Take a fresh look at your lifestyle.

చీలిక దిశగా మావోయిస్ట్ పార్టీ ??

“తెలంగాణలో మావోయిస్ట్ ఉద్యమం బలహీనపడి, తెలంగాణ ఉద్యమాన్ని మావోయిస్ట్ శక్తుల చేతుల నుండి జారవిడిచి, పరోక్షంగా ఇతర శక్తులు వర్గ శత్రువులైన బూర్జువా పార్టీ నాయకత్వంతో వేదికలు పంచుకుని, అధికార పార్టీలో బందీలవుతున్నా గణపతి పార్టీ ని కాపాడడంలో ఘోరంగా విఫలమయ్యారని తీవ్ర విమర్శలున్నాయి. నాయకత్వ మార్పిడి గతంలోనే జరిగి ఉన్నట్లయితే తెలంగాణాలో మావోయిస్ట్ ‌పార్టీకి ఈ గతి ఉండేది కాదని బలమైన భావన ఉంది.”

  • రుగ్మతలతో బాధ పడుతున్న సీనియర్లు
  • వేర్వేరుగా ఉంటేనే ఉత్తమమన్న ఆలోచన
  • తెలంగాణ,ఆంధ్ర క్యాడర్ తో ఇతర ప్రాంతాల క్యాడర్ విబేధాలు

సిపిఐ (మావొయిస్ట్) పార్టీ పూర్వ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ళ లక్ష్మణ రావు లొంగుబాట పట్టారని వచ్చిన వార్త ప్రాధాన్యత బట్టి, దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అని పేర్కొనే మావోయిస్ట్ విప్లవోద్యమం తదనంతర పరిణామాలెలా ఉంటాయన్న అంశం ఊహకందనిదేమీ కాదు. నిషేధిత మావోయిస్ట్ పార్టీ కి దాదాపు ఒకటిన్నర దశాబ్దంపాటు నాయకత్వం వహించి 70వ దశకంలో పడిన కీలక వ్యక్తి గణపతి, ముఖ్యమంత్రి కె సి ఆర్ కు సన్నిహితులైన పార్టీ మధ్యవర్తుల చొరవ కారణంగా తెలంగాణ పోలీసులకు లొంవడానికి సిద్ధంగా ఉన్నట్లు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ పరిణామానికి ముందే మావోయిస్ట్ పార్టీ నాయకత్వం మార్పిడిపై కొంత సమాచారం వెలువడినా, గణపతి స్థానంలో నంబాళ్ళ కేశవరావు ఎలియాస్ బసవరాజు విప్లవ పార్టె నాయకుడుగా నియమితులైనట్లు ప్రకటన వెలువడేవరకూ ప్రజా దృష్టిని ఆకర్షించలేదు. దీర్ఘకాలిక అనారోగ్యం వలన గణపతి స్వచ్ఛందంగా పార్టీ నాయకత్వం నుంచీ వైదొలగినట్లు మాత్రం ప్రకటన వెలువడింది. విప్లవ పార్టీ అత్యంత క్లిష్టమైన అణచివేత దశలో ఉన్నప్పుడు గణపతి అసమాన నాయకత్వ పటిమ వలన ఒడిదుడుకులు సమర్ధంగా ఎదుర్కొన్నదని ప్రకటనలో ప్రశంసల జల్లు కురవడం అంతర్గతంగా విభేదాలపై ఎటువంటి అనుమానాలు బయటపడకుండా కప్పిపుచ్చాయి. అయితే ఈ ఆకస్మిక పరిణామాలపై భద్రతా సిబ్బందికీ అశ్చర్యం కలిగించిన మాట వాస్తవం.

కేంద్ర కమిటీలో 19 మంది సభ్యులు వివిధ రుగ్మతలవలన బాధపడుతున్నందువల్ల నాయకత్వ మార్పిడి మార్పు సహజమన్న భావన కలిగింది కానీ, ఎటువంటి ఇతర ఆలోచనకూ తావు లభించలేదు. రుగ్మతలనెదుర్కోంటున్న సీనియర్ నాయకుల స్థానాలను యువతతో భర్తీ చేసి కొత్తవారి సమర్ధతను ఉపయోగించుకుని, అనుభవజ్ఞులైన గణపతి వంటి సీనియర్ల సలహాలు తీసుకుంటూ యువనాయకత్వంలో ప్రజా పోరాటంలో మరింత వేగంగా అడుగులు వేయాలని 2017 ఫిబ్రవరిలో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో నిర్ణయించి సీనియర్లకు స్వచ్ఛంద విరమణ అవకాశం కల్పించారు. గణపతి సుదీర్ఘ నాయకత్వానికి అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యమే, కీలక పదవుల్లో ఉన్న వృద్ధులను బాధ్యతల నుంచీ తప్పించాలన్న ఆ తీర్మానం ముఖ్యోద్దేశమని, అందువల్లనే అరణ్యనేపథ్యంలో జరిగే ఉద్యమ నాయకత్వం నుంచీ వృద్ధులను తొలగించాలని కేంద్ర కమిటీ నిర్ణయించిందని తెలుస్తోంది.

ఉద్యమంలో పెద్దరికానికి, అనుభవానికి గౌరవం ఇస్తున్నట్లు, వారి సేవలను అందరి మద్దతుతో ఇతర మార్గాల్లో ఉపయోగించుకుంటున్నట్లు నమ్మకం కలిగించడమే కేంద్ర కమిటీ వ్యూహమని పేర్కొంటున్నారు. నాయకత్వంలో తమకెక్కడ పోటీ అవుతారేమోనన్న అనుమానంతో సీనియర్లయిన 70 ఏళ్ళ పైబడిన సమర్ధులకు విశ్రాంతి ఇచ్చే నెపంతో తప్పించే బి జె పి సూత్రాన్ని మావోయిస్టులు కూడా ఎంచుకున్నట్లు అనిపిస్తొంది. సామ్రాజ్యవాద భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఐ ఎంఎల్(పీపుల్స్ వార్), మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండీయా తదితర విప్లవ ఉద్యమ పోరాట శక్తులన్నింటినీ ఏకం చేసి బలమైన నిషిద్ధ శక్తి సిపిఐ (మావోయిస్ట్)ను ఏర్పరచడంలో గణపతి నాయకత్వానికి మరింత బలం చేకూరింది. లక్ష్యాన్ని పక్కన పెడితే సిద్ధాంతపరంగా, పార్టీని మిలిటరీ శక్తిమాదిరిగా నడిపే విషయంపై వృద్ధాప్యం, అనారోగ్యం ఎదుర్కోంటున్న సిపిఐ మావోయిస్ట్ తెలంగాణ నాయకునికి, తెలంగాణేతర పూర్వ ఎంసిసిఐ నాయకత్వం మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడం మొదలైంది. గణపతి నాయకత్వ నిర్ణయాలవలన తెలంగాణ పార్టీలొ వ్యూహాత్మక తిరోగమనం మొదలైంది. విభిన్న అలోచనల కలయిక కంటే ఇరు వర్గాలు వేర్వరుగా ఉంటేనే ఉత్తమమన్న్, పూర్వం బద్ధ వ్యతిరేకులుగా ఉన్న శక్తుల కలయిక కేవలం ఒక అవకాశ ఒప్పందమేనని, వేరువేరుగానే తమ లక్ష్యం సాధించగలమని అభిప్రాయం ఏర్పడింది. ఇదిలా ఉండగా కాలంచెల్లిన సిద్ధాంతాన్ని అంటిపెట్టుకున్ననాయకత్వం, నవతరం ప్రతినిధుల మధ్య పొడసూపిన అభిప్రాయ భేదాలు ఒకరి తప్పొప్పులను మరొకరు ఎత్తిచూపే స్థితికి చేరుకుంది. రానురాను తెలంగాణేతర నాయకులు, కార్యకర్తలలో కలహాలు చెలరేగి అంతర్గత క్రమశిక్షణ లోపించినా, వయసు పైబడ్డ గణపతి వారిని కట్టడి చేసే శక్తీపట్టు కోల్పోయారని సమాచారం. కేడర్ పై భద్రతాదళాల అణచివేత చర్యలను ఎదుర్కొనే ధీటైన ఎత్తుగడ, అసంఖ్యాకంగా ఉన్న పోటీ సత్తా,నిధుల సేకరణ , అంతర్గత క్రమశిక్షణ వృద్ధ నాయకత్వానికి సవాళ్ళుగా నిలిచాయి.

ఒకప్పుడు ఉద్యమానికి ఊపిరి అయిన తెలంగాణలో మావోయిస్టులకు పూర్వ వైభవం తేవడానికి అవసరమైన ప్రక్రియ నిర్వహణకు గణపతి వయసు, అనారోగ్యం సహకరించక పోవడంవల్లనే ఆయనను బాధ్యతల నుంచీ కేంద్ర కమిటీ తప్పించిందని, అసలు ఈ పని ఎప్పుడో చేసి ఉండవలసిందన్న అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తున్నది. తెలంగాణలో మావోయిస్ట్ ఉద్యమం బలహీనపడి, తెలంగాణ ఉద్యమాన్ని మావోయిస్ట్ శక్తుల చేతుల నుండీ జారవిడిచి, పరోక్షంగా ఇతర శక్తులు వర్గ శత్రువులైన బూర్జువా పార్టీ నాయకత్వంతో వేదికలు పంచుకుని, అధికార పార్టీలో బందీలవుతున్నా గణపతి పార్టీ కాపాడడంలో ఘోరంగా విఫలమయ్యారని తీవ్ర విమర్శలున్నాయి. నాయకత్వ మార్పిడి గతంలోనే జరిగి ఉన్నట్లయితే తెలంగాణలో మావోయిస్ట్ పార్టీకి ఈ గతి ఉండేది కాదని బలమైన భావన ఉంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక నాడు తీవ్రవాదులకు భారతదేశంలోనే కోట లాంటి తెలంగాణ ప్రాంతంలో 2006-2007 సంవత్సరంలోనే మావోయిస్టుల కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయన్న విషయం అందరికీ తెలిసిందే. దానికితోడు ఈ ప్రాంతంలో భూస్వామ్య విధానం విచ్చిన్నం కావడం, రాష్ట్రాభివృద్ధి నేపథ్యంలో మావోయిస్ట్ ఉద్యమంపై తీవ్ర ప్రభావం చూపింది. పార్టీలో నాయకత్వ మార్పువాదులకు నాయకత్వం వహించి, తనకు పోటీగా తయారవుతున్నట్లు భావించి, పశ్చిమ బెంగాల్ లో ప్రఖ్యాతి గాంచిన మల్లోజు కోటేశ్వర రావు ఎలియాస్ కిషన్ జి మరణానికి గణపతి సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి. ఇందుకు తోడు వయసుపైబడిన తనను తొలగించాలని పట్టుబడుతున్న పార్టీలో తెలంగాణేతర బలమైన వర్గం తీవ్రంగా ఒత్తిడి చేసిందని సమాచారం. వయసుమళ్ళిన వారిని కీలక బాధ్యతలున్న నాయకత్వం నుంచీ తప్పించాలన్న తీర్మాన ప్రతిపాదన కూడా ఈ వర్గమ్నుంచే వచ్చిందట. అంతేకాక పార్టీలో కీలక పదవులు, ఆయుధాలు, నిధి వసూళ్ళ నిల్వలు అన్నీ తెలంగాణ, ఆంధ్ర కేడర్ చేతుల్లోనే ఉండడం ఇతర ప్రాంతాలవారికి ఆగ్రహం కలిగించిందనికూడా వాదనలు వినిపిస్తున్నాయి. అసమానతలను వ్యతిరేకిస్తున్న పిపిడబ్ల్యు లో ఈ అభిప్రాయం చీలిక తెచ్చిందని తెలుస్తోంది.

నూతన ప్రజాస్వామ్య విప్లవ లక్ష్యంతో పార్టీ బలపడడానికి, అన్ని గ్రూపులను ఏకం చెయ్యడానికి గణపతి శక్తి సామర్ధ్యమే కారణమని అంగీకరిస్తున్నా, ప్రజా నద్దతు కూడగట్టడంలో, అన్ని సంస్థలను , భౌగోళిక సరిహద్దులను ఏకం చెయ్యడంలో, విద్యావంతులను పార్టీ లో రిక్రూట్ చేయ్యడం లో ఆశించిన ఫలితాలు దక్కలేదని వాదనలూ వినిపిస్తున్నాయి. అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోవడానికి అననుకూల పరిస్థితులు ఉన్నాయని, పార్టీ కార్యక్రమ నిర్మాణ లోపంతోపాటు నాయకత్వ లోపమని ఆయన కూడా అంగీకరించినట్లు పార్టీ డాక్యుమెంట్లలో ఉన్నట్లు పేర్కొంటున్నారు సరళీకృత విధానం, డిజిటలైజేషన్, రాజకీయ నిర్నయాలు ప్రభుత్వాలకు బలం చేకూర్చి మావోయిస్టులను బలహీనపరచి, మరింత కుంచించుకుపోయేట్లు చేసిందని, దానికితోడు ఎత్తుగడ వ్యూహాలలో నాయకత్వ తప్పిదాలు మరింత ఉద్యమాన్ని దెబ్బతీసాయని, అందువల్లనే కోలుకోలేని విధంగా పిపిడబ్ల్యు నష్ట పడిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వయోభారం అనారోగ్యం కంటే నాయకత్వ మార్పు, గణపతి లొంగుబాటుకు దారి తీసిందని, ఈ పరిణామాలు పార్టీ చీలికకు దారి తీయవచ్చునని విశ్లేషిస్తున్నారు.

Leave a Reply