Take a fresh look at your lifestyle.

గంజాయి రాజకీయాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గంజాయి నషా పెరిగిపోతున్నది. గత కొంతకాలంగా ఈ రెండు రాష్ట్రాల్లో కోట్లాది రూపాయల విలువచేసే గంజాయి పట్టుపడుతున్న తీరు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఇప్పటికే మత్తు పదార్థాల అంశం అటు బాలివుడ్‌, ఇటు టాలివుడ్‌లను గందరగోళ పరుస్తున్నది. పలువురు ప్రముఖ నటీనటులపై ఉన్న కేసుల విషయంలో ఇంకా దర్యాప్తులు కొనసాగుతూనే ఉన్నాయి. విదేశాల నుండి మత్తుపదార్థాలను దిగుమతి చేసుకుని పాఠశాల విద్యార్థులను కూడా వదులకుండా మత్తును అలవాటు చేస్తున్నారు. ఒక పక్క శాస్త్రీయ, సాంకేతిక, వైజ్ఞానిక రంగంలో దేశం ప్రగతిని సాధిస్తుంటే, కేవలం డబ్బు సంపాదన కోసం మరో పక్క యువతను నిర్వీర్యం చేసే కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడీ అక్రమ డబ్బు సంపాదన రాజకీయ వర్గాల్లోకి పాకింది. గంజాయి విషయంలో పక్కనున్న ఆంధప్రదేశ్‌లో రాజకీయ గందరగోళాన్ని లేవదీసింది. ఇక్కడ లక్షలాది ఎకరాల్లో సాగుచేస్తున్న గంజాయి తోటల వెనుక పలుకుబడి ఉన్న రాజకీయ నేతల అండ ఉందన్నది ఇటీవల కాలంలో ఆ రాష్ట్రంలో కోడైకూస్తున్నది.

అదికాస్త ముదిరి అధికార, ప్రధాన ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. అంతటితో ఆగకుండా ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు రాళ్ళదాడులు చేసుకోవటం, ఇండ్ల మీద దాడులు చేయడం వరకు వెళ్ళింది. అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. అక్రమంగా గంజాయి సాగును బహిరంగ పరుస్తే వారిని అరెస్టు చేయాల్సిన పోలీసులు, సమాచారం ఇచ్చిన వారిపైనే చర్యలు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. విశాఖ మన్యంలో సుమారు 15 వేల ఎకరాల్లో గంజాయి సాగవుతున్నట్లు వార్తలు వొస్తున్నాయి. అక్కడ పండించిన గంజాయి చుట్టుపక్కల ఉన్న పలు రాష్ట్రాలకు సరఫరా జరుగుతున్నది. ఇటీవల తెలంగాణ పోలీసులు కొందరు స్మగ్లర్లను పట్టుకున్నప్పుడు విశాఖ నుండి తెలంగాణతోపాటు మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, ‌హర్యాన, కేరళ తదితర రాష్ట్రాలకు గంజాయి స్మగ్లింగ్‌ ‌జరుగుతున్న విషయం వెల్లడయింది. ఇటీవల కాలంలో తెలంగాణ పోలీసులు స్మగ్లర్లను పట్టుకున్నప్పుడు స్మగ్లింగ్‌ ‌జరుగుతున్న తీరు కూడా ఆశ్చర్యపరిచింది. చెక్కతో తయారుచేసిన దేవుడి బొమ్మల్లో, ట్యాంకర్లలో వందలు, వేల కిలోల గంజాయిని అక్రమంగా రవణాచేస్తున్న తీరు బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజులుగా తెలంగాణ పోలీసులు ఈ విషయంలో స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌నిర్వహిస్తున్నారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే పలు కేసులు నమోదయ్యాయి. ఈ కొద్ది కాలంలో దాదాపు నూటా ముప్పై మందిని అరెస్టు చేసి, వేలాది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కొందరిపైన పీడీ యాక్టు కేసులను కూడా పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ సందర్భంగా ఇలాంటి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న దాదాపు రెండు వందల మందికి పైగా ఉన్నట్లు పోలీసులు సమాచారం సేకరించారు. కాగా నల్లగొండ పోలీసులు తీగలాగినప్పుడు మొత్తం డొంక కదిలింది. స్మగ్లింగ్‌ ఏ ‌స్థాయిలో జరుగుతున్నదన్నది బయట పడింది. దీంతో ఇక్కడి పోలీసులు 17 బృందాలుగా ఏర్పడి కూపీ లాగారు. ఈ స్మగ్లింగ్‌ ‌కంతటికీ నాగసాయి అనే వ్యక్తి మూలకారకుడిగా పోలీసుల విచారణలో తేలింది. విశాఖ కేంద్రంగా స్మగ్లింగ్‌ ‌సాగిస్తున్నట్లు తెలిసింది. దొరికిన ఆధారాలతో నల్లగొండ పోలీసులు విశాఖ వెళ్ళడం అక్కడ లంబసింగి వద్ద స్మగ్లర్లు పోలీసులపై రాళ్ళదాడి చేయడం, పోలీసు వ్యాను అద్దాలు పలుగగొట్టడం జరిగిపోయాయి. అక్కడ ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవడం తెలిసిందే. గంజాయి స్మగ్లింగ్‌ ‌చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. లక్షల ఎకరాల్లో గంజాయిని సాగు చేస్తున్నా పోలీసులు పట్టుకోకపోవడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో కూడా వివిధ ప్రాంతా నుండి గంజాయి దొంగ రవాణా జరుగుతున్నది. అటు ఆంధ్ర, ఇటు ఛత్తీస్‌గడ్‌ ‌నుండి తెలంగాణకు చేరుతున్న గంజాయి, ఇక్కడి నుండి కర్నాటకకు, ఆ తర్వాత విదేశాలకు వెళ్ళుతుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం గంజాయి మీద ఇప్పుడు తీవ్ర యుద్ధాన్నే ప్రకటిస్తున్నది. మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా ప్రణాళికను సిద్ధంచేస్తున్నది. బుధవారం ఈ విషయమై పోలీసు, ఎక్సైజ్‌ అధికారులతో సమావేశమైన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌గంజాయి సాగు, అక్రమ రవాణపై ఉక్కు పాదం మోపాలన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న డ్రగ్‌ ‌మాఫియాను అరికట్టడమేకాదు, నేరస్తులను ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దన్నారు. ఎన్‌ఫోర్స్ ‌మెంట్‌, ‌ప్లయింగ్‌ ‌స్క్వాడ్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రత్యేకంగా యువతను లక్ష్యంగా చేసుకుని మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నారు. అమాయకులైన విద్యార్దులు తెలిసీ తెలియక వాటి బారిన పడుతున్నారు. వీరిని తప్పుతోవ పట్టిస్తున్న వారిపై గట్టి నిఘాను ఏర్పాటుచేయాలని, ముఖ్యంగా వివిధ రాష్ట్రాల సరిహద్దుల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్న సిఎం అదేశాలు యువతను కాపాడుతాయనే అశిద్దాం.

Leave a Reply