తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న ఒక నిర్ణయం అనేక మంది మెదళ్ళకు పదును పెడుతున్నది. తెలంగాణ ఉద్యమ కాలంలో మాయల మరాఠీగా లభించిన పేరును ఆయన శాశ్వతం చేసుకుంటున్నారు. ఏ క్షణాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ఎవరికీ అంతుబట్టని విషయం. ఆయన తీసుకునే నిర్ణయాలు బహుచర్చనీయాంశంగా తయారవుతాయనడానికి తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చలే ఇందుకు నిదర్శనం. ఎవరి ఊహకు అందని నిర్ణయాన్ని ప్రకటించి రెండు రాష్ట్రాల ప్రజ)నే కాదు, రాజకీయవర్గాలను ఆశ్చర్యచకితులను చేయడం ఆయనకే చెల్లింది. ప్రభుత్వరంగ సంస్థలపై నడవవని ముద్రవేసి ఎక్కడికో అక్కడికి అమ్మిపారేయడమన్నది కేంద్ర ప్రభుత్వం విధానంగా పెట్టుకుంది. కొంత ఆర్థిక సహాయం చేయడం, నష్టాలను తగ్గించుకోవడంద్వారా వేలాదిమందికి ఉపాధిని కల్పించే సంస్థలను కొనసాగించవచ్చన్న ఆలోచనకు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా స్వస్తిపలకడమన్నది ఆచరణాత్మకమైంది. ఈ సంస్థలను బజారులో బేరానికి పెడితే ప్రజలు, విపక్షాలు, కార్మికులు చేపట్టే ఆందోళనలు కొంతకాలానికే పరిమితమై, తమ కండ్లముందు అవి ప్రైవేటు వ్యక్తులకు హస్తగతం అవుతుంటే దీనంగా చూస్తూ ఉ•డటంకన్నా ఏమీ చేయలని పరిస్థితి. అయితే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో మాత్రం కొత్త మలుపు కనిపిస్తోంది. ఈ ప్లాంట్‌ను ప్రైవేటుకు అప్పగించే విషయంలో ఆయా సంస్థలనుండి ఈ నెల 15న టెండర్లను ఆహ్వానించడమైంది.
ఇక్కడ విచిత్రమేమంటే గతంలో ఎక్కడా జరుగని రీతిలో ఈ బిడ్‌లో తాము పాల్గొంటున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది. నష్టాలను చవిచూస్తున్నాయని అమ్మకానికి పెట్టిన ప్రభుత్వ సంస్థలను ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలుచేసిన చరిత్రలేదు. కాని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అటు రాజకీయ వర్గాలను, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజ)ను కుదిపేస్తున్నది. తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్న సింగరేణి సంస్థ ఈ బిడ్‌లో పాల్గొనేందుకు సిద్ధమయింది. అందుకు కావాల్సిన సమాచారంకోసం సంబంధిత• అధికారులు విశాఖ చేరుకున్నారు కూడా. కెసిఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్న కెసిఆర్ బిడ్డింగ్‌లో పాల్గొనడమేంటన్న ప్రశ్న ఎదురవుతున్నది. కేంద్ర నిర్ణయాన్ని అడ్డుకోవాలెగాని తాను బిడ్డింగ్‌లో పాల్గొనడమంటే ఒక విధంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానించినట్లేనంటారు ఏపీ అధికారపార్టీ నాయకులు. మొత్తంమీద కెసిఆర్ నిర్ణయం ఏపీ, తెలంగాణ మధ్య మరో చిచ్చును రగిలించేదిగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా ఈ విషయంలో ఏపీలోని అధికారపార్టీని వేలెత్తి చూపేదిగా తయారైంది. పక్క రాష్ట్ర ప్రభుత్వం బిడ్డింగ్‌లో పాల్గొంటుంటే రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడమేంటన్నది ఇప్పుడా ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. అంటే కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం తలొగ్గుతుందన్న విమర్శను ఇప్పుడా పార్టీ ఎదుర్కోవాల్సి వొస్తోంది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కనుసన్నల్లో పాలన చేస్తున్నదని, విభజన ఒప్పందాలను సాధించుకునే విషయంలో కేంద్రాన్ని నిలదీయలేక పోతున్నదన్న అపవాద కూడా వైఎస్‌పార్టీకి ఉంది. ఈ క్రమంలో ఎంతో పేరు ప్రఖ్యాతులను ఆర్జించి, లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న సంస్థ ప్రైవేటు పరం కాకుండా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కనీస ప్రయత్నాన్ని కూడా చేపట్టలేకపోతున్నదన్న అపనింద ఏపీ ప్రభుత్వం మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక విధంగా బిఆర్‌ఎస్ పార్టీకి ప్రయోజనం కలిగించేదిగా ఉంది. ఏపీలో తమ పార్టీని విస్తృతించేందుకు బిఆర్‌ఎస్‌కు ఇదొక ఆయుధంగా మారబోతున్నది. అంతేగాక కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకున్నట్లు అవుతుంది. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం ఆదాని, అంబానీలాంటి వారికి కట్టబెట్టకుండా ఎలా అడ్డుకోవచ్చన్న విషయాన్ని రాజకీయ పార్టీలకు ముఖ్యంగా బిజెపిని వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు పాఠం నేర్పినట్లు అవుతుంది. ఆవిధంగా ఆ క్రెడిట్ అంతా బిఆర్‌ఎస్ అధినేతగా కెసిఆర్‌కు దక్కే అవకాశం ఉంటుంది. కేంద్రం ప్రజల ఆస్తులను అమ్మేస్తుంటే మేము ఎలా కాపాడుకుంటున్నామో చూడండని దేశ ప్రజలకు తెలియజేసే ఓ ఎత్తుగడగా కెసిఆర్ ఈ సంచల నిర్ణయాన్ని తీసుకున్నారన్న వాదన వినవస్తున్నది.
ఇప్పటికే అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ టిఆర్‌ఎస్ పార్టీని బిఆర్‌ఎస్ జాతీయ పార్టీగా మార్చి వివిధ రాష్ట్రాల్లో పాగా వేసే కార్యక్రమాన్ని కెసిఆర్ చేపట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని గద్దె దించాలన్న లక్ష్యంగా ముందుకు పోతున్న బిఆర్‌ఎస్ పక్కనున్న రాష్ట్రాలపై దృష్తి సారిస్తున్నారు. మహారాష్ట్రలో, ఏపీలో ఇప్పటికే పార్టీ అధ్యక్షులను ఏర్పాటుచేయడంతోపాటు కార్యక్రమాల కొనసాగింపు జరుగుతున్నది. తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు, చేపట్టిన ప్రాజెక్టులతో ఆయా రాష్ట్ర ప్రజలనుమెప్పించే ప్రయత్నం చేస్తోంది బిఆర్‌ఎస్. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ కాలంలో ఏపీ ప్రజలపై విషయం చిమ్మాడన్న అపవాద కెసిఆర్‌కు ఉంది. దానినుండి బయటపడేందుకు విశాఖను ప్రైవేటుపరం కాకుండా అడ్డుకోగలిగితే ఏపీ ప్రజల్లో కెసిఆర్ పట్ల అభిమానం పెరుగుతుంది. అది బిఆర్‌ఎస్‌కు రాజకీయంగా కలిసి వొచ్చే అంశమవుతుంది. అలాగే బయ్యారం ఉక్కు విషయంలో కేంద్రం మాట నిలుపుకోలేకపోయిన విషయాన్ని ఎత్తిచూపుతూ, రాష్ట్ర అవసరాలకు తగిన ఉక్కును విశాఖనుండి పొందవచ్చన్న బహుముఖ వ్యూహంతోనే కెసిఆర్ ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించి ఉండవచ్చని, నిజంగానే ఈ బిడ్ తెలంగాణకు దక్కుతే తప్పకుండా దేశ రాజకీయాల్లో తప్పక మార్పు వొస్తుందంటున్నారు రాజకీయ పరిశీలకులు.