే మూడు, నాలుగు గంటల వ్యవధిలో సీన్ మారింది. నల్లబెల్లం పట్టుకునేందుకు ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తన స్వంత వాహనాన్ని వినియోగించి ట్రైనీ ఎస్సైతో అసభ్య ప్రవర్తించినట్లు సమాచారం. దీంతో సదరు ట్రైనీ ఎస్సై న్యాయం కోసం వరంగల్ కమిషనరేట్‌ను ఆశ్రయించింది.
ఎస్సై శ్రీనివాస్‌రెడ్డిపై చర్యలు తీసుకోకుండా తాను ఉద్యోగ విరమణ చేస్తామని భీష్మించింది. ఈ విషయం సామాజిక మాద్యమాలు, ప్రసారమాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొట్టింది. మహిళా పోలీస్ అధికారిణిపై జరిగిన అనాగరిక చర్యను పలువురు దళిత వర్గాలు కూడా ఖండించాయి.
పోలీస్ ఉన్నతాధికారుల విచారణ అనంతరం ఎస్సైపై వేటు పడింది. ఎస్సై సస్పెన్సన్ పోలీస్‌శాఖలో తీవ్ర కలకలం సృష్టించింది. విధి నిర్వహాణలో పారదర్శకంగా వ్యవహరించినందుకే ఎస్సైపై వేటుపడిందన్న భావనను పలువురు పోలీసులు వారి అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరచారు. శ్రీనివాస్‌రెడ్డి గతంలో మట్టెవాడ, కేసముద్రం, గార్ల మండలాల్లో ఎస్సైగా విధులు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయనపై ఎలాంటి నిందారోపణలు, అసభ్య ప్రవర్తనకు చోటివ్వకుండా పనిచేసినట్లు సమాచారం.