Take a fresh look at your lifestyle.

మార్చ్ 24 ‌ప్రపంచ క్షయ దినం అప్రమత్తతతోనే క్షయ వ్యాధి నివారణ

ప్రతి సంవత్సరం మార్చి 24న ‘ప్రపంచ క్షయ నివారణ దినం’’ జరుపుకుంటాము. క్షయ వ్యాధి మైకో బ్యాక్టీరియం ట్యూబర్‌ ‌క్యులోసిస్‌ అనే బ్యాక్టీరియా వలన వచ్చే భయంకరమైన అంటువ్యాధి. దీనిని టిబి అని కూడా పిలుస్తారు. జర్మనీ దేశానికి చెందిన రాబర్ట్ ‌కాక్‌ అనే శాస్త్రవేత్త క్షయ వ్యాధి రావడానికి కారణమైన సూక్ష్మజీవిని 1882 మార్చి 24న కనుగొన్నాడు. అందుకే ప్రతి సంవత్సరం ఇదే రోజున ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినంగా పాటిస్తున్నాము. క్షయ సూక్ష్మ జీవిని కనుగొన్నందుకుగాను ‘రాబర్ట్ ‌కాక్‌’’‌కు 1905లో నోబెల్‌ ‌పురస్కారం కూడా లభించింది. ఆయన చేసిన సేవకు గుర్తింపుగా ఈ వ్యాధిని వైద్యరంగంలో ‘కాక్స్ ‌డిసీజ్‌’’ అని కూడా పిలుస్తుంటారు.

ఇది స్త్రీ, పురుషులనే భేదం లేకుండా ఏ వయసు వారికైనా, ఎప్పుడైనా రావచ్చును. క్షయ శరీరంలో రక్త ప్రసరణ ఉన్న(తల వెంట్రుకలు, గోళ్లు తప్ప) ఏ భాగానికైనా రావచ్చును. క్షయ సూక్ష్మ జీవికి ఆక్సిజన్‌ అవసరం కాబట్టి సాధారణంగా ఇది ఆక్సిజన్‌ ఎక్కువగా లభించే ఊపిరితిత్తులకు సోకుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 1.3 మిలియన్ల మంది క్షయ వ్యాధితో చనిపోతున్నారు. ప్రతిరోజూ 5వేల మంది క్షయ వ్యాధికి గురవుతున్నారు. సంవత్సరానికి 18 లక్షల మందికి క్షయ సోకుతుంది. భారత్‌లో సుమారు 34 లక్షల మంది క్షయ వ్యాధితో బాధపడుతున్నారు. అలాగే మన దేశంలో ప్రతి మూడు నిమిషాలకు ఇద్దరు, సగటున రోజుకు దాదాపు పదిహేను వందల మంది, సంవత్సరానికి ఐదు లక్షల మంది క్షయ వ్యాధితో మరణిస్తున్నారు. మన రాష్ట్రంలో 15 నిమిషాలకు ఒక క్షయ రోగి మరణిస్తున్నాడు. ప్రపంచంలో చైనా తర్వాత భారతదేశంలోనే అత్యధికంగా క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వైద్య విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ మరణాల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉన్నది.

మైకో బ్యాక్టీరియం ట్యూబర్‌ ‌క్యులోసిస్‌ అనే బ్యాక్టీరియా వలన ఈ వ్యాధి కలుగుతుంది. ముఖ్యంగా శ్వాసకోశాలు ఈ వ్యాధికి గురి అవుతాయి. ఈ వ్యాధి ఉన్నవారికి రెండు వారాలకు మించి ఎడతెరిపి లేని దగ్గు, అలసిపోవడం, జ్వరం, శ్లేష్మంతో కూడిన దగ్గు, ఆకలి మందగించడం, బరువు తగ్గటం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ లక్షణాలు నెమ్మదిగా కొంతకాలానికి కనపడతాయి. రోగి దగ్గినప్పుడు, ఉమ్మినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు  క్రిములు గాలిలోకి సన్నని తుంపర్ల లాగా వ్యాపిస్తాయి. ఈ క్రిములు వివిధ మాధ్యమాల ద్వారా మనం తినే ఆహారంలోకి తాగేనీరు, పాలలోకి చేరుతాయి. అందువలన వ్యక్తిగత పరిశుభ్రత చాలా చాలా ముఖ్యం.
క్షయ వంశపారంపర్యమైన వ్యాధి కాదు. ఎక్స్-‌రే ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు. గాలి, వెలుతురు తక్కువగా ఉండే గృహాలలో నివసించేవారు, పోషకాహార లోపం ఉన్నవారు, తరచూ ఈ వ్యాధికి చేరువలో ఉండే వారికి, మధుమేహ వ్యాదిగ్రస్తులలో ఎయిడ్స్ ‌వ్యాధిగ్రస్తులు ఈ వ్యాధికి గురి కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
క్షయ వ్యాధి సాధారణంగా బీదవారిలో అత్యధిక జనసమ్మర్థం(సినిమా హాల్‌, ‌జాతరలు) ఎక్కువగా ఉన్నచోట్లలో నివసించే వారిలో, మురికివాడల్లో నివసించే వారిలో అధికంగా ఉంటుందని పరిశీలనలో వెల్లడైంది. ఈ సూక్ష్మజీవి నిద్రాణంగా ఉండిపోయి వారిలోని వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడినప్పుడు విజృంభిస్తుంది. క్షయ రోగులు దగ్గేటప్పుడు దట్టమైన గుడ్డను నోటికి అడ్డుగా పెట్టుకోవాలి. ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేయరాదు.  అలాగే ఎయిడ్స్ ఉన్న వ్యక్తులకు వొచ్చే అవకాశ వ్యాధులలో ఈ వ్యాధి ప్రదానమైనది. ఎయిడ్స్ ‌వ్యాధిగ్రస్తులు 3వ వంతు మంది కేవలం క్షయ వ్యాధితోనే మరణిస్తున్నారు. ముఖ్యంగా హెచ్‌ఐవి కారణంగా, పోషకాహార లోపం వల్ల, వ్యాధి నిరోధక శక్తి తగ్గి వ్యాధి లక్షణాలు త్వరగా కనిపిస్తాయి. కాబట్టి క్షయ వ్యాధిని తొలిదశలోనే గుర్తిస్తే వ్యాధిని నయం చేయవచ్చు.

- Advertisement -

అనుమానం ఉన్న వారికి డిఎంసిటెడ్‌ ‌మైక్రోస్కోపీ కేంద్రాల ద్వారా మన రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో, వైద్య కళాశాలలలోనూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనూ క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తారు. మన దేశంలో 1962లో జాతీయ క్షయ వ్యాధి నివారణ కార్యక్రమం ప్రారంభమైంది.
వైద్యుని సలహా ప్రకారం నివారణ ఔషధాలు క్రమబద్ధంగా తీసుకోవడం, మంచి పోషక ఆహారం తినడం, మంచి ఆరోగ్యకరమైన పరిసరాలలో నివసించడం వంటి చర్యలు ఈ వ్యాధిని నయం చేయడానికి సహాయపడుతాయి. ఈ వ్యాధి నుండి రక్షణ కొరకు చిన్న పిల్లలకు బిసిజి టీకాలు ఇప్పించాలి. వ్యాధిగ్రస్తులు మద్యం సేవించడం, పొగ త్రాగటం మానుకోవాలి. వాతావరణ కాలుష్యానికి దూరంగా ఉండాలి. డాక్టర్‌ ‌సలహా లేకుండా ఎట్టి పరిస్థితిలోనూ  మధ్యలో మందులు మానివేయరాదు.
image.png
నెరుపటి ఆనంద్‌
ఉపాధాయులు
టేకుర్తి

Leave a Reply