Take a fresh look at your lifestyle.

మారాల్శింది ఎవలు?

“జనంల కల్శిపోయే సర్కార్‌ ‌బళ్ళళ్ళ ఏం సౌలతులు జేయకుంట తీరొక్క బళ్ళు బెట్టుడు కుటిలవాజితనం గాదా! కులాల పేరుమీద,మతాల పేరు మీద గురుకులాలు బెట్టి జనంల చీలికలు తెచ్చుడు చిన్నుపాయం కాదు. గింతగనం సర్కార్‌ ‌సదువుల, సర్కార్‌ ‌బళ్ళను సర్కారే బొంద వెట్టె మోపు జేత్తాంటె సర్కార్‌ ‌బడి పంతుళ్ళ ఉద్దెమాలేమయినయి?యేడున్నరు! ప్రధాన సంఘాలను చీలికలు పేలికలు జేషే సర్కార్‌ ‌కుట్రల భాగం పంచుకుంట కులం, క్యాడర్‌  ‌పేర్ల మీద పొల్లు పొల్లు సంఘాలు బెట్టుడు పదవుల పేరు మీద పోరళ్ళ సదువులకు దూరమవుడు తప్ప ఇంకోటి కాదు. సంఘాల నాయకులల్ల సూత సామాజిక బాధ్యత,ఉద్యమ నేపథ్యం జరంత పలుసనయినయనే జెప్పాలె!”

Maralsindhi yevalu article prajatantra news

మందలకేలి యేర్పడితె మనోడెట్లయితడు!? మందబలం ముందు ఎంతమంది బలమైనా బలాదూర్రా వారీ! అని సుద్దులు జెప్పేటోళ్ళు,వుత్త జెప్పెటోళ్ళుగనే మిగులుతె కుంటి గుర్రం సూత లేషి ఈడ్షీషి తంతది. మనిషనెటోడు మందిల మెసులుతె లెక్క గని లేకుంటె దేనికి గొరగాడని పెద్దోళ్ళు జెప్పిన ఇగురం మరిషినం.ఊర్ల ఉత్తరమత్తె సదివి జెప్పేది యెవలయా అంటె ఊర్లున్న బడి పంతులే! గుళ్ళెనే కాదు బళ్ళె వుండేది సూత దేవుడే అనుకునేటంత ఇజ్జత్‌ ‌వుండేది. ఊర్లున్న నిషానీలందరి రాతపూతలకు దిక్కైనా మొక్కైనా బడి పంతులే! గుళ్ళెకైనా,బళ్ళెకైనా కులం మతాలను చెప్పుల్లెక్కన బయట్నే ఇడిషిపోతం!బడన్నా,బడి పంతులన్నా ఇలువ గీ తీరిగుండేది.మందిలుంటె ఒకలి బాధలొకలర్సుకుంటరు. మాట సాయమన్న ఇటటుంటది.ఊర్లె తోని,ఊర్లె తీరొక్క పనులు జేషే మనుషులతోని బళ్ళ,బడి పంతుళ్ళ బంధాలు దూరం గాబట్టి శానేండ్లే అయితాంది.

ప్రజాసంఘాలంటే ప్రజలతో నుండేటియి. ప్రజలలో కల్శిపోయి గాళ్ళ మంచి చెడు అర్సుకునేటియి.పంతుళ్ళు,వాళ్ళసంఘాలు సూత ప్రజల జీవితాలతోని కలుపుకపోయి వుండేది.సదూకునే పోరల్లయినా,పంతుళ్ళయినా జనంల భాగమని అనుకునేది. ఎవ్వలికి అన్నాయం జరిగినా జనాన్ని కూడగట్టి ఎదురుబడి కొట్లాడేది.రైతులకు సాలినన్ని గంటలు కరంట్‌ ‌రానప్పుడు,ఇత్తనాలు కల్తీయని తేలినప్పుడు,గిట్టుబాటు ధర కిందిమీదయినప్పుడు,కట్నం సావులప్పుడు,సదూకునే అమాయికపు కాలేజ్‌ ‌పిలగాండ్లను ఎన్‌ ‌కౌంటర్‌ ‌పేరుమీద కాల్షి సంపినప్పుడు,గ్యాస్‌,‌పిట్రోల్‌ ‌ధరలు పెరిగినప్పుడు, బస్సు,రైలు టెకెట్ల ధర పెరిగినప్పుడు, ఊర్లెకూర్లు మర్లబడి రోడ్డెక్కినప్పుడల్లా ముందుండి నడిషి,నడిపించిన దాంట్ల పంతుళ్ళ సంఘాల పాత్ర బాగనే వుండేది. ఉద్దెమ పార్టీయని నమ్మినోళ్ళను నాశనం జేషే కతలం వడి ,కుటిలబాజి సర్కార్‌. ‌

సంఘాల త్యాగాలతోని గద్దెక్కితిమన్న సోయి మర్శిపోయి సంఘాలను ఇసప్పురుగులోలె జూడబట్టె! పంటికిందరాయి గొంతుకత్తదన్న గుబులై సంఘాలను అడ్డం నిలువు చీలగొట్టే కతలు వడె! పదవులాశ బెట్టి ఉద్యోగ సంఘాల నాయకులను ఉద్యమనాయకత్వానికి దూరం జేషె. పెద్ద నాయకులు సూత పదవులాశ పెరిగి సర్కార్‌ అం‌టకాగే పనులు జేసుకుంట లాబీయింగ్‌లను నమ్ముకునేకాడికచ్చి ఇలువల్ని అమ్ముకునే కాడికచ్చె! సంఘాల నాయకత్వం,సంఘాల పనితీరు జరంత పలుసనాయె!పంతుళ్ళన్నా,ఉద్దోగులన్న జనంల ఇజ్జత్‌ ‌లేకుంట జేసుకున్నరు.ఊర్లున్న సర్కార్‌ ‌బడి ‘‘మాదికాదు,పంతుళ్ళు సూత మావోళ్ళు కాద’’నే కాడికి ఊర్లచ్చె! ఊర్లెబళ్ళు,బడి పంతుళ్ళు పల్సనయిన ఇచ్చంత్రం మునుపు గిట్ల లేకుండె!సర్కార్లెప్పుడు ఆళ్ళ కోసం, ఆళ్ళ పబ్బం గడుపు కోనీకి గిసోంటి మాయలు గిట్ల జేత్తదని తెల్శిందేనాయె! సర్కార్‌ ‌సంకన జేరేటోళ్ళకన్న గిది తెల్సుకునే ఇంగితముండాలె కదా!ఎంగిలి మెతుకు)సొంటి పదవులకు ఆశ పడితే,గుండెల జేర్చుకునే జనం దూరమయితరన్న సోయన్న వుండాలె కదా!.

జనంల కల్శిపోయే సర్కార్‌ ‌బళ్ళళ్ళ ఏం సౌలతులు జేయకుంట తీరొక్క బళ్ళు బెట్టుడు కుటిలవాజి తనం గాదా!కులాల పేరుమీద ,మతాల పేరు మీద గురుకులాలు బెట్టి జనంల చీలికలు తెచ్చుడు చిన్నుపాయం కాదు. గదాంట్ల కోడి చికెన్‌ ‌పెడ్తానం! అదిజేత్తానం! ఇదిజేత్తానమని జనంల బగ్గ పచారం జేసుకునుడు సూత కుట్రవాజికతలే! సర్కార్‌ ‌బళ్ళ గురించి గిట్లెందుకు జెప్పరు? మా బళ్ళు బాగున్నయి,మా పంతుళ్ళు తోపులని జెప్పాలె కద!గిట్ల జెప్పని సర్కార్‌ ‌సర్కార్‌బళ్ళను మింగే కతలు పడుడు గాదా! ఎలచ్చన్‌ ‌మానిపెస్టోలన్ని మళ్ళ సర్కార్ల కచ్చేందుకు కోసమే రాత్తాండ్లు గని ఇంకోటి గాదు. సర్కార్‌ ‌బళ్ళను బొందవెట్టే పనిల బడ్డ తెలంగాణ సర్కార్‌ ‌గద్దెక్కినప్పుడున్న బళ్ళు సగంల సగం బొందవెట్టిండ్లు. గిప్పుడు మిగిలినయే ఇరువై ఆరు వేలంటె వాటిని సూత పొతం బెట్టె పనిలున్నది సర్కార్‌. ‌కడుపులిషెం,నోట్లె తీపి బెట్టుకునే సర్కార్‌ ‌పంతుళ్ళ నౌఖర్ల ఖాళీలను నింపుడు బందువెట్టింది. సర్కార్‌ ‌బడిసదువులు బాధ్యతల నుంచి తప్పిచ్చుకునే యవారంలున్నది. ఖుల్లాగా గిదే ముచ్చట జెప్పిన పెద్దాయిన ప్రయివేట్‌ ‌బళ్ళే సదువులు బాగా జెప్తయనే కాడికచ్చె! ‘‘కనీస ఇలువలు లేకుంటున్న సర్కారే’’బడిపిలగాండ్లకు ఇలువలు తక్కు వైతానయని జెప్పబట్టె! సాములు పీఠాధిపతులు, పోలీసుపెద్దలతోని కొత్తఇలువలు తయారుజేయించి బడి పుస్తకాలల్ల బెట్టిత్తడట! సర్కార్‌ ‌బళ్ళ సదువులను నాశనం పదారు వాళ్ళు జేషే కతలు పడుడంటె గిదే!
గింత గనం సర్కార్‌ ‌సదువుల,సర్కార్‌ ‌బళ్ళను సర్కారే బొంద వెట్టె మోపు జేత్తాంటె సర్కార్‌ ‌బడి పంతుళ్ళ ఉద్దెమాలేమయినయి?యేడున్నరు! ప్రధాన సంఘాలను చీలికలు పేలికలు జేషే సర్కార్‌ ‌కుట్రల భాగం పంచుకుంట కులం, క్యాడర్‌ ‌పేర్ల మీద పొల్లు పొల్లు సంఘాలు బెట్టుడు పదవుల పేరు మీద పోరళ్ళ సదువులకు దూరమవుడు తప్ప ఇంకోటి కాదు సంఘాల నాయకులల్ల సూత సామాజిక బాధ్యత,ఉద్యమ నేపథ్యం జరంత పలుసనయినయనే జెప్పాలె! ఉద్దెమాలంటె ముందు వరుసనుండేది పంతుళ్ళే అనే ముచ్చట పాతవడ్డది.

ప్రజలు, ప్రజాసంఘాలు,ప్రజా ఉద్యమాలు పంతుళ్ళతోనే వుండిన రోజులిప్పుడు కానత్తలేవు.ఎమర్జెన్సీ చీకట్ల బుద్ధిజీవులందరిని చెట్లగ్గట్టి పిట్టలోలిగె కాల్షి సంపిన నియంత రాజ్యంపైన పంతుళ్ళ తరపున గెలిషిన ఎమ్మెల్సీ నీలం రాంచంద్రయ్య నడిపిన ఉద్దెమం.చిలకలగుట్ట అడివిల ఆయన త్యాగం మరిషేదేనా!విద్యార్థుల,రైతుల ఉద్దెమాలకు ఎంబడుండి నడిపించిన పంతుళ్ళంటే జనానికి పాణంగుండె! గిప్పుడేం గావాలె! జనం యెంబడుంటె ఓడిన వుద్దెమం లేదని ఆర్టీసోళ్ళు జెప్పిన పాఠం మళ్ళోసారి సదువుకోవాలె!సర్కార్‌ ‌బడి పంతుళ్ళంత జనజీవన స్రవంతిల కల్వాల్శిన అవుసరమున్నదని తీర్మానం జేసుకోని నెత్తిన బెట్టుకోవాలె! చీలికలు పేలికలన్ని రంగు రూపుల లెక్కల్నయినా కలిపి కుట్టుకునే ఇంతెజాం జేయాలె! సామాజిక బాధ్యతలుండే ఒకేఒక్క నౌకరి పంతుళ్ళదని మళ్ళొక్కసారి యాది జేసుకోవాలె! ప్రజాసంఘాలుజేషే ఎసోంటి ఉద్దెమమైనా ముందు వరుసల వుండాలని కొత్త ఎజెండాతోని జెండాలెత్తాలె! సూడ్రాబయ్‌! ఇ‌క్రమార్క్ ‘‘ఇప్పటిదాంక ఉద్యోగుల, పంతుళ్ళ గురించి ఇవరాలింటివి గదా’’! మునుపు ఉద్దెమాలళ్ళ ముందుండే పంతుళ్ళు గిప్పుడు గిట్లెందుకు మారిండ్లు!? సామాజిక బాధ్యతలు మరిషిన పంతుళ్ళ పనితీరు పైన జనం అభిప్రాయం గిట్లెందుకు మారింది? గీ ప్రశ్నలకు జవాబులు జెప్పాలె. ‘‘అని ఇచ్చంత్రాలాడ బట్టిన భేతాళుని శవాన్ని యెప్పటి తీరిగనే భుజానేసుకున్నడు ఇక్రమార్కుడు. భేతాళా! ఇను, ‘‘పంతుళ్ళైనా, ఉద్యోగులైనా సామాజిక బాధ్యతలు,విలువలు మరిషిపోవుడనే కొత్తపని సంస్క•తికి అలవాటవడుతోని గిట్లయిండ్లు. ఇంక ప్రజలను యాది మరిషిన ఉద్దోగులు, పంతుళ్ళకు ప్రజలు దూరమైండ్లు’’ అని మనుసులనుకుంట ఆలోచించుకుంట ఎప్పటిలాగనే… నడ్వబట్టిండు…నడ్వబట్టిండు
– ఎలమంద, తెలంగాణ

Leave a Reply