Take a fresh look at your lifestyle.

మావోయిస్టు అగ్రనేత హరిభూషన్‌, ‌సారక్క మృతి

  • కోవిడ్‌తో మృతి చెందారని ధృవీకరించిన మావోయిస్టు పార్టీ
  • లేఖ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌

తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యులు హరిభూషణ్‌ అలియాస్‌ ‌యాప నారాయణ దండకారణ్యంలోని మాడ్‌ ‌డివిజన్‌, ఇం‌ద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్ధబోయిన సారక్క అలియాస్‌ ‌భారతక్కలు ఇరువురు కొరోనా లక్షణాలతో బాధపడుతూ మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ ‌గురువారం నాడు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. హరిభూషన్‌ ‌చాలా కాలంగా కొనసాగుతున్న బ్రాంకైటీస్‌, అస్తమా వ్యాధులు తోడై 21- జూన్‌ 2021‌న ఉదయం 9గంటల సమయంలో మృతిచెందారని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా హరిభూషన్‌ ‌కోవిడ్‌తో మృతి చెందాడని అనేక వార్తలు వొచ్చాయి. పోలీసులు కూడా హరిభూషన్‌ ‌మృతి చెందాడని చెబుతూనే వొచ్చారు. బుధవారం భదాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌ ‌దత్‌ ‌విలేఖరుల సమావేశంలో కూడా హరిభూషన్‌ ‌మృతిని ధృవీకరించారు. 21వతేదీ సోమవారం నాడు హరిభూషన్‌ ‌మృతి చెందితే 24వ తేదీ గురువారం నాడు హరిభూషన్‌ ‌మృతిని ధృవీకరిస్తూ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌ ‌లేఖ విడుదల చేశారు. దీంతో ఉత్కంఠకు తెరపడినట్లు అయ్యింది. మహిళా మావోయిస్టు సిద్ధబోయిన సారక్క అలియాస్‌ ‌భారతక్క 22న ఉదయం 9.50 గంటలకు మృతి చెందడం జరిగింది. వారి అంత్యక్రియలు ప్రజల మధ్యనే పూర్తి చేసినట్లు లేఖలో తెలిపారు.

హరిభూషన్‌ అలియాస్‌ ‌యాప నారాయణ మహబూబాబాద్‌ ‌జిల్లా, గంగారం మండలం మడగూడెం గ్రామంలో ఆదివాసీ కుటుంబంలో జన్మించాడు. ఇంటర్మీయట్‌ ‌వరకు నర్సంపేటలో చదివి, హన్మకొండలో డిగ్రీ పూర్తి చేశాడు. ఈ సమయంలోనే నగ్జల్బరీ శ్రీకాకుళ రైతాంగ ఉద్యమాల ప్రభావంతో దేశవ్యాప్తంగా రగులుతున్న భూస్వామ్య వ్యతిరేక పోరాటాల ప్రభావం జగిత్యాల జైత్రయాత్ర నుండి ఆదిలాబాద్‌, ‌కరీంనగర్‌, ‌వరంగల్‌ ‌జిల్లాల్లోకి పాకి పెద్ద ఎత్తున కొనసాగిన రైతాంగ పోరాటాలకు విద్యార్థులు నాయకత్వం వహించడంతో వందలాది విద్యార్థులపై విప్లవ రాజకీయాల ప్రభావం పడింది.

Maoist State Committee Secretary1

అందులో భాగంగానే హరిభూషన్‌ ‌పై కూడా విప్లవ రాజకీయాలు ప్రభావితం చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో పార్టీ నిర్ణయం మేరకు 1991లో అటవీ దళంలో చేరాడు. కొద్ది కాలం నెక్కొండ దళంలో పని చేసి అక్కడి నుండి పాడవ దళంలో సభ్యుడుగా డిప్యూటీ కమాండర్‌గా, ఆర్గనైజర్‌గా బాధ్యతలు చేపట్టి అంచెంచలుగా హరిభూషన్‌ ఎదిగాడని లేఖలో తెలిపారు. 1996లో ఖమ్మం జిల్లా కమిటీ మెంబర్‌గా కొనసాగుతూ, 1998 నవంబర్‌లో ఉత్తర తెలంగాణ మొదటి ప్లాటూన్‌ ‌బాధ్యతలు తీసుకున్నాడు. 2000 సంవత్సరంలో కేంద్ర కమిటీ ప్రొటెక్షన్‌ ‌ప్లాటూనుకు బదిలీ అయ్యి 2005 వరకు కొనసాగాడు. కొద్ది కాలం ఇన్స్‌ట్రక్టర్‌ ‌కూడా పని చేశాడు. 2005లోనే స్పెషల్‌ ‌జోనల్‌ ‌కమిటీ సభ్యుడుగా ప్రమోట్‌ అయ్యాడు.

అదే సంవకత్సరం చివరిలో విప్లవోద్యమ అవసరాల రిత్యా తిరిగి బదిలీపై ఉత్తర తెలంగాణకు వొచ్చి స్పెషల్‌ ‌జోనల్‌ ‌కమిటీ సభ్యుడుగా కొనసాగుతూ వొచ్చాడు. 2015 ప్లీనంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా, 2018 నవంబర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 33 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో గెరిల్లా జోన్‌ ‌నిర్మాణ కృషిలో తీవ్రమైన శత్రువు నిర్బంధంలో అనేక ఎత్తుపల్లాలను, ఆటుపోట్లను, కష్ట నష్టాలను ఎదుర్కుంటూ ముందుకు సాగాడని విడుదలచేసిన లేఖలో తెలిపారు. ఏనాడు మడమ తిప్పి చూడలేదు. ప్రతి మలుపులో డైనమిక్‌ ‌నిర్ణయాలు తీసుకున్నాడు. కష్ట సమయాల్లో ప్రజలతో, క్యాడర్లతో వెంట వుండి మార్గ నిర్ధేశం చేస్తూ వొచ్చాడు. హరిభూషన్‌ ‌పాండవ దళంలో కమాండర్‌, ఆర్గనైజర్‌. ఇక్కడే పది సంవత్సరాల పాటు రాజకీయ నిర్మాణ కృషి చేశాడు. ఎంఎల్‌ ‌పార్టీల రంగు బహిరంగం చేస్తూ ప్రజలను నిజమైన విప్లవ రాజకీయాల వైపు నిలబెట్టాడు. శత్రువు నిర్బంధంతో తెలంగాణ విప్లవోద్యమం దెబ్బతిని వర్గ సంఘాలు పని చేయలేని స్థితిలో ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి నూతన పోరాట నిర్మాణ రూపాలు చేపట్టి, మిలిటెంట్‌ ‌ప్రజా పోరాటాలు చేపట్టి తెలంగాణ ఉద్యమాన్ని పురోగమింప చేసారని లేఖలో వివరించారు.

1998 నుండి 2015 వరకు తను మిలటరీ విభాగంలో బాధ్యతలు చేపట్టి అనేక గెరిల్లా చర్యలకు నాయకత్వం వహిస్తూ ప్రజా యుద్ధ అభివృద్ధికి విశేష సేవలందించాడు. సిద్ధబోయిన సారక్క అలియాస్‌ ‌భారతక్క ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామంలో ఆదివాసి పేద కుటుంబంలో జన్మించింది. ఉత్తర తెలంగాణ రాష్ట్రంలోని భూస్వామ్య వ్యతిరేక పోరాటాలతో ప్రభావితమై, ఆదివాసి ప్రాంతంలో ఫారెస్టు జులూంను వ్యతిరేకిస్తూ 1985లో ఏటూరునాగారం మొట్టమొదటి దళంలో చేరి తన విప్లవ ప్రస్థానాన్ని ఆరంభించినట్లు తెలిపారు.. 86లో అరెస్టు అయ్యి రెండు సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించింది. తను జైలు నుండి బయటికి వొచ్చే నాటికి అప్రకటిత యుద్ధం కొనసాగుతున్నప్పటికీ వెరవకుండా మళ్ళీ దళంలో చేరింది. 1989లో తన సహచరుడు కోటి హన్మన్న అమరుడు కావడం, అదే సమయంలో అభిలాష్‌ ‌జన్మించడం జరిగినప్పటికీ తను ఏమాత్రం కలత చెందలేదు. ప్రజల కోసమే గట్టిగా నిలబడింది. తన కుమారుడు పెరిగి పెద్దయ్యాకా నిస్వార్థంగా కామ్రేడ్‌ అభిలాష్‌ను విప్లవోద్యమంలో తీసుకు వొచ్చి ఎదిగించుకుంది.

2020 జూన్లో కొడుకు అభిలాష్‌ ‌గడ్చిరోలిలో అమరుడయ్యాడు. సంవత్సరం తిరగకుండానే 29 సంవత్సరాలు కలిసి జీవించిన కత్తి మోహన్‌ ‌రావు 10 జూన్‌-2021‌లో గుండె పోటుతో మరణించారు. 12 రోజుల వ్యవధి లోనే భారతక్క తుదిశ్వాస విడిసింది. కాని ప్రజలు, పార్టీ శ్రేణులు, పిఎల్డీఏ ప్రభుత్వ కుయుక్తులను తిప్పి కొడుతూ ప్రియతమ నాయకులను కాపాడుకున్నారు. అఖరికి సామ్రాజ్యవాదులు తమ లాభాల కోసం చేసిన పర్యావరణ విధ్వంసంతో ప్రమాదకర కొరోనాను సృష్టించి ఈ సమాజంపై వదిలారు. అందులో భాగంగా కోవిడ్‌ 19 ‌రూపంలో హరిభూషన్‌, ‌భారతక్కను బలికొన్నారు. వీరే కాదు దోపిడీ వర్గాలు సృష్టించిన కొరోనా మూలంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల జీవితాలను బలితీసుకుంటున్నారు. అంతేకాదు ఈ ప్రమాద కరమైనా కొరోనా ఆర్థిక వ్యవస్థలనే కుదిపేస్తున్నది. వీటికి మూల కారణమైన సామ్రాజ్యవాదులను, దలారీ నిరంకుశ పెట్టుబడి దారులను, భూస్వామ్యాన్ని కూల్చకుండా ప్రజలకు శాశ్వత విముక్తి లేదు. నూతన ప్రజా స్వామిక విప్లవమే పీడిత ప్రజలకు ఏకైక మార్గం. హరిభూషన్‌, ‌భారతక్కలు ఇదే మార్గంలో చివరి వరకు పోరాడాడినట్లు గురువారం విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply