Take a fresh look at your lifestyle.

మావోయిస్టుల బంద్: ‌పోలీసుల హైఅలర్ట్

  • ‌ప్రభావిత జిల్లాలలో భారీ కూంబింగ్‌  
  • ‌నిఘా వర్గాల హెచ్చరికలతో డ్రోన్‌ ‌కెమెరాలతో ముమ్మరంగా నిఘా

ప్రజాకవి, విరసం నేత వరవరరావును వెంటనే విడుదల చేయాలనీ, రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న అప్రజాస్వామిక విధానాలకు నిరసనగా శనివారం మావోయిస్టు రాష్ట్ర కమిటీ ఇచ్చిన తెలంగాణ బంద్‌ ‌పిలుపుతో రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలలో రాష్ట్ర పోలీసులుతో పాటు కేంద్ర బలగాలతో భారీ కూంబింగ్‌ ‌చేపట్టారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ ‌పేరిట శనివారం బంద్‌ ‌పిలుపుతో పాటు ఈనెల 28 నుంచి వారం పాటు అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించనున్నట్లు ప్రకటనలు వెలువడటంతో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. దీంతో బంద్‌ను విఫలం చేయాలని పోలీసు యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టింది. మావోయిస్టుల బంద్‌ ‌పిలుపు నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మావోయిస్టు ప్రభావిత జిల్లాల ఎస్పీలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు.

అన్ని పోలీసు స్టేషన్లలో పని చేసే సిబ్బందిని అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం రాత్రి నుంచే స్పెషల్‌ ‌పార్టీ, గ్రేహైండ్స్ ‌బలగాలు మావోయిస్టు ప్రభావిత ములుగు, జయశంకర్‌ ‌భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ‌భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌ ‌జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతాలలోని గ్రామాలలో అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు ఆయా ప్రాంతాలలో హై అలర్ట్ ‌ప్రకటించారు. ముఖ్యంగా ఈనెల మొదటి వారంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన కుమ్రంభీం ఆసిఫాబాద్‌ ‌జిల్లాలోని తిర్యాణి అటవీ ప్రాంతాలలోని గ్రామాలలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మావో••యిస్టు సానుభూతిపరులపై ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రాణహిత, గోదావరి పరీవాహక ప్రాంతాలలపై ప్రత్యేక దృష్టి సారించిన బలగాలు అణువణువూ మావోయిస్టుల కోసం అణువణువూ జల్లెడ పట్టాయి. కొత్త వ్యక్తులు గ్రామంలోకి వస్తే సమాచారం ఇవ్వాలని ఆయా గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ సరిహద్దు చత్తీస్‌గఢ్‌, ‌మహారాష్ట్ర సరిహద్దులలోని ప్రాణహిత, గోదావరీ పరీవాహక ప్రాంతాలలో డ్రోన్‌ ‌కెమెరాల సహాయంతో మావోయిస్టుల జాడ కనిపెట్టే ప్రయత్నం చేశారు. వాహన తనిఖీలతో పాటు అనుమానితులు ఎవరైనా కనిపిస్తే వారి పూర్తి సమాచారం సేకరించి వదిలిపెట్టారు. శనివారం రాత్రి వరకూ తెలంగాణవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply