Take a fresh look at your lifestyle.

ఛత్తీస్‌ఘఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం

  • మందుపాతరతో పోలీస్‌ ‌బలగాల మినీ వాహనం పేల్చివేత
  • 11 మంది డిఆర్‌జి జవాన్‌లు మృతి – నలుగురు జవాన్‌లకు తీవ్రగాయాలు
  • రాయ్‌పూర్‌ ‌హాస్పిటల్‌కి తరలింపు

భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : ‌ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలో మావోయిస్టులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. కూంబింగ్‌ ‌నిర్వహించుకుని మినీ వాహనంలో జవాన్లు తిరిగి వొస్తుండగా పసిగట్టిన మావోయిస్టులు వాహనం మందు పాతర అమర్చిన ప్రాంతానికి చేరుకోగానే విచక్షణా రహితంగా పేల్చివేసారు. ఈ సంఘటనలో వాహనం ఒక్కసారిగా తునాతునకలయింది. వాహనంలో ప్రయాణిస్తున్న 10 మంది జవాన్‌లతో పాటు డ్రైవర్‌ ‌మృతి చెందారు జవాన్‌ల మృతదేహాలు తునాతునకలై చెల్లచెదురయ్యాయి. మావోయిస్టు పార్టీని ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వ బలగాలు కూంబింగ్‌ ‌నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే బుధవారం నాడు ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా ఆరెన్‌పూర్‌ అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ ‌రిజర్వ్ ‌గార్డులు(డిఆర్‌జి) మావోయిస్టులు ఆ ప్రాంతంలో ఉన్నారనే పక్కా సమాచారంతో కూంబింగ్‌ ‌నిర్వహించారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టి తిరిగి వొస్తున్న డిఆర్‌జి బలగాల మినీ వాహనాన్ని పసిగట్టిన మావోయిస్టులు పక్కా వ్యూహంతో అమర్చి ఉన్న మందు పాతరలను ఒక్కసారిగా పేల్చివేసారు. దీనితో రోడ్డు సుమారు నాలుగు అడుగుల మేర గుంత ఏర్పడింది. మినీ వాహనంలో ప్రయాణిస్తున్న పది మంది డిఆర్‌జి జవాన్‌లు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్‌ ‌మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య పదకొండుకు చేరింది. గాయపడిన మరికొంతమంది జవాన్‌లను రాయ్‌పూర్‌ ‌హాస్పిటల్‌కి తరలించారు. మృతి చెందిన డిఆర్‌జి బలగాల వివరాలు, హెడ్‌ ‌కానిస్టేబుల్‌ ‌జోగా సోధి, హెడ్‌ ‌కానిస్టేబుల్‌ ‌మున్నా రామ్‌ ‌కడ్తి, హెడ్‌ ‌కానిస్టేబుల్‌ ‌సంతోష్‌ ‌తమో, కానిస్టేబుల్‌ ‌దుల్గో మాండవి, కానిస్టేబుల్‌ ‌లక్ష్ము మార్కం, కానిస్టేబుల్‌ ‌జోగా కవాసి, కానిస్టేబుల్‌ ‌హరిరామ్‌ ‌మాండవి, సైనికుడు రాజు రామ్‌ ‌కర్తమ్‌, ‌సైనికుడు జైరామ్‌ ‌పొడియం, సైనికుడు జగదీష్‌ ‌కవాసి, డ్రైవర్‌ ‌ధనిరామ్‌ ‌యాదవ్‌లను మందుపాతరతో వాహనాన్ని పేల్చివేయటంతో మృత్యువాత పడ్డారు.

లేఖ విడుదల చేసిన వారంలోనే ఈ సంఘటన
గత వారం రోజుల క్రితమే మావోయిస్టు పార్టీ ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలో ప్రభుత్వాలను హెచ్చరిస్తూ లేఖ విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీలను అణచివేయడానికి పోలీస్‌ ‌బలగాలతో అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ ‌నిర్వహిస్తున్నారని ఇటువంటి చర్యలు మానుకోవాలని హెచ్చరికలు జారీ చేసి వారం రోజులు గడవకముందే మావోయిస్టులు మందు పాతర పేల్చి 11 మంది డిఆర్‌జి బలగాలను పొట్టన పెట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి భారీ సంఘటనలకు మావోయిస్టులు పాల్పడలేదు. 2017 ఏప్రిల్‌లో 24 మందిని పోలీస్‌ ‌బలగాలను పొట్టన పెట్టుకున్నారు. 2018 మార్చిలో 9 మంది సిఆర్‌పిఎఫ్‌ ‌బలగాలను ,ఫిబ్రవరిలో ఇద్దరి బలగాలను మావోయిస్టులు హతమార్చారు. 2021 ఏప్రిల్‌లో పోలీస్‌ ‌బలగాలే మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 22 మంది భద్రత సిబ్బంది మృతి చెందారు. ఈ సంఘటన సుకుమా, బీజాపూర్‌ ‌జిల్లాల సరిహద్దులో జరిగింది. ప్రశాంతగా అటవీ ప్రాంతం మళ్ళీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మందుపాతర భారీ శబ్దం రావడంతో ఆ ప్రాంతంలో ఉన్న అమాయక గిరిజనులు తీవ్ర భయాందోళన చెందారు. డిఆర్‌జి బలగాలు ప్రయాణిస్తున్న మినీ వాహనం తునాతునకలైంది. డిఆర్‌జి బలగాలు కూడ ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. ఛత్తీస్‌ఘఢ్‌ ‌పోలీస్‌ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన డిఆర్‌జి బలగాలను గుర్తించే పనిలో ఉన్నారు.

ఛత్తీస్‌ఘఢ్‌ ‌సిఎంను వివరాలు అడిగి తెలుసుకున్న కేంద్ర హోమ్‌ ‌శాఖ
ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా ఆరెన్‌పూర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చి 11 మంది డిఆర్‌జి జవాన్‌లను పొట్టనపెట్టుకున్న సంఘటనపై కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌షా ఛత్తీస్‌ఘఢ్‌ ‌ముఖ్యమంత్రికి నేరుగా ఫోన్‌ ‌చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన డిఆర్‌జి బలగాలను మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. అంతేకాకుండా అటవీ ప్రాంతంలో రెచ్చిపోతున్న మావోయిస్టులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు తెలుస్తుంది. మృతి చెందిన డిఆర్‌జి జవాన్‌లకు హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

Leave a Reply