Take a fresh look at your lifestyle.

క్షణానికోపేరు.. కాంగ్రెస్‌ అధ్యక్ష అభ్యర్థి ఎంపికలో అనేక మలుపులు

ఆల్‌ ఇం‌డియా కాంగ్రెస్‌ ‌కమిటి అధ్యక్ష అభ్యర్థి విషయంలో చివరి రోజున అనేక మలుపులు తిరిగి చివరకు ఇద్దరు నామినేషన్‌తో గడచిన మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠతకు తెరపడినట్లైంది. వీరిద్దరు కూడా వారివారి మద్దతుదారులతో శుక్రవారం ఎన్నికల అధికారికి నామినేషన్‌ ‌పత్రాలను అందజేశారు. అధ్యక్షుడి ఎన్నిక  విషయంలో జరిగిన అనేక పరిణామాలకు కారణమైన అశోక్‌ ‌గెల్లోతు కానీ, రాహుల్‌గాంధీ భారత్‌ ‌జోడో పర్యటలో ఉన్న దిగ్విజయ్‌సింగ్‌ను అగమేఘాలమీద పిలిపించి నామినేషన్‌ ‌పత్రాలను సిద్దంచేసినా వీరిరువురూ ఈ ఎన్నికకు దూరంఉండగా  కొత్తగా మల్లిఖార్జున ఖర్గే పేరు తెరమీదకు రావడం మరో ట్విస్ట్.
‌దాదాపు రెండు దశాబ్దాల  తర్వాత అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని అలంకిరించే అవకాశం పార్టీలోని గాంధీ యేతర సీనియర్‌ ‌నాయకులకు లభించింది.

అయితే ఎన్నికలను సామరస్యపూర్వకంగా నిర్వహించుకోవాలన్న ఉద్దేశ్యంగా వివాదరహితుడైన రాజస్తాన్‌ ‌ముఖ్యమంత్రి అశోక్‌ ‌గెహ్లోత్‌ను అభ్యర్థిగా నిలబెట్టాలని కాంగ్రెస్‌ అధిష్టానం,  సోనియాగాంధీ భావించింది. అయితే ఆయన షరతులు విధించడంతో  పార్టీలో గత మూడు నాలుగు రోజులుగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. అయినా అశోక్‌ ‌గెహ్లోత్‌ ‌తన పట్టు విడువకపోవడంతో పార్టీకి మరో అభ్యర్థిని సిద్ధం  చేయక తప్పలేదు. కాంగ్రెస్‌ ‌పార్టీ గత దశాబ్ధకాలంగా క్షీణించిపోతున్నప్పటికీ ఆ పార్టీనే పట్టుకుని ఉంటున్న సీనియర్‌ ‌నాయకులకు మాత్రం కొదవలేదు. గాంధీ(నెహ్రూ) కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న దిగ్విజయ్‌సింగ్‌ అం‌దుకు ప్రత్యమ్నాయంగా  పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఆయన శుక్రవారం చివరి రోజున నామినేషన్‌ ‌దాఖలు చేసేందుకు ముందురోజే పత్రాలను సిద్ధం చేసుకున్నాడు. అప్పటికే మాజీ మంత్రి, పార్టీ ఎంపికూడా అయిన శశిథరూర్‌, ‌మరో సీనియర్‌ ‌నాయకుడు, ఎంపి మల్లిఖార్జున ఖర్గే ఈ పదవికి పోటీ పడేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తుండడంతో పోటీని నివారించే ఉద్దేశ్యంగా దిగ్విజయ్‌సింగ్‌ ‌స్వయంగా మల్లిఖార్జున ఖర్గే  ఇంటికి వెళ్ళి ఆయనతో చర్చించారు.  ఖర్గే పోటీలో పాల్గొనే విషయంలో పెద్దగా ఆసక్తి కనబర్చకపోవడంతో తాను నామినేషన్‌ ‌పత్రాలను తీసుకున్నట్లు  శుక్రవారం   ఉదయం దిగ్విజయ్‌సింగ్‌ ‌దిల్లీ లో  మీడియా ముందు చెప్పారు.

అయినప్పటికీ  మీడియాలో ఖర్గేపేరు వినిపిస్తుండడంతో మరోసారి తానే స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి, ఆయన ఆసక్తి కనబరుస్తున్న విషయాన్ని తెలుసుకున్నానని మీడియా ముందు వివరించారు. వాస్తవంగా ఖర్గే కాంగ్రెస్‌ ‌పార్టీలో చాలా సీనియర్‌ అని, పార్టీ ఆయన్ను గౌరవంగా చూస్తుందని, తనకు కూడా ఆయనంటే అంతే గౌరవమని, అలాంటి వ్యక్తితో తాను పోటీ పడటం సరికాదన్న అభిప్రాయంగానే తాను పోటీ నుండి తప్పుకుంటున్నట్లు మీడియాముందు ఆయన వివరించడంతో సోనియాగాంధీ సూచించిన ఇద్దరూ ఈ పోటీనుండి నిష్క్రమించినట్లు అయింది. అదికూడా ఖర్గేకు అనుకూలంగానే తాను విరమిస్తున్న విషయాన్ని ఆయన స్పష్టంగా ప్రకటించడం చూస్తుంటే  పోటీ చేస్తానని ప్రకటించిన  శశిథరూర్‌వైపు అధిష్టానం మొగ్గు చూపడంలేదన్న విషయం స్పష్టమవుతున్నది. అప్పటివరకు దిగ్విజయ్‌సింగ్‌, ‌శశిథరూర్‌ ‌మధ్య  పోటీ కొనసాగుతుందనుకుంటే, మల్లిఖార్జున ఖర్గేతో కొత్త మలుపు తిరిగినట్లు అయింది.  వీరిద్దరు కూడా శుక్రవారం తమ నామినేషన్‌ ‌పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు.  వీరిద్దరి మధ్య పోటీ కొనసాగుతుందా? విత్‌‌డ్రా నాటికి ఇద్దరిలో ఒకరు విరమించుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే. అయితే పోటీ పడడం ప్రజాస్వామ్య లక్షణంగా శశిథరూర్‌ ‌వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఎంతమంది పోటీ పడితే అంత మంచిదని, అదికూడా స్నేహపూర్వక పోటీయే అంటారాయన. ఎవరు పోటీ పడిన అందరిదీ ఒకటే సిద్ధాంతం,  పార్టీని బలపర్చడమేనంటున శశిథరూర్‌ ‌మాటలు చూస్తుంటే ఆయన పోటీనుండి తగ్గే అవకాశాలు లేవనిపిస్తోంది.
ఆరవై ఏడేళ్ళ శశిథరూర్‌ ‌విద్యావంతుడు. కేంద్ర మంత్రిగా, అంతర్జాతీయ దౌత్యవేత్తగా వ్యవహరించిన వ్యక్తి. తిరువనంతరపురం పార్లమెంటు నియోజకవర్గానికి  రెండవసారి ప్రాతినిధ్యం వహిస్తున్నవ్యక్తి. అమెరికాలో విద్యనభ్యసించి డాక్టరేట్‌ ‌చేశాడు. న్యూయార్క్ ‌టైమ్స్, ‌ద వాషింగ్‌టన్‌ ‌పోస్ట్, ‌గార్డియన్‌ ‌పత్రికలకు కాలమిస్టు. ఆయన రచయితకూడా. పద్దెనిది పుస్తకాలను రచించిన వ్యక్తి.

అలాగే ఎనభై ఏళ్ళ మల్లిఖార్జున ఖర్గేకు షెడ్యూల్డ్ ‌కులాల నాయకుడిగా మంచి పేరుంది. ఆయన వరుసగా తొమ్మిది సార్లు శాసన సభ్యుడిగా ఎంపికై, గతంలో గుల్బర్గా నుంచి  పార్లమెంటుకు ఎన్నికైనాడు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా రాజ్యసభ లో కాంగ్రెస్‌ ‌పక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. . హేతుబద్ద ఆలోచనలు కలిగిన వ్యక్తిగా ప్రజల్లో, పార్టీలో ఆయనకు మంచి పేరుంది.  విచిత్రమేమంటే వీరిద్దరూ దక్షిణ ప్రాంతానికి చెందినవారు కావడం. ఖర్గేది కర్ణాటక అయితే, శశిథరూర్‌ది కేరళ. ఖర్గే గ్బుర్గా పార్లమెంట్‌ ‌నియజకవర్గంనుండి ప్రాతినిధ్యం వహిస్తుంటే, థరూర్‌ ‌తిరువనంత పురం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన పార్టీలో సంచలనం లేపిన జి 23 నాయకుడిగా గుర్తింపు ఉంది. ఇద్దరిలో ఎవరు ఎన్నికైనా  ఆ క్రెడిట్‌ ‌దక్షిణ ప్రాంతానికే దక్కనుందనడంలో సందేహంలేదు. కాగా  సోనియాగాంధీ ఖర్గేవైపే మొగ్గుచూపే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నది. చాలా కాలం తర్వాత ఒక దళిత నేతను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

Leave a Reply